Thursday, April 22, 2010

ఇది సర్కారీ మాంద్యం!

విద్యుత్‌ ఛార్జీల పెంపుతో పరిశ్రమలపై పిడుగు
పారిశ్రామిక వర్గాల గగ్గోలు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: విద్యుత్‌ ఛార్జీలు పెంచాలనే నిర్ణయం పారిశ్రామిక రంగానికి పిడుగుపాటు కానుంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం, ఆందోళనలు.. విద్యుత్‌ కోతలతో సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న ఈ రంగాన్ని ఈ నిర్ణయం మరింత దారుణంగా దెబ్బ తీస్తుందని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య పరిశ్రమల్ని నడపటం కష్టమేనని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల పెంపుదల కారణంగా పరిశ్రమలపై రూ.2200 కోట్ల ప్రత్యక్ష భారంతో పాటు నిర్వహణ వ్యయం పెరిగి పరిశ్రమలు పెద్దఎత్తున మూతపడే అవకాశాలు పెరిగాయి. నష్టాన్ని తట్టుకునేందుకు ఉత్పత్తుల ధరలను భారీగా పెంచాలని కొన్ని యాజమాన్యాలు యోచిస్తున్నాయి. చివరికిది సామాన్యులపై పెనుభారం కానుంది.

ఆది నుంచీ పరిశ్రమలపైనే కన్ను: పారిశ్రామిక రంగమే అభివృద్ధిలో కీలకం. ఉపాధి కల్పనతోపాటు రాష్ట్ర ఆదాయంలో 30 శాతం దీని నుంచే సమకూరుతోంది. ఇతర రాష్ట్రాలు ఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండగా రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. గత అయిదేళ్లుగా ప్రభుత్వ వైఖరి వల్ల ఈ రంగం తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. విద్యుత్‌ ఉత్పత్తి, డిమాండ్‌లో తేడా వస్తే మొదటగా పారిశ్రామిక రంగంలోనే కోతను విధిస్తున్నారు. పన్నులు, ఆదాయ వనరుల పెంపుదలనూ ఈ రంగం నుంచే సాధ్యమైనంత ఎక్కువగా పిండుతున్నారు. ఇప్పుడు ఛార్జీల పెంపుదలనూ పరిశ్రమలకే వర్తింపజేయడం గమనార్హం.

అయిదేళ్లుగా కష్టాలే: ఫీడర్‌ (ప్రత్యేక) లైన్లను నిర్మించి పారిశ్రామిక రంగానికి నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తామని 2005 పారిశ్రామిక విధానంలో పేర్కొంది.

* ఎక్కడా ఈ లైన్ల నిర్మాణం జరగలేదు. పారిశ్రామిక వాడల్లో కొత్తగా ఒక్క సబ్‌స్టేషన్‌నూ చేపట్టలేదు.

* అయిదేళ్లుగా ప్రతీ వేసవిలో విద్యుత్‌ కోత విధిస్తోంది. ప్రతీ ఏటా పవర్‌ హాలిడే విధానం అమలు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఏకంగా రెండు రోజులు పూర్తి కోతతోపాటు, మిగిలిన రోజుల్లో నాలుగేసి గంటలు ఆంక్షలు విధించింది.

* సరఫరా చేసే విద్యుత్‌లో నాణ్యత లోపించింది. తరచూ ట్రిప్పింగ్‌ వంటి సమస్యలతో సరఫరా నిలిచి ఉత్పత్తికి నష్టం వాటిల్లుతోంది.

* వాస్తవ వినియోగంతో సంబంధం లేకుండా కాంట్రాక్టు లోడు పేరిట అదనపు భారం వేసింది.

* ఇతర రాష్ట్రాల కంటే ఛార్జీలు తక్కువేనని ప్రభుత్వం చెప్పుకుంది. వాస్తవానికి రాయితీలన్నీ కలిపితే ఇతర రాష్ట్రాలే మెరుగ్గా ఉన్నాయి. విద్యుత్‌ రాయితీని పరిశ్రమలకు సరిగా చెల్లించడం లేదు. బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రతీ ఏటా కోత విధిస్తోంది.

బాదుడే బాదుడు: వ్యాట్‌కు ముందు తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన పరిశ్రమలకు 14 ఏళ్ల తర్వాత పన్నులు చెల్లించే వెసులుబాటు ఉండేది. వ్యాట్‌ అమల్లోకి వచ్చాక దాన్ని ఎత్తివేసింది. బకాయిలను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ఇటీవల వ్యాట్‌ను రెండు శాతం పెంచగా తయారీ రంగంపై భారం వేసింది.

