ఇక ఒక రోజు పవర్ హాలీడే
హైదరాబాద్: వారంలో ఒక రోజు పవర్ హాలీడే పాటించేందుకు పరిశ్రమలు అంగీకరించాయి. ఫ్యాప్సీ మంగళవారం నాడిక్కడ వివిధ పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వారంలో ఒక రోజు పవర్ హాలీడే ప్రకటించిన పక్షంలో, పీక్ అవర్స్‌తో సహా వారంలో ఆరు రోజుల పా టు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని పరిశ్రమల ప్రతినిధులు కోరారు. ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మాంద్యం ప్రభావం కారణంగా విద్యుత్ వినియోగానికి అధిక వ్యయం చేసే స్థితిలో తాము లేమని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి.
ఫ్యాప్సీ అధ్యక్షుడు కె. హరీష్ చంద్రప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ నానాటికీ పెరిగిపోతోందని అన్నారు. రానున్న నెలలో విద్యుత్ కోత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు శేఖర్ అగర్వాల్, ఫ్యాప్సీ ఎనర్జీ కమిటీ ఛైర్మన్ వి.అనిల్ రెడ్డి ఈ సందర్భంగా ప్రసంగించారు. వారంలో ఆరు రోజుల పాటు పీక్ అవర్స్‌తో సహా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తే, ఒక రోజును పవర్ హాలీడే పాటించేందుకు పరిశ్రమవర్గాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. విద్యుత్ సరఫరా పరిస్థితిని మెరుగుపర్చాలని, పవర్ కట్ షెడ్యూల్‌ను నియంత్రించాలని కోరాయి. 
