విక్రయాలకు దిగుతున్న మదుపర్లు

భారత్ స్టాక్ మార్కెట్లో నమోదైన వాటిలో పాతికకు పైగా కంపెనీల్లో గోల్డ్‌మాన్ శాచ్స్ పెట్టుబడులు ఉండటం ఇందుకు కారణంగా భావించొచ్చు. ఆందోళన చెందుతున్న మదుపర్లు ఆయా కంపెనీల షేర్లలో విక్రయాలకు పాల్పడుతూ ఉండటంతో వాటి ధరలు క్రమేణా తగ్గిపోతున్నాయి.
సబ్‌ప్రైమ్ మార్టిగేజ్ ప్రోడక్టును మార్కెటింగ్ చేయడం ద్వారా బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4600 కోట్ల) మేర వినియోగదారులను మోసగించారంటూ, న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే గోల్డ్‌మాన్ శాచ్స్‌పై, అందులోని కొందరు సిబ్బందిపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (సెక్) కేసు నమోదు చేసిన సంగతి విదితమే. 2007 ఆరంభంలో సబ్‌ప్రైమ్ తనఖాలతో సంబంధం ఉన్న సీడీఓ (కొల్లేటరలైజ్డ్ డెట్ ఆబ్లిగేషన్స్)లను గోల్డ్‌మాన్ రూపొందించి, విక్రయించింది. మూలాధారమైన హామీపత్రాలకు హెడ్జ్ ఫండ్ పాల్సన్&కో సాయం చేసిన విషయాన్ని గోల్డ్‌మాన్ వెల్లడించలేదన్నది ప్రధాన ఆరోపణ. సెక్ కేసు నమోదు చేయగానే బ్రిటన్‌లోనూ డొంక కదిలింది. బ్రిటన్‌లో గోల్డ్‌మాన్ కార్యకలాపాలపై విచారణ సాగించాలని ఆర్థిక సేవల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఏ)ను ప్రధాని గార్డన్ బ్రౌన్ ఆదేశించారు. బ్యాంకింగ్ రంగంలో నైతికతకు సవాల్‌గా మారిన ఉదంతంగా ఆయన పేర్కొన్నారు. గ్రీస్ దేశ బడ్జెట్‌లో లోటును బయటపడనీయకుండా చూడటంలో గోల్డ్‌మాన్ పాత్రపైనా ఐరోపా యూనియన్ విచారణ చేయిస్తోంది. జర్మనీకి చెందిన ఆర్థిక సేవల నియంత్రణ సంస్థ కూడా కేసు వివరాలు తెలపాలని సెక్‌ను కోరింది. ఆర్థిక సంక్షోభం తరవాత అత్యంత ప్రభావం చూపే బ్యాంకుగా ఎదిగిన గోల్డ్‌మాన్ శాచ్స్‌కు ఈ కేసులు గుదిబండలా మారాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఈ సంస్థ షేరు ధర శుక్రవారం 13% తగ్గింది.