Wednesday, February 24, 2010

జౌళికి ఉద్దీపనలు ఉండాల్సిందే ః మారన్‌

జౌళికి ఉద్దీపనలు ఉండాల్సిందే ః మారన్‌
dayanidhi-maranన్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఉద్దీపనల పాక్షిక ఉపసంహరణ ఉండవచ్చునని అంతా భావిస్తున్న తరుణంలో, టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి దయానిధి మారన్‌ మాత్రం టెక్స్‌టైల్స్‌ రంగానికి తప్పనిసరిగా ఉద్దీపనలు కొనసాగించాలని కోరారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఈ పరిశ్రమ ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిపారు. మరికొద్ది కాలం ఈ ప్యాకేజీలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన కార్పెట్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ ఉద్దీపనల ప్యాకేజీల కింద టెక్స్‌టైల్‌ పరిశ్రమ క్యాపిటల్‌ గూడ్స్‌పై దిగుమతి సుం కాల తిరిగి చెల్లింపు, సర్వీస్‌ టాక్స్‌ రిఫండ్‌, క్లస్టర్‌ వృద్ధి లాంటి ప్రయోజనాలను పొందింది. రిజర్వు బ్యాంకు పరిధిలో, వడ్డీరేటు సబ్సిడీని కూడా ఈ పరిశ్రమ పొందగలిగింది. 2008-09లో పరిశ్రమ వృద్ధి 2 శాతం పడిపోయింది. టెక్స్‌టైల్‌ పరిశ్రమకు ఉద్దీపనలు కొనసాగే అవకాశం ఉందని మారన్‌ పేర్కొన్నారు. 2008 ఏప్రిల్‌-నవంబర్‌తో పోలిస్తే, 2009లో అదే కాలానికి ఎగుమతులు 15 శాతం మేర తగ్గిపోవడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. డిసెంబర్‌, జనవరిలో మాత్రం నెలవారీగా ఎగుమతులు 5 శాతం పెరిగాయని మారన్‌ అన్నారు.