Wednesday, April 21, 2010

వైక్యాట్‌ చేతికి భారతీ సిమెంట్‌

మెజార్టీ వాటా కొనుగోలుకు ఒప్పందం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సిమెంట్‌ కంపెనీ వైక్యాట్‌.. కడప ఎంపీ, వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డికి చెందిన భారతీ సిమెంట్‌లో మెజార్టీ వాటా (51 శాతం) కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కంపెనీ వాటాదార్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని వైక్యాట్‌ సోమవారం వెల్లడించింది. అయితే ఎంత ధరకు ఈ వాటా కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. కడప జిల్లా నల్లలింగాయపల్లె వద్ద 5 మి.టన్నుల వార్షిక సామర్థ్యంతో భారతీ సిమెంట్‌ కంపెనీ నిర్మాణాన్ని జగన్‌ చేపట్టిన విషయం విదితమే. భారతీ సిమెంట్‌ బ్రాండ్‌ పేరుతో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో సిమెంటు విక్రయాలను కూడా చేపట్టారు. భారతీ సిమెంట్‌ కొనుగోలుతో దక్షిణ భారతంలో వైక్యాట్‌ క్రియాశీలక సిమెంటు కంపెనీగా మారనుంది. రాష్ట్రానికే చెందిన సాగర్‌ సిమెంట్స్‌లో రెండేళ్ల క్రితం స్వల్ప వాటా కొనుగోలు చేయడంతో పాటు అదే సంస్థతో కలిసి కర్ణాటకలోని గుల్బర్గా వద్ద సంయుక్తంగా 5.5 మి. టన్నుల సామర్థ్యం కల సిమెంటు యూనిట్‌ను నెలకొల్పుతున్న విషయం విదితమే. 2.75 మి.టన్నుల సామర్థ్యంతో మొదటి దశను 2012లో పూర్తిచేస్తారు. ఈ యూనిట్లో వైక్యాట్‌కే మెజార్టీ వాటా ఉండగా, సాగర్‌ సిమెంట్స్‌ మైనార్టీ వాటాదారుగా ఉంది. దీంతో పాటు ఇప్పుడు భారతీ సిమెంట్‌ కూడా వైక్యాట్‌ చేతికి రావడంతో దక్షిణ భారతదేశంలో 10 మి. టన్నుల కన్నా ఎక్కువ సిమెంటు ఉత్పత్తి సామర్థ్యంతో అత్యంత క్రియాశీలకంగా మారనుంది.రాష్ట్ర ప్రముఖ సిమెంటు కంపెనీ మైహోమ్‌ సిమెంట్‌ కంపెనీలో మూడేళ్ల క్రితం మెజార్టీ వాటాను ఐరిష్‌ సంస్థ అయిన సీఆర్‌హెచ్‌ కొనుగోలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ కంపెనీకి అత్యధికంగా ఒక టన్ను ఉత్పత్తి సామర్థ్యానికి 200 డాలర్లకు పైగా విలువ రావడం గమనార్హం. అప్పట్లో అది పెద్ద చర్చనీయాంశమైంది. మై హోమ్‌ తర్వాత అదే స్థాయిలో జరిగిన మరొక పెద్ద వాటా విక్రయంగా భారతీ సిమెంట్‌ నిలుస్తోంది.