రక్షణ సిబ్బంది కొరతతో పెరుగుతున్న దోపిడీలు
సమన్వయలోపంతో ప్రమాదాలు
ఆధునికీకరణ అంతంతమాత్రం
సాంకేతిక శిక్షణపై అశ్రద్ధ
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, న్యూస్‌టుడే: రైల్వేలో భద్రత నీటి బుడగలా మారింది. ఎప్పుడు ఎక్కడ దోపిడీ దొంగలు విజృంభిస్తారో తెలియదు. ఎప్పుడు సంబంధిత రైలు సాంకేతిక కారణాలతో గంటల తరబడి ఆగిపోతుందో తెలియదు. ఎప్పుడు విద్యుదాఘాతంతో మంటలు చెలరేగుతాయో అర్థం కాదు. దోపిడీలు, విద్రోహ చర్యలు: దోపీడీలు పెరగడానికి ప్రధాన కారణం సరిపడినంత మంది రైల్వే రక్షకదళ సిబ్బంది లేకపోవడమే. మొత్తం రైల్వేలోనే ఏటా మూడు శాతం మందిని తగ్గిస్తున్నారు. ప్రతీ రైలులో నలుగురు రైల్వే రక్షకదళ సిబ్బంది, ఇద్దరు సాధారణ రైల్వే పోలీసులు ఉండాలి. దోపిడీలు అధికంగా జరిగేచోట రైళ్లలో సాయుధ బలగాలను కూడా ఏర్పాటు చేశారు. అయినా, గత 18 నెలల వ్యవధిలో వరంగల్-ఖమ్మం జిల్లాల సరిహద్దులోని పాపటపల్లి వద్ద గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో మూడు సార్లు దోపిడీ జరిగింది. దక్షిణ మధ్య రైల్వేకు ఆరు వేల మంది బలగం అవసరం కాగా, ప్రస్తుతం 3078 మంది మాత్రమే ఉన్నారు. నిర్దేశిత సంఖ్యలో సగం మందినే రైలు రక్షణకు నియోగిస్తున్నారు. మూడువేల మంది రైల్వే రక్షకదళం ఎస్సైలు శిక్షణలో ఉన్నా వారిని 16 జోన్లకు సరిపెట్టాల్సి ఉంది. వెరసి దక్షిణ రైల్వేకు వచ్చేవారి సంఖ్య 70 మందికి మించే అవకాశం లేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వేలో దొంగతనాలు, దోపిడీలు 80 వరకూ నమోదు అయ్యాయి. దోపిడీలు ఎక్కువగా ఉండడంపై ఇప్పటికే రైల్వే బోర్డు సూపర్‌వైజర్ల బృందం నివేదిక కూడా తయారుచేసింది. 28 రైళ్లల్లో సంచార రైల్వేపోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు కాలేదు.
ప్రధాన రైల్వేస్టేషన్లు, తీరప్రాంత రైల్వే స్టేషన్లలో సీసీటీవీలు, మెటల్ డిటెక్టర్లు, సరకురవాణా తనిఖీ యంత్రాలు, పేలుడు పదార్థాల గుర్తింపు పరికరాలు, ప్రమాద హెచ్చరికల వ్యవస్థలు, బాంబు నిర్వీర్య పరికాలు అందుబాటులో ఉండాలి. ఈ విషయంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఘోరంగా వెనుకబడింది. బాంబులను గుర్తించే జాగిలాలు సికింద్రాబాద్‌లో తప్ప ఎక్కడాలేవు.
సిబ్బంది కొరత: ఉద్యోగులను తగ్గించే కార్యక్రమం అన్ని విభాగాల్లో కొనసాగుతోంది. వచ్చే రెండేళ్లలో ఇప్పుడున్న వారిలో 30 శాతం మంది పదవీ విరమణ చేస్తారు. దాంతో భారీ ఎత్తున ఖాళీలు ఏర్పడుతున్నాయి. దక్షిణమధ్య రైల్వే జోన్‌లో 16,358 ఖాళీలున్నాయి. ఒక కొత్త రైలు ప్రవేశపెడితే 187 మంది అవసరం. కనీసం ఒక్కరిని కూడా అదనంగా ఇవ్వడంలేదు. తత్సంబంధ సేవలను ప్రైవేటుపరం చేస్తున్నారు.
