లక్ష ఎ-స్టార్ కార్లు వెనక్కి
లక్ష ఎ-స్టార్ కార్లు వెనక్కి
ఇంధన సరఫరా గొట్టంలో లోపాలే కారణం
పడిపోయిన మారుతీ షేర్లు
న్యూఢిల్లీ: టయోటా, హోండా కంపెనీల మాదిరిగానే తయారీ లోపంతో భారీగా కార్లను వెనక్కి పిలిపించే ప్రక్రియను మారుతీ సుజుకీ ఇండియా కూడా మొదలు పెట్టింది. సుమారు లక్ష ఎ-స్టార్ కార్లను మారుతీ సుజుకీ వెనక్కి పిలిపించనుంది. గత ఏడాది ఆగస్టుకు ముందు తయారు చేసి దేశ, విదేశాల్లో విక్రయించిన ఎ-స్టార్ కార్లలో ఇంధన సరఫరా గొట్టంలో ఏర్పడిన లోపాన్ని సవరించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకొంది. కంపెనీ అంతర్గత సర్వే, వినియోగదారుల అభిప్రాయల సేకరణలో ఈ లోపాన్ని గుర్తించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.ఇప్పటి వరకు సుమారు 50,000 వాహనాల్లో లోపాల్ని సరిదిద్దినట్లు వెల్లడించారు. లాట్‌లోని అన్ని వాహనాలను పరిక్షించి అవసరమైతే ఉచితంగా ఇంధన పంపు గ్యాస్‌కెట్ మార్చడం, 'ఓ' రింగ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 22 వరకు తయారు చేసిన లాట్‌కు చెందిన వాహనాలు వెనక్కి పిలిపించే వాటిలో ఉండనున్నాయి. 2008 నవంబరు 19న మారుతీ సుజుకీ ఇండియా 998 సీసీ, కే10బీ ఇంజిన్‌తో మారుతీ సుజుకీ ఎ-స్టార్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. మారుతీ నిర్ణయంతో సంస్థ షేరు మంగళవారం 4.4 శాతం మేర పడిపోయింది. చివరకు కొంత కోలుకొని 3.24 శాతం నష్టంతో రూ1,336.85 వద్ద ముగిసింది.