Wednesday, February 24, 2010

నిరంతరం విద్యుత్ ఇస్తే ఒక రోజు విరామం

నిరంతరం విద్యుత్ ఇస్తే ఒక రోజు విరామం
ప్రభుత్వానికి ఫ్యాప్సి ప్రతిపాదన

హైదరాబాద్ (బిజినెస్ బ్యూరో) : పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు వారంలో ఆరు రోజుల పాటు రద్దీ వేళల్లో కూడా కోత విధించకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లయితే ఒక రోజు విద్యుత్ వినియోగంపై విరామం తీసుకోనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక సంఘాల సమాఖ్య (ఫ్యాప్సి) ప్రతిపాదించింది. విద్యుత్ సరఫరా తీరుతెన్నులపై చర్చించేందుకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఫ్యాప్సి ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ప్రకటించింది.

విద్యుత్ కోత వేళలను నియంత్రిస్తూ విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని ఈ సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తీవ్రమైన విద్యుత్ కొరతను పరిగణనలోకి తీసుకుని నెలవారీ కనీస చార్జీలు, డిమాండ్ చార్జీల వసూలును ట్రాన్స్‌కో నిలిపివేయాలని కూడా ఫ్యాప్సి కోరింది. విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉన్నందువల్ల పరిశ్రమలు స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ వారిపై విధిస్తున్న 25 పైసల సుంకాన్ని ఉపసంహరించాలని కూడా కోరింది.