Wednesday, February 24, 2010

ఛార్జీలు పెరగవు!

ఛార్జీలు పెరగవు!
విజన్‌-2020 అమలుకు శ్రీకారం?
12 దురంతో రైళ్లు ప్రకటించే అవకాశం
బెంగాల్‌కు మళ్లీ పెద్దపీట
రైతులకు ప్రత్యేక రైళ్లు?
న్యూఢిల్లీ: రైల్వే మంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం 12 గంటలకు లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. యూపీఏ-2 ప్రభుత్వంలో రెండో రైల్వే బడ్జెట్‌ సమర్పిస్తున్న ఆమె మంగళవారం తన ప్రసంగానికి తుది మెరుగులు దిద్దడానికి రేల్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో క్లుప్తంగా మాట్లాడారు. ''ఈ బడ్జెట్‌ జనతాకే అంకితం. సామాన్యుడే మా ఆస్తి, బలం'' అని ప్రకటించారు. అనంతరం ప్రధానిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రైల్వే బడ్జెట్‌ రూపురేఖలపై అధికారులు విశ్వసనీయంగా వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

*ఈ దఫా కూడా ప్రయాణికుల టిక్కెట్‌ ధరలను పెంచరు. గత ఏడేళ్లుగా ఛార్జీలను పెంచడం లేదు. బీహార్‌, బెంగాల్‌ ఎన్నికలే కారణం కావొచ్చు.
*ప్రతీ వర్గానికి ఈ బడ్జెట్‌లో కొంత ప్రయోజనం ఉంటుంది. నూతన రైళ్లు, సరకు రవాణా వృద్ధికి నూతన పథకాల ప్రకటన వంటివి ఉంటాయి.
*వచ్చే దశాబ్దకాలంలో రైల్వేల్లో తీసుకురాదలచిన విప్లవాత్మక మార్పులపై రూపొందించిన దార్శనికపత్రం(విజన్‌-2020)అమలుకు శ్రీకారంచుడతారు.
*రైల్వే నెట్‌వర్క్‌ విస్తరణ, రైళ్ల వేగాన్ని పెంచడం, భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, రైల్వే భూములను వ్యాపార అవకాశాలకు వినియోగించుకోవడం లాంటి చర్యలు ఉండొచ్చు.
*డజను నాన్‌స్టాప్‌ దురంతో రైళ్లతో బాటు, దక్షిణాది రాష్ట్రాలకు జనశతాబ్ది రైళ్లు, బెంగాల్‌కు మరిన్ని నూతన సర్వీసులు ప్రకటించే అవకాశం ఉంది.
*ప్రమాదాల నివారణకు అదనపు నిధులు
*రిజర్వేషన్‌ కౌంటర్ల ఏర్పాటు, తత్కాల్‌ను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం
*మరో కొత్త రైల్వే విచారణ సంఖ్య '138' ప్రకటన
*వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైళ్లు
*ఆదాయాన్ని పంచుకునే పద్ధతిలో ప్రైవేటు భాగస్వామ్యంతో నూతన రైలు మార్గాల నిర్మాణ ప్రతిపాదన.
*బోగీల సేకరణకూ నూతన విధానం
*కాశ్మీరు నుంచి కన్యాకుమారికి శాంతి ఎక్స్‌ప్రెస్‌
*పర్యటక కేంద్రాలను కలుపుతూ సంస్కృతి ఎక్స్‌ప్రెస్‌
*కొత్తగా ముంబయి-కోల్‌కతా, చెన్నై-మంగుళూరుల మధ్య సరకు రవాణాకు ప్రత్యేక రైలుమార్గం. ఇప్పటికే ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-కోల్‌కతాలను కలుపుతూ ప్రత్యేక సరకు రవాణా మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి.
*ఇప్పటికే ప్రకటించిన 50 రైల్వేస్టేషన్లతో పాటు ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం.
*ఉత్తరప్రదేశ్‌కు పెద్ద రైల్వే ప్రాజెక్టు ప్రకటన.