Wednesday, February 24, 2010

ఎస్‌టిపిఐ గడువు పొడిగించాలి : ఐటి కంపెనీల విజ్ఞప్తి

ఎస్‌టిపిఐ గడువు పొడిగించాలి
ఐటి కంపెనీల విజ్ఞప్తి

కొత్త బడ్జెట్‌లో 2011 మార్చి31తో ముగిసిపోయే ఎస్‌టిపిఐ కాలపరిమితిని పొడిగించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఐటి పరిశ్రమలో ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతమవుతుంది. చైనా ప్రభుత్వం తమ దేశంలోని ఐటి పరిశ్రమకు అన్ని రకాలుగా సాయం అందిస్తోంది. ఆ స్థాయిలో కాకపోయినా.. పరిమితంగానైనా పరిశ్రమకు ప్రభుత్వం మద్ధతును అందించాలి. కొన్ని రాష్ట్రాల్లో విలువ ఆధారిత పన్ను(వ్యాట్), సేవల పన్ను గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపై రెండు రకాల పన్నులను వసూలు చేస్తున్నారు.

ఈ సమస్యను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పరిష్కరిస్తారని పరిశ్రమ ఆశిస్తోంది. ప్రస్తుతం దేశంలోని ప్రతీ నలుగురు ఇంజనీర్లలో ఒకరు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు. మిగిలిన ముగ్గురూ మెరుగైన విద్యాప్రమాణాలు లేకపోవడం ద్వారా ఉపాథి అవకాశాలను అందుకోవడంలో వెనుకబడిపోతున్నారు.

ఈ అంశంపై బడ్జెట్ 2010-11 దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం. కొత్త ఉద్యోగుల స్కిల్స్‌ను మెరుగుపరిచే శక్తిసామర్థ్యాలు చిన్న, మధ్యతరహా ఐటి సంస్థలకు ఉండటం లేదు. ఈ విషయంలో ఐటి ఎస్ఎంఇలకు ప్రభుత్వం మద్ధతును అందించాలి. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆటోమేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. బడ్జెట్‌లో మూడు శాతం నిధులను డిజిటలైజేషన్ ప్రక్రియకు కేటాయించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. కొత్త బడ్జెట్‌లో ఈ అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని ఐటి రంగం కోటి ఆశలతో ఎదురుచూస్తోంది.
-వి. రాజన్న, వైస్ ప్రెసిడెంట్,
రీజనల్ హెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

ఎస్‌టిపిఐ పథకాన్ని 3-5 ఏళ్లు పొడిగిస్తారని పరిశ్రమ ఆశిస్తోంది. ఎస్‌టిపిఐ యూనిట్లకు సెజ్‌లకు లభించే ప్రోత్సాహకాలు, మినహాయింపులను కల్పించాలి. అలాగే ఎస్‌టిపిఐని నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి అన్ని రకాల అనుమతులకు సింగిల్ విండోలా తీర్చిదిద్దాలి.
-శక్తిసాగర్, మేనేజింగ్ డైరెక్టర్, ఎడిపి

పదేళ్ల పాటు ఎస్‌టిపిఐ పథకాన్ని పొడిగిస్తేనే పరిశ్రమకు మేలు కలుగుతుంది. ప్రభుత్వ శాఖల్లో టెక్నాలజీ వ్యయం పెరగాలి. ఐటి పరిశ్రమకు మానవ వనరులే కీలకం. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులను పెంచాలి.
-నరసింహరావు, ప్రెసిడెంట్, ఐటిఎస్ఎపి

పెట్టుబడులకు ఊతం ఇచ్చి వృద్ధిరేటును పెంచే చర్యలు బడ్జెట్‌లో ప్రకటించాలి. మౌలిక వసతుల రంగంలో కొద్ది సంవత్సరాలుగా ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ రంగానికి ఉత్తేజం కల్పించడం అవశ్యం. అలాగే ఎస్‌టిపిఐ స్కీమ్‌ను పొడిగించి సాఫ్ట్‌వేర్ రంగానికి ఊతం ఇవ్వాలి. ఫ్రింజ్ బెనిఫిట్ టాక్స్‌పై కూడా స్పష్టమైన విధానం ప్రకటించాలి.
- రమేష్ లోకనాథన్, ఎండి, ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్.

ప్రత్యక్ష పన్నుల కోడ్ అమల్లోకి వస్తే, ప్రస్తుతం అమల్లో ఉన్న మినహాయింపులు కొనసాగుతాయా లేదా అనే అంశంపై స్పష్టత అవసరం. పన్నుల విషయంలో నెలకొన్న గందరగోళాన్ని కొత్త బడ్జెట్ తొలగిస్తుందని ఆశిస్తున్నాం.
-వి. లక్ష్మీకాంత్, మేనేజింగ్ డైరెక్టర్,
బ్రాడ్రిడ్జ్ ఫైనాన్సియల్ సొల్యూషన్స్