Wednesday, February 24, 2010

22 లక్షల కోట్ల నల్లధనం నిగ్గుతేలాలి

22 లక్షల కోట్ల నల్లధనం నిగ్గుతేలాలి
ప్రభుత్వ అధ్యయనం

న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో నల్లధనం ఎంత పరిమాణంలో చలామణిలో ఉన్నదన్న అంశంపై ప్రభుత్వం ఒక అధ్యయనం నిర్వహించబోతోంది. స్విట్జర్లాండ్ వంటి దేశాలతో పన్ను ఒడంబడికల కోసం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక వ్యవస్థలో నల్లధనం పరిమాణం స్థూల జాతీయోత్పత్తిలో (జిడిపి) 40 శాతం వరకు ఉండవచ్చునని కొన్ని అంచనాలు సూచిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది. భారత జిడిపి 2009 సంవత్సరంలో 55 లక్షల కోట్ల రూపాయలని గణాంకాలు చెబుతున్నాయి. పైన చెప్పిన అంచనాలే నిజం అయితే నల్లధనం పరిమాణం 22 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చునన్నది విశ్లేషకుల అంచనా.

కాని నల్లధనం పరిమాణంపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి గణాంకాలు అందుబాటులో లేవు. పన్ను ఎగవేతదారుల భరతం ప్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు ప్రారంభించింది. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాస్తున్న భారతీయుల వివరాలు కూడా రాబట్టేందుకు వీలు కల్పించే విధంగా ఆ దేశంతో 1995లోనే కుదుర్చుకున్న ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డిటిఎఎ) పరిధిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతోంది.

లెక్కల్లో చూపించకుండా దేశానికి వెలుపల పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా ఉన్న దేశాల్లో దాచిన నల్లధనం వెలికి తీసేందుకు వివిధ దేశాలతో పన్ను ఒడంబడికలు కుదుర్చుకోవాలని కూడా భావిస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ సఫలం కావాలంటే మొదట నల్లధనం ఎంత ఉందన్న అంశంపై ఒక అవగాహన తప్పనిసరి అన్నది ఆర్థిక శాఖ అభిప్రాయం. ఈ ప్రయత్నంలో భాగంగా చేపడుతున్న ఈ అధ్యయనం కింద దేశంలో నల్లధనం పరిమాణం ఎంత ఉంటుందన్న అంశంతో పాటు పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా భాిల్లుతున్న దేశాలేవీ, పన్ను ఒప్పందాలు-తీరుతెన్నులు, దేశవిదేశాల్లో పన్ను ఎగవేతదారులు అనుసరిస్తున్న ధోరణులు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

ఆదాయపు పన్ను శాఖ సమన్వయంతో ఆర్థిక రంగ నిపుణులు, పండితులు ఈ అధ్యయనం నిర్వహిస్తారని చెబుతున్నారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రతిపాదన ప్రక్రియ పూర్తి కాగానే ఈ అధ్యయనం ప్రారంభం కావచ్చునని ఈ పరిణామంతో సన్నిహిత సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా భాసిల్లుతున్న దేశాల వైఖరి పట్ల తీవ్ర ఆవేదన ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఇలాంటి ధోరణుల వల్ల పన్ను వసూళ్ళు గణనీయంగా దెబ్బ తింటున్నాయని, ఇది జాతీయ భద్రతకు కూడా ముప్పు అవుతుందని ఆందోళన చెందుతున్నారు.