Wednesday, February 24, 2010

సామాన్యులకు దూరమవుతున్నాయ్‌

సామాన్యులకు దూరమవుతున్నాయ్‌
డిపాజిట్లు, రుణ మంజూరు బ్యాంకుల ప్రధాన విధి
ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి విమర్శ
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: బ్యాంకులు సామాన్యులకు దూరమవుతున్నాయి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. స్వయానా రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరే. బాధ్యతలకు బ్యాంకులు దూరమవుతున్నాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వై.వి. రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ 'భారత వ్యాపారాలు ఎదుర్కొంటున్న సవాళ్లు' అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. 'సామాన్యుల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, వారికి రుణాలు ఇవ్వడం (రిటైల్‌ బ్యాంకింగ్‌) బ్యాంకుల ప్రధాన విధి. అయితే, ఆధునిక మార్కెట్‌ ఆధారిత ఫైనాన్షియల్‌ వ్యవస్థలో ఈ బాధ్యతకు దూరమై కరెన్సీ మార్కెట్‌ వంటి ఇతర అంశాలపై బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. వ్యక్తులకు, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు రుణాలు (రిటైల్‌ క్రెడిట్‌), మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడం వంటి వాటిని విస్మరిస్తున్నాయి. బయట ప్రపంచం రిటైల్‌ బ్యాంకింగ్‌ ప్రాధాన్యాన్ని గుర్తించి దానిపై దృష్టి కేంద్రీకరిస్తోంది. మన బ్యాంకులు కూడా రిటైల్‌ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వాలి' అని అన్నారు. రిటైల్‌ వ్యాపారాన్ని బ్యాంకులు విస్మరించడానికి కొంత మేరకు వాటిపై ఉన్న ఒత్తిళ్లే కారణమని, ఇవి ఇంకా కొనసాగుతున్నాయని వివరించారు.

కొన్ని ఉద్దీపనలను ఉపసంహరించొచ్చు: కొన్ని ఉద్దీపనల ఉపసంహరణ ప్రారంభం కాక తప్పుదు. ఉద్దీపన అంటేనే ఏదో ఒక రోజు ఉపసంహరించేది. ఎప్పుడు ఉపసంహరించాలి. ఏ విధంగా, ఎన్ని దశల్లో ఉపసంహరించాలనేదే విషయం. ప్రభుత్వ విధానం దీన్ని నిర్ణయిస్తుంది. ప్రభుత్వం వద్ద సమాచారమంతా ఉంటుంది. విశ్లేషణ చేస్తుంది. తగిన నిర్ణయం తీసుకుంటుందని రెడ్డి అన్నారు. మూలాలు స్థిరంగా ఉండడంతోపాటు విధాన పరమైన నిర్ణయాల కారణంగా 9 శాతం వృద్ధిరేటు కొనసాగడం సాధ్యమేనని చెప్పారు. వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉందని, విదేశీ మారక విలువల్లో ఒడుదొడుకులు కొనసాగుతాయన్నారు.

ద్రవ్యోల్బణ పరిశీలన ముఖ్యం: ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక, ఫైనాన్షియల్‌ పరమైన అనేక సవాళ్లు వ్యాపారాలకు ఎదురు కానున్నాయని, దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రయోజనం పొందే విధంగా ముందుకు సాగాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ పరిస్థితులను గమనించడం వ్యాపారానికి చాలా ముఖ్యం. ఒడుదొడుకులకు లోనవుతున్న చమురు దిగుమతులు, ఆహార వస్తువుల ధరలు ద్రవ్యోల్బణాన్ని బాగా ప్రభావితం చేసే అంశాలు. అలానే పన్నుల విధానం కూడా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఆదాయం, ఉత్పత్తి మధ్య సంబంధం ఉంటుందని వీటికి అనుగుణంగా ఎగుమతులు, దిగుమతుల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

ఇంకా ఏమన్నారంటే..: భారత్‌ వంటి దేశాలు మినహాయిస్తే.. అమెరికా, యూరప్‌ దేశాల్లో ఫైనాన్షియల్‌ మార్కెట్లు సాధారణ స్థాయికి వచ్చినా.. సమష్టి గిరాకీ పెరగలేదు. నిరుద్యోగ సమస్య కొనసాగుతోంది.

* మనోభావానికి అనుగుణంగా కూడా ఫైనాన్షియల్‌ మార్కెట్లు మెరుగుపడవచ్చు. ఫైనాన్షియల్‌ మార్కెట్లు కోలుకున్నంతగా వాస్తవ ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేదు.
* భారత్‌లో ఉత్పాదకత, ధరలు పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నా వ్యవసాయం చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం.
* ఇక్కడ ఇంధనాన్ని సమర్థంగా వినియోగించడం లేదు.

పరిస్థితులపై అవగాహనకే: డీన్‌
మాంద్యం వంటి అనేక పరిస్థితులు వ్యాపారాలు, వాటి లాభదాయకతను ప్రభావితం చేస్తున్నాయి. వీటిపై మేనేజిమెంట్‌ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో అవగాహన పెరగాలి. మాంద్యం పరిస్థితుల్లో ముందుచూపుతో సరైన ఆర్థిక విధానాలు అవలంబించిన వై.వి.రెడ్డి వంటి వ్యక్తులతో ఏర్పాటు చేసే ఇంటరాక్టివ్‌ సదస్సులు విద్యార్థులకు ఉపయోగపడతాయని హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌ స్టడీస్‌ డీన్‌ వి.వెంకట రమణ తెలిపారు.