Tuesday, April 20, 2010

నేటి నుంచి బిఎస్ఎన్ఎల్ సమ్మె

న్యూఢిల్లీ: బిఎస్ఎన్ఎల్‌లోని ఎగ్జిక్యూటివ్‌లు, నాన్ ఎగ్జిక్యూటివ్‌లు సభ్యులుగా గల ఉద్యోగ సంఘాల ఉమ్మడి వేదిక ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి మూడు లక్షల మందికి పైగా సిబ్బంది మంగళవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించనున్నారు. లక్ష మంది బిఎస్ఎన్ఎల్ సిబ్బందికి విఆర్ఎస్ ఇవ్వాలని, కంపెనీలో 30 శాతం వాటాలను విక్రయించాలని శామ్ పిట్రోడా కమిటీ చేసిన సిఫారసులను నిరసిస్తూ బిఎస్ఎన్ఎల్ సిబ్బంది సమ్మె శంఖారావం పూరించారు. సమ్మె వల్ల టెలికాం సేవలకు ప్రధానంగా బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ నుంచి కాల్స్‌కు తీవ్ర అంతరాయం కలగవచ్చునంటున్నారు.

బిఎస్ఎన్ఎల్‌లో వాటాల ఉపసంహరణ ప్రణాళికను పక్కన పెట్టాలని, గత పదేళ్ళుగా డిప్యుటేషన్ మీదనే ఉంటున్న ఐటిఎస్ అధికారులను బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులుగా చేర్చుకోవాలని, బిఎస్ఎన్ఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రైవేటు కంపెనీలతో పంచుకోవడం విరమించుకోవాలని వారు డిమాండు చేస్తున్నారు. తమ డిమాండ్ల విషయంలో ఇటు బిఎస్ఎన్ఎల్ యాజమాన్యం నుంచి గాని, అటు ప్రభుత్వం నుంచి గాని ఎలాంటి స్పందన కనిపించలేదని, మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి తమ సమ్మె ప్రారంభం అవుతుందని టెలికాం ఉద్యోగుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి చందేశ్వర్ సింగ్ ప్రకటించారు.

సర్వీసులకు అంతరాయం కలగకుండా తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అనుబంధ ప్రణాళికలు రూపొందిస్తున్నామని బిఎస్ఎన్ఎల్ సిఎండి కుల్‌దీప్ గోయెల్ చెప్పారు. 10 వేల మంది సీనియర్ సిబ్బంది, ఐటిఎస్ కాడర్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంలేదని అన్నారు. సమ్మె ప్రయత్నాన్ని విరమింపచేసేందుకు ఎన్నో విడతలుగా వారితో చర్చలు జరిపామని, అయినా సమ్మె చేయాలని భావించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా టెలికాం ట్రేడ్ యూనియన్లతో శుక్రవారం తాను ఆరోగ్యకరమైన చర్చలు జరిపానని, పిట్రోడా కమిటీ సిఫారసుల విషయంలో వారికి కొన్ని అపోహలున్నాయని టెలీ కమ్యూనికేషన్ల మంత్రి ఎ రాజా సోమవారం న్యూఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నారు. తాను ప్రస్తుతానికి అంతకు మించి ఏమీ చెప్పలేనంటూ వారు సమ్మె ప్రయత్నం విరమించుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.