ఏది నిజం? ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఉద్దీపనల చుట్టూ ఇప్పుడు చర్చ సాగుతోంది. వీటిని కొనసాగిస్తారా? పాక్షికంగా ఉపసంహరిస్తారా? అన్నవి ప్రధాన ప్రశ్నలు. విశేషమేమిటంటే.. ఆర్థిక మంత్రి మాట అటుంచితే.. సంబంధిత శాఖల వారే ఉద్దీపనలపై తలో రకంగా మాట్లాడటం.. ప్రజలను గందరగోళంలోకి నెట్టేయడం.. వీళ్లంతా బడ్జెట్ రూపకల్పనలో ప్రధాన పాత్రధారులే. వాళ్లకు తెలియకుండా బడ్జెట్ కసరత్తు పూర్తయిపోయిందని భావించలేం. వాళ్లకు తెలుసు అనుకుంటే.. భిన్న స్వరాలు ఎందుకు ఉచ్ఛరిస్తున్నారో అర్థం కాదు. ఇంతకీ వీరి మాటల్లో ఏది నిజం..? ఎవరి మాట నమ్మాలి?
'సహేతుక పన్నులే భారత్‌ను రక్షిస్తున్నాయి. అతి తక్కువ పన్నులున్న వ్యవస్థలు ఇటీవల కుదేలైన అంశాన్ని గమనించాలి.'ఉద్దీపనల వల్లే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు 7.9% అయ్యింది. - కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ (10.2.10) |
'13 నెలల క్షీణత అనంతరం గత నవంబరు నుంచీ భారత్ ఎగుమతుల్లో వృద్ధి నమోదవుతోంది. ఉద్దీపనల పాక్షిక ఉపసంహరణను ఎదుర్కొనేందుకు పరిశ్రమ సన్నద్ధమై ఉండాలి. వృద్ధిబాట పడుతున్న రంగాల నుంచి ఉద్దీపనలను వెనక్కు తీసుకునే విషయాన్ని పరిశీలించాల్సి ఉంది.' - వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ, (9.2.10) |
'ఉద్దీపనల ఉపసంహరణ వల్ల ఆర్థిక పురోగతిపై పడే ప్రభావాన్ని అంచనా వేశాకే నిర్ణయం తీసుకుంటాం. వాతావరణ పరిస్థితులనూ గమనంలోకి తీసుకోవాలి. ఈ ప్రక్రియ ఎప్పుడు, ఏ విధంగా అమలు చేసేదీ భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.' - కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా (23.2.10) |
'సుంకాలను సవరించే అవకాశం ఉంది. ఆదాయం, వ్యయం.. రెండువైపులా సుంకాలను సవరించి ద్రవ్యలోటును తగ్గించాలి. ఎక్సైజ్, సేవా పన్నులను 10% నుంచి 12% చేయాలి. ఈ రెండింటిని కలిపి, ఒకే రేటుకు తీసుకురావడానికి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అవకాశం కల్పిస్తుంది. కేటాయింపుల హేతుబద్ధీకరణ, ఆదాయం పెంపు ద్వారా ద్రవ్యలోటును తగ్గించాలి. ఆర్థిక స్థిరీకరణ ఆరంభమై, ద్రవ్యలోటును తగ్గించేందుకు బడ్జెట్‌లో కొన్ని చర్యలుంటాయి.' - ఆర్థిక సమీక్ష విడుదల సందర్భంగా ప్రధాని ఆర్థిక మండలి ఛైర్మన్ రంగరాజన్ (19.2.10) |
'ఉద్దీపనలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దశల వారీ ఉపసంహరణకు బడ్జెట్‌లో చర్యలుంటాయి. ద్రవ్యలోటును అదుపులో పెట్టాలంటే ఇది తప్పదు. వృద్ధిరేటు పెరగాలంటే ఈ చర్య తప్పదు. ఆహార ద్రవ్యోల్బణం కూడా దిగి వస్తుందని భావిస్తున్నందున పురోగమన చర్యలు తీసుకోవాలి.' - ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా (8.2.10) |
'ఉద్దీపనలు ఇప్పుడే ఉపసంహరించాలనడం తొందరపాటే. ప్రస్తుత గణాంకాలేవీ విశ్వాసాన్నిచ్చేవిగా లేవు. అందువల్ల ప్యాకేజీల ఉపసంహరణపై కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే గత ఏడాది జీడీపీలో 6.2 శాతంగా ఉన్న ద్రవ్యలోటు ఈ ఏడాది 6.8 శాతానికి పెరిగే అవకాశం ఉన్నందున, కట్టడి చేసేందుకు ఉద్దీపనల ఉపసంహరణ దిశగా ఆర్థిక మంత్రి చర్యలు చేపట్టవచ్చు.' - ఆర్థిక సమీక్ష వెలువడిన రోజే ఢిల్లీలో భారత ప్రధాన గణాంకవేత్త ప్రణబ్‌సేన్ (19.2.10) |
'ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.2% ఉంటుందని కేంద్ర గణాంక సంస్థ అంచనా వేసింది. అయితే మూడు, నాలుగో త్రైమాసిక ఫలితాలు వెలువడాల్సి ఉన్నందున మరింత మెరుగైన వృద్ధినే ఆశిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఉద్దీపనలు మితిమీరి కొనసాగించడం వ్యవస్థకు మంచిది కాదు. ఆరోగ్యం మెరుగయ్యాక శరీరానికి ఉత్తేజకాలు ఇవ్వడం లాంటిదే ఈ పరిస్థితి కూడా. క్రమంగా తొలగించడమే శ్రేయస్కరం.' - కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్‌చావ్లా (9.2.10) |
- ఈనాడు వాణిజ్య విభాగం






