Wednesday, February 24, 2010

ఆర్థిక సంస్థల చలవతో గట్టెక్కిన ఆర్‌ఈసీ

ఆర్థిక సంస్థల చలవతో గట్టెక్కిన ఆర్‌ఈసీ
న్యూఢిల్లీ:రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) ఎఫ్‌పీఓ ఎట్టకేలకు ఓ మోస్తరు స్పందనతో ఊపిరిపీల్చుకుంది. రెండో రోజూ దాకా సగం స్పందనకే నోచుకున్న ఈ ఇష్యూకు మూడో రోజు దిగ్గజ సంస్థలు భారీ స్థాయి బిడ్‌లు దాఖలు చేయడంతో మూడు రెట్లకు పైగా స్పందన లభించినట్లయింది. మొత్తం 17.17 కోట్ల షేర్లకు గాను 53.26 కోట్ల షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయి. దేశీయ సంస్థలైన ఎల్‌ఐసీ, యూటీఐ, ఎస్‌బీఐలు చివరి రోజున ఎక్కువగా బిడ్లు దాఖలు చేశాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌ఐసీ రూ.800-1000 కోట్ల విలువ చేసే షేర్లకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ ఫండ్లయిన జేపీ మోర్గాన్‌, జేఎఫ్‌ క్యాపిటల్‌ పార్టనర్స్‌లు సైతం చివరి రోజే ముందుకొచ్చారు.

ఇక అర్హత గల సంస్థాగత మదుపుదార్లు తమకు కేటాయించిన షేర్ల కంటే 4.15 రెట్లు స్పందించారు. అధిక నికర విలువ గల వ్యక్తులు(హెచ్‌ఎన్‌ఐ) 74 శాతం స్పందించగా.. రిటైలర్లు కేవలం 12 శాతం మాత్రం షేర్లకే దరఖాస్తు చేశారు. 'రిటైలర్లకు డిస్కౌంట్‌ ధర ప్రకటించనందువల్లే ఇష్యూకు దూరంగా ఉన్నారని ఎస్‌ఎమ్‌సీ క్యాపిటల్‌ ఈక్విటీ హెడ్‌ జగన్నాధం అంటున్నారు. అనిశ్చిత మార్కెట్‌ పరిస్థితులు సైతం వారిని దూరంగా ఉంచాయని ఆయన విశ్లేషిస్తున్నారు.