Monday, April 19, 2010

మురిపిస్తున్న ఎఫ్‌ఎంసీజీ షేర్లు

డ్డీరేట్ల పెరగొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో గత నాలుగు సెషన్లుగా స్టాక్‌ మార్కెట్‌ పడుతూ వస్తున్నప్పటికీ.. కొన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లు మాత్రం వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఇందుకు కారణం త్వరలో వెలువడబోయే ఆ కంపెనీల ఆర్థిక ఫలితాలే. ఈసారి ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆదాయాలు, లాభాల స్థాయి మెరుగ్గా ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో మదుపర్లు హిందుస్థాన్‌ యునీలీవర్‌, ఐటీసీ, నెస్లే, ఏషియన్‌ పెయింట్స్‌, డాబర్‌, మారికో, జీఎస్‌కే కన్జూమర్‌ హెల్త్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌ తదితర షేర్లపై దృష్టి సారిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

అన్ని మంచి శకునములే.. మాంద్యం తగ్గుముఖం పట్టడం, ఆయా కంపెనీలు చేపడుతున్న ప్రచారాలు వాటి ఉత్పత్తులపై అందరి దృష్టి పడేందుకు అవకాశం కలుగుతోంది. దీనికి తోడు చక్కెర, పప్పు దినసులు వంటి ముడి సరకుల ధరలు కూడా గత ఏడాదితో పోలిస్తే కొంత మేర దిగివచ్చాయి. దీంతో ఈ సంస్థల ఉత్పత్తి వ్యయం బాగా తగ్గనుంది. ఎఫ్‌ఎంసీజీల ఖర్చులో ముడి సరకుల భారమే 40-50 శాతం మేర ఉంటుంది. ఇప్పుడు వీటి ధరలు తగ్గడం కంపెనీలకు బాగా కలిసి వస్తుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆయా సంస్థలు జనవరి-మార్చి త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చక్కెర, కొబ్బరి, పప్పు దినసుల ధరలు తగ్గడం డాబర్‌, నెస్లే, మారికో వంటి సంస్థలకు ఎక్కువగా కలిసి వస్తుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

లాభాల్లో 28 శాతం వృద్ధి! పలు అనుకూలతలతో దేశంలోని 8 ప్రధాన ఎఫ్‌ఎంసీజీ కంపెనీల త్రైమాసిక లాభాలు సుమారు 28%, ఆదాయాలు 14 శాతం వృద్ధి చెందవచ్చని మార్కెట్‌ విశ్లేషక సంస్థలు చెబుతున్నాయి. దీంతో ఏడాది ప్రాతిపదికన ఆయా కంపెనీల నికర లాభం మార్జిన్‌లు కూడా 16 శాతానికి చేరవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. ఐపీఎల్‌ నేపథ్యంలో జనవరి-మార్చి త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ప్రకటన ఖర్చులు మరింత పెరిగాయి. దీంతో మార్చి త్రైమాసికంలో ఈ సంస్థల ప్రకటనల ఖర్చు సగటు నికర అమ్మకాల్లో 10% మేర ఉండవచ్చు. ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణ గణాంకాలు సంస్థల్ని ఆందోళనకు గురి చేస్తున్నా. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే వివిధ ధరలతో ఉత్పత్తులను అందిస్తున్న సంస్థలకు మాత్రం భవిష్యత్‌ మరింత మెరుగ్గా ఉండనున్నట్లు వీరు చెబుతున్నారు.