* 2002 సంవత్సరంలో నాలా (వ్యవసాయేతర భూముల) పన్నును ప్రభుత్వం రద్దు చేయగా దాన్ని పునరుద్ధరించి పరిశ్రమల నుంచి వసూలు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం పూనుకుంది.

* పారిశ్రామిక వాడల్లోని నిర్మాణాలపై భారీ ఎత్తున ఆస్తిపన్ను వసూలు చేస్తోంది. విలాస ప్రాంతాలు, ఆధునిక భవనాలతో సమానంగా షెడ్లపైనా పన్ను ఉంది.

* పెద్దపెద్ద కంపెనీలకు భారీ ఎత్తున భూములు కేటాయించిన ప్రభుత్వం వాస్తవంగా పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చిన వారికి మౌలిక వసతులు కల్పించ లేదు. చిన్నతరహా పరిశ్రమలకైతే భూములనే ఇవ్వలేదు.

* పరిశ్రమల మూతకు విద్యుత్‌ సమస్యలే ప్రధాన కారణమైనా వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించలేదు. మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించలేదు. విద్యుత్‌ కొరత సాకుతో పరిశ్రమల విస్తరణకూ అనుమతించడం లేదు.

* గత రెండేళ్లుగా మాంద్యం, విద్యుత్‌ కోతల వల్ల పారిశ్రామిక రంగం కోలుకోలేని విధంగా నష్టపోయింది. పది వేల చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. సెజ్‌లు, భారీ పరిశ్రమలు నిర్మాణాలను చేపట్టలేమంటూ చేతులెత్తేశాయి. మాంద్యం సమయంలో రుణాల వసూళ్లని వాయిదా వేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఒకేసారి భారీ వడ్డన: పరిశ్రమలకు యూనిటుకు 50 పైసల ఛార్జీని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించి, నిర్దేశిత సమయాల్లో వాడుకున్న కరెంట్‌కు అదనపు వడ్డింపునకు సిద్ధమైంది. ఈ లెక్కన నికరంగా యూనిటుకు రూ.1.60 పైసల భారం పడుతుందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేశాయి. దీని ద్వారా ఛార్జీలు ఇతర రాష్ట్రాలకంటే అధికంగా ఉండే వీలుందని వాపోతున్నాయి.

వేళల్ని బట్టి ఛార్జీలెలా సాధ్యం: వేర్వేరు సమయాల్లో విభిన్న ఛార్జీలను నిర్ణయించడం దేశంలో ఎక్కడా లేదు. అధిక ఛార్జీలు ఉన్న సమయంలో వినియోగాన్ని నియంత్రించడం ప్రభుత్వ ఎత్తుగడగా పారిశ్రామిక వేత్తలు భావిస్తున్నారు. అయితే.. నిర్ణీత గంటలే పరిశ్రమలను నడిపి, మిగిలిన సమయాల్లో మూసి వేయడం సాధ్యం కాదని వారు వాపోతున్నారు. వాస్తవానికి ఉత్పత్తి పరిశ్రమల్లో విద్యుత్‌ బాయిలర్లు, ఫర్నేస్‌లు నిత్యం వేడితోనే ఉండాలి. ఒకరోజు సెలవుతో అవి చల్లారిపోతే మళ్లీ వేడెక్కడానికి కనీసం 4 గంటల నుంచి 10 గంటల సమయం తీసుకుంటాయి. ఫర్నేస్‌లు వేడి తగ్గితే ఆ ప్రభావం రెండ్రోజులపాటు ఉంటుంది.

పరిశ్రమలను నడపలేం.. ఫ్యాప్సియా: ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఛార్జీలను పెంచి పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీసేందుకు పూనుకుందని చిన్నతరహా పరిశ్రమల సంఘాల సమాఖ్య (ఫ్యాప్సియా) అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ విమర్శించారు. ఈ ఛార్జీలతో తాము పరిశ్రమలను నడపలేమని, ఇతర వ్యాపారాలను చేపడతామని చెప్పారు. విస్తరణ గానీ, కొత్తగా పరిశ్రమలను నడిపేందుకు ఎవరూ ముందుకు రారని ఆయన స్పష్టం చేశారు.