బడ్జెట్ తర్వాత నల్లధనంపై అధ్యయనం!
బడ్జెట్ తర్వాత నల్లధనంపై అధ్యయనం! న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థలో నల్ల ధనం ఎంత ఉందన్న అంశంపై గణాంక సంబంధ అధ్యయనాన్ని నిర్వహించనుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు 40 శాతం మేరకు నల్ల ధనం ఉండి ఉండవచ్చని ఇదివరకు ఆర్థిక వేత్తలు కట్టిన లెక్కలు సూచిస్తున్నాయని, అయితే అప్పటికీ ఇప్పటికీ బోలెడంత మార్పు చోటు చేసుకొందని, కచ్చితమైన తాజా సమాచారం ఏదీ అందుబాటులో లేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పన్ను ఎగవేతదారులు దేశం వెలుపల ఎంత ధనాన్ని ప్రభుత్వ లెక్కలలో చేరకుండా నిల్వ ఉంచిందీ కనిపెట్టి, దానిని వెలికితీయడానికి సర్కారు కసరత్తు చేపట్టిన విషయం విదితమేనని ఈ వర్గాలు గుర్తు చేశాయి. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్ వంటి దేశాలతో పన్ను ఒడంబడికల కోసం సంప్రదింపులకు కృషి చేస్తోంది. ప్రస్తుతం నల్ల ధనంపై అధ్యయనాన్ని ఆర్థిక నిపుణులు, మేధావులు చేపడతారని, ఇందుకోసం వారు ఆదాయపు పన్ను శాఖతో సమన్వయంగా పనిచేస్తారని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ అధ్యయనం బడ్జెట్ సమర్పణ అనంతరం మొదలవుతుందన్నాయి.