ఈ సారైనా 'బెర్త్' దక్కేనా!
మమతమ్మ రైల్వే బడ్జెట్ మనపై కరుణ చూపేనా?
పై ఏటా అవే ఆశలు
అయినా ప్రతిసారీ నిరాశే..
ఈ సారి ఏమి జరిగేనో!!
హైదరాబాద్ : ఏటా బడ్జెట్ రైలు కోసం ఆశగా ప్లాట్‌ఫాంపై ఎదురుచూడటం. అది మన దగ్గర ఆగకుండా ముందుకు సాగిపోవడం. అనేక ఏళ్లుగా ఇదీ మన రాష్ట్ర పరిస్థితి! మరికొన్ని గంటల్లో మరోసారి మమతమ్మ రైల్వే బడ్జెట్ పట్టాలపైకొస్తోంది. మరి ఈసారైనా మనకు సరైన బెర్త్ దక్కుతుందా? ఏమో మరి వేచి చూడాల్సిందే! రాజకీయంగా, రైల్వేల్లో ఆదాయపరంగా కీలకమైన మన రాష్ట్రంపై ప్రతీ బడ్జెట్‌లోనూ చిన్నచూపే పడుతోంది. రాష్ట్రంలో డజనుకు పైగా ప్రధాన రైల్వే ప్రాజెక్టులు గత 3 దశాబ్దాలుగా పూర్తికాక మూలుగుతుండటమే ఇందుకు నిదర్శనం. బడ్జెట్ తరుణంలో మన పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిని ఒక్కసారి తరచి చూస్తే..
17 ఏళ్లుగా ఊరిస్తునన పెద్దపల్లి-జగిత్యాల-నిజామాబాద్ ప్రాజెక్టు పనులు కరీంనగర్ వరకూ పూర్తయ్యాయి. మిగిలిన లైను పూర్తికావాలంటే కనీసం రూ.250 కోట్లు అవసరం. ఇప్పటివరకూ కేటాయించింది రూ.10 కోట్లే.
పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మాచర్ల-నల్గొండ లైనుకు కేంద్రం పుష్కరం క్రితం పచ్చ జెండా ఊపింది. దీని నిర్మాణానికి రూ.498 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఇప్పటివరకూ రూ.2 కోట్లే కేటాయించారు. అది కూడా గత బడ్జెట్‌లోనే!
మహబూబ్‌నగర్ జిల్లాను కర్ణాటకలోని మునీరాబాద్‌కు కలుపుతూ 245 కిలోమీటర్ల మేర తలపెట్టిన భారీ లైనుకు రూ.498 కోట్లు అవసరం కాగా ఇప్పటివరకూ కేటాయించింది కేవలం రూ.5 కోట్లు. 14 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికీ మొదలు కాలేదు.
లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి కలల ప్రాజెక్టైన కాకినాడ-పిఠాపురం లైనుకు రూ.86 కోట్లు కావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.10 లక్షలు మాత్రం వ్యయ చేశారు. ప్లానింగ్ కమిషన్ పదకొండేళ్ల క్రితమే పచ్చజెండా ఊపినా పనులు ఇంకా పట్టాలెక్కలేదు.
దశాబ్దం కిందటి కోటిపల్లి-నర్సాపూర్ ప్రాజెక్టుకు సంబంధించి 695 కోట్ల వ్య యమవుతుందని అంచనా వేయగా ఇప్పటివరకు కేటాయింపులే జరగలేదు.
మనోహరాబాద్-కొత్తపల్లి లైనుకు రూ.670 కోట్లు అవసరం కాగా ఇప్పటివరకూ రూ.10 లక్షలు మాత్రం కేటాయించారు.
14 ఏళ్ల క్రితం మంజూరైన నంద్యాల-ఎర్రగుంట్ల ప్రాజెక్టుకు మొదట రూ.164 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం దాని అంచనా వ్యయం రూ.450 కోట్లకు చేరుకుంది. సర్వేలు పూరైన 11 లైన్లకు కేంద్రం చిల్లిగవ్వ కూడా విదల్చలేదు.
విశాఖ-వాల్తేరు రైల్వే డివిజన్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి దక్షిణ మధ్య రైల్వేకు మార్చాలన్న ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోవడం లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బిట్రగుంటలో స్లీపర్ ఫ్యాక్టరీలకు ఈ దఫా బడ్జెట్‌లోనైనా మోక్షం లభస్తుందేమో చూడాలి.
మదనపల్లి మీదుగా కడప-బెంగళూరు, మణుగూరు- రామగుండం, నడికుడి-శ్రీకాళహస్తి, భద్రాచలం-కోవూరు లైన్లకు సంబంధించి ముఖ్యమంత్రులు ఎన్నిమార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోవడం లేదు.