Wednesday, February 24, 2010

మళ్లీ 'మమత'ల రైల్వే!

మళ్లీ 'మమత'ల రైల్వే!
ఈ సారి కూడా చార్జీల పెంపు ఉండదు

అన్ని వర్గాలకూ ఏదో ఒక ప్రయోజం
కొత్త రైళ్లు, సరికొత్త పథకాలపై కసరత్తు
దక్షిణాదికి 12 డురొంటో, 2 జన శతాబ్ది రైళ్లు
కాశ్మీర్-కన్యాకుమారి మధ్య పీస్ ఎక్స్‌ప్రెస్
నాది 'జనతా బడ్జెట్': మమత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: బడ్జెట్ రైలు వస్తోంది! 'మమత'లు కురిపిస్తుంది! వరుసగా ఏడోసారి చార్జీలు పెంచకుండా రైల్వే బడ్జెట్ సమర్పించేందుకు యూపీఏ సర్కారు సిద్ధమవుతోంది. ఇందుకు రైల్వే మంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. 'అన్ని వర్గాలకూ ఎంతో కొంత' అనే మంత్రం పఠిస్తున్నారు. బుధవారం ఆమె లోక్‌సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత... మమత సమర్పిస్తున్న రెండో రైల్వే బడ్జెట్ ఇది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచే పీస్ ఎక్స్‌ప్రెస్, ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను కలుపుతూ వెళ్లే సంస్కృతి ఎక్స్‌ప్రెస్‌లు ఈసారి హైలెట్‌గా నిలిచే అవకాశముంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈసారి కూడా రైలు చార్జీల ధరలు పెంచే అవకాశం లేదు. మమత ప్రజాకర్షక పథకాలకే పెద్దపీట వేయనున్నారు. ప్రయాణికుల సంఖ్య పెంచుకునేందుకు కొత్త రైళ్లు, సరుకు రవాణా పెరిగేందుకు సరికొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశముంది. సమ్మిళిత అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు ప్రకటించనున్నట్లు 'రైల్ భవన్' వర్గాలు చెబుతున్నాయి. రైల్వేలపై మమతా బెనర్జీ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక శ్వేత పత్రాన్ని, విజన్ డాక్యుమెంట్-2020ను సమర్పించారు.

రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, రైళ్ల వేగం పెంపు, అధిక భద్రత, రైల్వే స్థలాల సమర్థ వినియోగం వంటి అంశాలను ఆమె విజన్ డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు. రైల్వే బడ్జెట్‌లోనూ ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు కొత్తగా 12 డురొంటో నాన్ స్టాప్ రైళ్లు, రెండు మూడు జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు ఇవ్వొచ్చని సమాచారం. బీహార్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే ఉండటంతో... ఈ రెండు రాష్ట్రాలకు కొత్త రైళ్లలో పెద్దపీట వేయడంతోపాటు, చార్జీల పెంపు జోలికి వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్‌లలోని లోకోమోటివ్, కోచ్ తయారీ యూనిట్ల పనులు వేగవంతం చేయడంతోపాటు... కోల్‌కతా మెట్రో నెట్‌వర్క్ విస్తరణ గురించి బడ్జెట్‌లో ప్రస్తావించవచ్చు. తరచూ చిన్నా పెద్దా ప్రమాదాలు జరుగుతుండటంతో... దీనిపై మమత ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

భద్రమైన ప్రయాణానికి అధిక కేటాయింపులు చేయనున్నారు. దీనిపై ఆమె ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఇంకా... రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అదనపు వసతులు, భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేక మహిళా దళం గురించి మమత ప్రకటించే అవకాశముంది. రిజర్వేషన్ కేంద్రాల పెంపు, తత్కాల్ పథకాన్ని మరింత సరళీకరించడం, విచారణ కోసం కొత్తగా '138' నెంబర్‌ను ప్రకటించడం, మరిన్ని 'జనాహార్' కౌంటర్ల ప్రారంభం, ఆహారంలో నాణ్యత... ఇవన్నీ మమత బడ్జెట్‌లో మెరుపులు కానున్నట్లు చెబుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం కూడా ఒక ప్రత్యేక రైలు ప్రకటించి రైతులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

రైల్వేలకు చెందిన స్థలాలను లాభసాటిగా ఉపయోగించుకోవడంలో భాగంగా మమత అనేక చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో ఆరోగ్య కేంద్రాలు, కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలతో ఇప్పటికే చర్చించారు. సరుకు రవాణాకు ప్రత్యేకంగా రైల్వే కారిడార్ ఏర్పాటు అవసరం గురించి మమత తన విజన్ డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు. బడ్జెట్ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని పేర్కొనే అవకాశముంది. గతనెలలో ఆమె పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.

రైల్వే నెట్‌వర్క్ విస్తరణలో భాగస్వామ్యులు కావాల్సిందిగా 'ప్రైవేటు'ను ఆహ్వానించారు. కొత్త రైల్వే ట్రాక్‌లలో ప్రైవేటు పెట్టుబడులు - లాభాల్లో వారి వాటా గురించి బడ్జెట్‌లో ప్రకటించే అవకాశముంది. అలాగే... ప్రస్తుతం వ్యాగన్లకు తీవ్ర కొరత ఉండటంతో, ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా 'వ్యాగన్ల సమీకరణ పాలసీ'ని రూపొందించినట్లు సమాచారం. మొత్తంమీద... సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్త దాకా అందరికీ లబ్ధి చేకూర్చే దిశగా మమత కసరత్తు సాగినట్లు తెలుస్తోంది.

వేచి చూడండి: మమత
రైల్వే బడ్జెట్‌లో ధరలు పెంచే అవకాశం లేదని మమతా బెనర్జీ సంకేతాలు పంపారు. తన బడ్జెట్‌ను సామాన్యుడికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. రైల్వే బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్న ఆమె మంగళవారం రాత్రి విలేఖరులతో మాట్లాడారు. 'సామాన్యుడే మాకు అండా దండ. బడ్జెట్ వారికే అంకితం' అని తెలిపారు. బడ్జెట్ విశేషాలు చెప్పేందుకు ఆమె నిరాకరించారు. 'వేచి చూడండి' అని ఊరించారు. ఆ తర్వాత ఆమె ప్రధాని మన్మోహన్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఇందులో విశేషమేమీ లేదని, బడ్జెట్ సమర్పణకు ముందు రోజు మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ అయ్యారని అధికారులు తెలిపారు.