
లేదు లేదంటూనే ప్రైవేటు రంగానికి ఎర్రతివాచీ
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టులు
నిధులిచ్చే రాష్ట్రాలకే ప్రాధాన్యం
రూ.41,426 కోట్లతో వార్షిక ప్రణాళిక
కేటాయింపుల్లో మళ్లీ 'తూర్పు' గాలే!
సింహభాగం బెంగాల్‌కే
ప్రయాణికుల, సరకు రవాణా ఛార్జీల్లో మార్పులేదు
సరకు రవాణాలోనూ తత్కాల్
కొత్తగా 52 దూర ప్రయాణ రైళ్లు, 28 ప్యాసింజర్లు
సికింద్రాబాద్‌లో వ్యాగన్ల ఫ్యాక్టరీ, క్రీడల అకాడమీ
రాష్ట్రం మీదుగా 22 రైళ్లు, 6 పొడిగింపులు
కొత్తగా 10 దురంతో రైళ్లు, ఒకటి సికింద్రాబాద్ నుంచి
పదేళ్లలో రైల్వే ఉద్యోగులందరికీ ఇళ్లు
జిల్లా కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో టిక్కెట్ల విక్రయం
మహిళలు, మైనారిటీ, ఈబీసీలకు రైల్వే పరీక్ష ఫీజు లేదు
క్యాన్సర్ రోగికి, సహాయకుడికీ ఉచిత ప్రయాణం
''రైల్వేతో ప్రైవేటు సంస్థలు చేతులు కలపడానికి తరుణమిదే. వారు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నా వ్యవస్థలోని ప్రతికూల ధోరణి వల్ల సాకారం కావడంలో జాప్యం జరిగింది. ఇక ముందు పెట్టుబడులకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తాం'' ''రైల్వేను ప్రైవేటీకరించబోమని నేను హామీ ఇస్తున్నాను'' - మమతా బెనర్జీ |

రైల్వేలో దేశీయ పెట్టుబడులకు ఎర్రతివాచీ వేసి ఆహ్వానం పలకడం ద్వారా భారతీయ రైలు బండిని 2020 విజన్ పట్టాలపైకి ఎక్కించారు. ఆదాయార్జన, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునికీకరణ, ఏడాదికి 2,500 కి.మీ మేర రైల్వేలైన్ల విస్తరణ ప్రధాన లక్ష్యాలుగా రెండు నెలల క్రితమే 2020 దార్శనిక పత్రాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మమత, దానికనుగుణంగానే ఈ బడ్జెట్‌కు రూపునిచ్చారు. విస్తరణ లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది వెయ్యి కిలోమీటర్లు కొత్త లైన్లు వేయాలని నిశ్చయించారు. ఇందుకోసం రూ. 2,848 కోట్లుగా ఉన్న కేటాయింపులను రూ. 4,411 కోట్లకు పెంచారు.
ఈ సారి కూడా ఛార్జీలు పెంచకపోవడం ఆమ్ ఆద్మీకి ఖుషీనిచ్చే విషయమైతే, ప్రైవేటు పెట్టుబడులకు ఎర్రతివాచీ పర్చడం ప్రైవేటు సంస్థలకు హుషారు కల్గించే కబురు. పెట్టుబడులకు అవసరమైన స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేలా విధానాలను సరళీకరిస్తామని, ప్రాజెక్టులకు అనుమతులివ్వడంలో జాప్యం లేకుండా ఉండేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని, 100 రోజుల్లో అనుమతులు ఖరారు చేస్తామని మమత చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో కొత్తగా రైలు సదుపాయాల ఏర్పాటుకు పీపీపీ పద్ధతిలో నిధుల కేటాయింపునకు అంగీకరిస్తే వాటికి ప్రాధాన్యం ఇస్తామని మమత వెల్లడించారు. ఇది సరికొత్త పరిణామం. రైల్వేలు కేంద్ర జాబితాలో ఉన్నప్పటికీ స్థానికుల అవసరాలను తీర్చడానికి రాష్ట్రాలూ చొరవ చూపక తప్పదని దీన్ని బట్టి అర్థమవుతోంది. పీపీపీ అమలుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని, దాన్ని కూడా తానే నిర్వహిస్తానని మమత స్పష్టం చేశారు.
కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, నౌకాశ్రయాలను అనుసంధానం చేయడం, బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాలు, హైస్పీడ్ కారిడార్ల నిర్మాణం, కోచ్ తయారీ కర్మాగారాలు, శీతల కంటైనర్ తయారీ కర్మాగారాలు, బ్రాడ్‌బ్యాండ్ సేవల నిర్వహణ, నీటిశుద్ధి ప్లాంట్ల నిర్మాణం, ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్టేషన్ల ఆధునికీకరణ వంటివి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఏర్పాటు కానున్నాయి.
ప్రైవేటు సంస్థల నిర్వహణలో ఉన్న జనతా ఆహార్ సేవలపై ఆమ్‌ఆద్మీ నుంచి ఫిర్యాదులు రావడంతో దీన్ని పునఃసమీక్షించనున్నట్లు మమత చెప్పారు. దీంతో పాటు, ఏ తరగతి ప్రయాణానికీ ఛార్జీలు పెంచకపోవడం, ఈ- టికెట్ సేవా రుసుమును తగ్గించడం వంటివి చూస్తే ఆమ్‌ఆద్మీని దృష్టిలో పెట్టుకున్నట్లే కనిపించినా తత్కాల్ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. తత్కాల్ కోటాను దొడ్డిదారిన పెంచడం ద్వారా ప్రయాణికుల జేబులకు ఇప్పటికే కత్తెర వేస్తున్న రైల్వే ఇక ముందు కూడా అదే పంథా అవలంబించాలని నిశ్చయించుకున్నట్లు అర్థమవుతోంది. సరకు రవాణాకూ తత్కాల్ పద్ధతిని ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు మమత ప్రకటించారు. రైల్వే పరీక్షల ప్రశ్న పత్రాలు ఇక ముందు ప్రాంతీయ భాషల్లోనూ రూపొందించాలని నిర్ణయించడం లక్షల మంది నిరుద్యోగులకు ఊరట కల్గించే విషయమే.
2020 విజన్‌లో పేర్కొన్నట్లుగా సమ్మిళత అభివృద్ధిని (ఇన్‌క్లూజివ్ గ్రోత్) దృష్టిలో పెట్టుకున్నామని, వాణిజ్య సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకోకుండా వెనకబడిన ప్రాంతాలకు కొత్తలైన్లు ప్రతిపాదించామని రైల్వేమంత్రి చెప్పారు. కానీ లాభదాయకం కాని మార్గాల అభివృద్ధికి ప్రైవేటు సంస్థలు ముందుకు రావడం అనుమానమే. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బెంగాల్, తమిళనాడుకు పెద్దపీట వేసిన మమత సమ్మిళత అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరమే.

రూపాయిలో 34 పైసలు జీతభత్యాలకే |
|
|
|