ప్రమాదాలు: దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు గడుస్తున్న బడ్జెట్లో కేటాయించింది రూ.3092 కోట్లు. దాంట్లో భద్రత పనులకు ఉద్దేశించింది కేవలం రూ.35 కోట్లు. ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ ఆధునికీకరణ వంద శాతం పూర్తి కాలేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రైళ్లు పట్టాలు తప్పకుండా అల్ట్రా సోనిక్ రైల్ టెస్టింగ్ కార్లను, వంతెనలను పరీక్షించేందుకు యంత్రాలను రూ.140 కోట్లతో అన్ని జోన్లకూ కొంటామని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వేకు ఒక్క పరికరం కూడా రాలేదు.
శీతాకాలంలో మంచు కారణంగా సిగ్నల్స్ కనబడక రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడం తరచుగా జరుగుతోంది. వీటిని నివారించే 'యాంటీ కొల్యూజన్ డివైస్'ను రెండేళ్లలో పూర్తి చేస్తామని రైల్వే ప్రకటించింది. ఇప్పటికీ జరగలేదు. 140 రైల్వే స్టేషన్లలో సమగ్ర భద్రత విధానాన్ని ప్రవేశ పెడ్తామన్నారు. కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం రైళ్ల భద్రత బాధ్యతలను ప్రభుత్వం జోనల్ అదనపు మేనేజర్లకు అప్పగించింది.
ప్రమాదాల నివారణకు పది 10 విభాగాల అధిపతులతో 2002-03లో సేఫ్టీ ఆడిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి, లోపాలు సరిచేసేలా చర్యలు తీసుకోవాలన్నది లక్ష్యం. ఇవేవీ ప్రణాళిక ప్రకారం జరగడం లేదు.
సమన్వయ లోపం: గత ఏడాది ఆగస్టులో మహబూబ్‌నగర్ జిల్లాలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్, బోగీలు వేరయ్యాయి. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇంజినీరింగ్, ట్రాక్ మెయింటినెన్స్, సిగ్నల్ వ్యవస్థల మధ్య సమన్వయ లోపంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంజిన్, బోగీల మధ్య మారిన కప్లింగ్‌ల అనుసంధానం టెక్నాలజీ విషయంలో 20 శాతం మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. దీనిపై మూడేళ్ల క్రితమే నివేదిక రైల్వేబోర్డుకు వెళ్లినా స్పందన లేదు.
భద్రత నిధి కుదింపు: రైల్వేలో 16,358 కిలోమీటర్ల ట్రాక్, 2,350 సిగ్నళ్లు, వేలసంఖ్యలో వంతెనల పర్యవేక్షణకు వెచ్చించాల్సిన రైల్వే భద్రతానిధిని చక్రాల తయారీ ఫ్యాక్టరీలకు మళ్ళిస్తున్నారు. దక్షిణమధ్య రైల్వేలో 70 ఏళ్ల కిందట నిర్మించిన వంతెనలు 200 వరకు ఉన్నాయి. ప్రమాదభరితంగా ఉన్న వీటిస్థానే కొత్త వంతెనల నిర్మాణానికి ఏటా రూ.500 కోట్లు కేటాయించినా ఐదేళ్లలో పరిస్థితిలో మార్పును తేవచ్చు. ప్రస్తుతం మరమ్మతులు చేసి పని నడిపిస్తున్నారు. 750 కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్‌ల ఉన్నాయి. గేట్లు ఏర్పాటుచేసే ప్రయత్నం జరక్కపోవడంతో పట్టాలు దాటే వాహనాలకు, రైళ్లకు ప్రమాదాలు వాటిల్లుతున్నాయి.