స్థానిక సంస్థలకు ఎల్‌ఓసీల నిలిపివేత
బడ్జెట్‌లో చెప్పిన దానికి భిన్నంగా చర్యలు
రూ.1,000 కోట్ల రుణం నేడు రాక
ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2009-10 సవరించిన బడ్జెట్ ప్రకారం మార్చి నెలాఖరుకు రెవెన్యూ ఆదాయంలో పెద్దగా లోటేమీ ఏర్పడబోవటం లేదు. మొత్తం రూ.78,963 కోట్ల రెవెన్యూ ఆదాయ లక్ష్యానికిగాను రూ.78,406 కోట్లు రానున్నట్టు ప్రభుత్వం అందులో పేర్కొంది. ఆదాయంలో లోటు లేనందున ఖజానా కార్యాలయాల్లో వివిధ రకాల బిల్లుల చెల్లింపులపై ఆంక్షలు ఉండకూడదు. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇటీవల కాస్త సడలించిన ఆంక్షలన్నింటినీ ఆర్థిక శాఖ మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈనెల 16వ తేదీ తర్వాత వచ్చిన బిల్లులేవీ ఆమోదం పొందలేకపోతున్నాయి. గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, జిల్లా పరిషత్ తదితరాలు ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ గ్రాంట్లను అందుకోవాలంటే తొలుత ఆయా జిల్లాల్లోని ఖజానా అధికారుల నుంచి ఎల్‌ఓసీలను పొందాలి. వాటిని తీసుకెళ్లి చూపిస్తేనే బ్యాంకుల్లో సొమ్ము అందుతుంది. గత కొన్ని రోజులుగా ఎల్‌ఓసీల మంజూరీ నిలిచిపోయింది. దీంతో విద్యుత్తు బిల్లుల చెల్లింపులు మొదలుకొని పారిశుద్ధ్య పనులు తదితరాలకు నిధుల సమస్య ఏర్పడింది. ఇంకా మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థలు వంటి పలు విభాగాలకూ ఎల్‌ఓసీలు నిలిచిపోయాయి. 2010-11 బడ్జెట్‌లో ఆదాయాలను ఎక్కువగా చూపించటం కోసం ప్రస్తుత బడ్జెట్ సవరణల్లో ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టినట్లు తరచూ పెడుతున్న ఆంక్షలే స్పష్టం చేస్తున్నాయి. నిధులు లేవంటూ గత కొంతకాలంగా ప్రతి నెలలోను కొన్ని రోజులపాటు ఖజానా బిల్లులను నిలిపివేస్తూనే ఉన్నారు. బిల్లులు పట్టుకొని వచ్చే వారికి కేవలం టోకెన్లు మాత్రమే ఇస్తూ వచ్చారు. ఇటువంటి ఆంక్షలను ఈనెల 10వ తేదీన పాక్షికంగా తొలగించి అప్పటి వరకు టోకెన్లు పొందిన వారికి వరస క్రమంలో నిధులను అందజేసినా మళ్లీ ఇప్పుడు పూర్తి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
అభివృద్ధి రుణం నేడు రాక: రాష్ట్రం తరఫున సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వుబ్యాంకు సేకరించిన రూ.వెయ్యి కోట్ల రుణం బుధవారం ప్రభుత్వానికి అందుతుంది. రాష్ట్ర అభివృద్ధి రుణం పేరుతో రిజర్వు బ్యాంకు ఈ మొత్తాన్ని మంగళవారం సేకరించింది. ఈ సొమ్మురాకతో ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ఈ నెలలో సమస్య ఉండబోదు.
