మార్కెట్ సమీక్ష
బడ్జెట్ గుబులు
దేశీయ మదుపరుల నుంచి మెరుగైన స్పందన లభించడంతో వరుసగా రెండో రోజు కూడా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం ఆసియా విపణుల మిశ్రమ పనితీరు కారణంగా సెన్సెక్స్ 23.91 పాయింట్ల నష్టంతో మొదలయింది. అయితే తరువాత కొంత కోలుకున్న మార్కెట్లు లాభాల బాట పట్టాయి. త్వరలోనే బడ్జెట్ ఉండటం, ఫిబ్రవరి కాంట్రాక్టుల ముగింపు తదితరాల గుబులుతో మదుపరులు రక్షణాత్మకంగా ట్రేడింగ్ జరపడం కనిపించింది. దీంతో మార్కెట్ ఊగిసలాట మధ్య రెండో రోజూ స్వల్పంగా లాభాలలో ముగిసింది. సెన్సెక్స్ 49.27 పాయింట్లు లాభపడి 16,286.32 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ కూడా అదే రీతిలో స్పందిస్తూ 13.62 పాయింట్ల లాభంతో 4,870.05 వద్ద ముగిసింది. 1924 స్క్రిప్‌లు నష్టాల్లో, 889 షేర్లు లాభాల్లో నిలిచాయి. బీఎస్‌ఈ టర్నోవర్ రూ.3,558.90 కోట్లుగా నమోదయింది. లిస్టింగ్‌కు వచ్చిన ఆక్వా లాజిస్టిక్స్ కౌంటర్లో అత్యధికంగా రూ.452.32 కోట్ల లావాదేవీలు జరిగాయి. 
బలపడిన స్థిరాస్తి, లోహ రంగాలు: స్థిరాస్తి రంగం రాణిస్తూ 0.96%లాభపడింది. లోహ రంగం కూడా 0.72% ముందంజ వేసింది. బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాన్ని పెంచే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో వాహన రంగ షేర్లు కుంగాయి. లక్ష ఎ-స్టార్ కార్లను వెనక్కి పిలిపించనున్నట్లుమారుతీ సుజుకీ వెల్లడించడంతో ఆ సంస్థ షేరు 3.24% మేరకుంగింది. లాభపడిన షేర్లు: సన్‌ఫార్మా (2.37%), డీఎల్‌ఎఫ్ (1.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.64%), స్టెరిలైట్(1.58%), హెచ్‌డీఎఫ్‌సీ (1.29%), విప్రో (1.15%), జేపీ అసోసియేట్స్ (1.11%), భారతీ (1.05%), భెల్ (1.07%) లాభాల్లో నిలిచాయి.