Wednesday, February 24, 2010

స్టీల్ స్థాయికి సిమెంట్‌పై వ్యాట్‌ను తగ్గించాలి

స్టీల్ స్థాయికి సిమెంట్‌పై వ్యాట్‌ను తగ్గించాలి
బొగ్గు, జిప్సమ్‌పై దిగుమతి సుంకాన్ని ఎత్తివేయాలి
ఎగుమతులను ప్రోత్సహించాలి
సిమెంట్ పరిశ్రమ వినతి

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో సిమెంట్‌పై ఉన్న వేల్యూయాడెడ్ టాక్స్ (వ్యాట్)ను స్టీల్ వంటి ఇతర బిల్డింగ్ మెటీరియల్స్ స్థాయికి తీసుకురావాలని సిమెంట్ పరిశ్రమ రంగం ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసింది. అంతేకాకుండా సిమెంట్ ఉత్పత్తిలో ఇంధనంగా వినియోగించే బొగ్గు, జిప్సమ్ వంటి వాటిపై దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని కోరింది.

ఇతర బిల్డింగ్ మెటీరియల్స్‌తో పోలిస్తే సిమెంట్ పట్ల సుంకాల విషయంలో వివక్ష ఉంది, దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యాట్‌ను స్టీల్ స్థాయికి తీసుకురావాలని సిమెంట్ దిగ్గజం ఎసిసి లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ బెనర్జీ పేర్కొన్నారు. స్టీల్‌పై 4 శాతం వ్యాట్ ఉంగా, సిమెంట్‌పై భారీగా 12.5 శాతం మేరకు ఉంది. ఈ రెండు ఉత్పత్తులు కూడా నిర్మాణ రంగంలో వినియోగించేవే కాబట్టి రెండింటిపైనా ఒకే తరహా వ్యాట్ ఉండాలని సిమెంట్ పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నాయి.

ధరలో 60 శాతం సుంకాలే
నిర్మాణరంగంలో సిమెంట్ ఎంతో కీలకమైనదని, దీనిపై ఏ ఇతర బిల్డింగ్ మెటీరియల్స్ కంటే కూడా అధిక పన్నును వసూలు చేస్తున్నారని, సిమెంట్ ఎక్స్ ఫ్యాక్టరీ ధరపైన 60 శాతానికి పైగా ప్రభుత్వం విధించే లెవీలు, సుంకాలు ఉంటాయని వాణిజ్య సంఘం ఫిక్కి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి బడ్జెట్ ముందు సమర్పించే విఙ్ఞాపన పత్రంలో పేర్కొంది.

మన దేశంలోనే అధిక సుంకం
ఆసియా పసిఫిక్ పాంతం మొత్తం మీద మన దేశంలో నే సిమెంట్‌పై అత్యధిక సుంకం ఉంది. ఈ ప్రాంతంలో సిమెంట్‌పై సగటు సుంకం 11.4 శాతం కాగా ఒక్క శ్రీలంకలో మాత్రం అత్యధికంగా 20 శాతం దాకా ఉంది.

దిగుమతులపై కస్టమ్స్ సుంకం
సమెంట్ ఉత్పత్తిలో ఇంధనంగా వినియోగించే బొగ్గు, జిప్సమ్ వంటి వాటిపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేయాలని, సిమెంట్ దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని విధించాలని సుమిత్ బెనర్జీ ఆర్థిక మంత్రిని కోరారు. దాల్మియా సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దాల్మియా కూడా ఇంచుమించుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్టీల్ మాదిరిగానే సిమెంట్‌కు కూడా 'డిక్లేర్డ్ గూడ్స్ ' ప్రతిపత్తిని కల్పించాలని ఆయన అన్నారు. దీని మూలంగా సిమెంట్ రంగం పన్నులపై వ్యయాన్ని తగ్గించుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలి
సిమెంట్ రంగం ప్రస్తుతం మిగులు ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంది, ద్రవ్యోల్బణంపై సిమెంట్ ధర ప్రభావం చాలా తక్కువగా ఉన్నందున (టోకుధరల సూచీలో సిమెంట్ ప్రాతినిధ్యం 1.7శాతం మాత్రమే) సిమెంట్ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తే ఈ రంగంలోకి నూత పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉంది. లేనట్లయితే గల్ఫ్ మార్కెట్లో వ్యాపార అవకాశాలను పాకిస్తాన్ లాంటి దేశాలకు వదులుకోవాల్సి ఉంటుందని దాల్మియా పేర్కొన్నారు. సిమెంట్, క్లింకర్ ఎగుమతులను ప్రోత్సహించేందుకుగాను డ్యూటీ ఎన్‌టైటిల్‌మెంట్ పాస్ బుక్ (డిఇపిబి) విస్తరించాలని ఆయన కోరారు.

అతితక్కువ తలసరి వినియోగం
సిమెంట్ తలసరి వినియోగంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో వెనుకబడి ఉంది. దీనిని పెంచేందుకు ప్రజాప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపట్టాలని సిమెంట్ రంగం ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసింది.