
నోటి మాటలు.. ఓటి కేటాయింపులు
భాగస్వామ్యానికి నిధులెవరిస్తారు?
రాష్ట్ర బడ్జెట్లో పైసా విదల్చని పరిస్థితి
దశాబ్దకాలంగా కదలని పాత రైల్వే ప్రాజెక్టులు
కొత్త వాటిపై రంగుల కలలు
కొత్తలైన్ల ప్రతిపాదన
ఈ రైల్వే బడ్జెట్లో భద్రాచలం-కొవ్వూరు, ఆల్మట్టి-యాదగిరి, భద్రాచలం రోడ్డు-విశాఖపట్టణం, కృష్ణా-వికారాబాద్, మంత్రాలయం రోడ్డు-కర్నూలు, నిజమాబాద్-రామగుండం, హైదరాబాద్-సిరిసిల్ల-జగిత్యాల, పాండురంగాపురం-భద్రాచలం, పటాన్‌చెరు-ఆదిలాబాద్, జగ్గయ్యపేట-మిర్యాలగూడ, కాచిగూడ-చిట్యాల, జహీరాబాద్-సికింద్రాబాద్, జలనా-ఖేమోగాన్ ప్రాజెక్టులకు ఆమోదం లభించాయి.
వాస్తవ పరిస్థితి
ఇవి చాలా ఏళ్లకిందటి ప్రతిపాదనలు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయగా, గత ఏడెనిమిదేళ్లగా రైల్వే శాఖ సర్వేలు జరిపింది. బడ్జెట్‌లో ప్రతిపాదించే ప్రాజెక్టులకు ముందుగా ప్రణాళిక సంఘం ఆమోదం లభించాలి. ఈ 13 ప్రాజెక్టుల సర్వే నివేదికలను ప్రణాళికా సంఘానికి పంపించారు. ఆసాంతం పరిశీలించిన ప్రణాళిక సంఘం లాభదాయకం కాదని తోసిపుచ్చింది. తాజాగా వెనుక బడిన ప్రాంతాల్లో రైల్వేలైన్ల నిర్మాణం, రైల్వే అనుసంధానం పెంచడం సామాజిక బాధ్యతగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రాజెక్టులకు మమత ఆమోద ముద్ర వేశారు. ఇలా ఈ జోన్ పరిధిలో ఆ 13 ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడింది. తాజా సమాచారంతో ఈ ప్రాజెక్టుల వివరాలను మళ్లీ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రణాళికా సంఘానికి పంపిస్తారు. ప్రణాళిక సంఘం ఆమోద్ర ముద్ర వేసి వాటిని రైల్వే బోర్డుకు పంపిస్తే అప్పుడు నిధుల కేటాయింపు విషయాన్ని పరిశీలిస్తుంది. అంటే వీటికి ఈ ఏడాది కేటాయింపుల అవకాశం లేదని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే రూ.10 వేల కోట్ల వ్యయం అవుతుంది. ప్రణాళిక సంఘం ఆమోదించినా రైల్వేశాఖ అంత నిధులు కేటాయించగలదా అన్నది ప్రశ్నార్థకం. నిర్మాణంలో ఉన్నఇతర ప్రాజెక్టుల్లానే రూ.10 కోట్లో, రూ.20 కోట్లో కేటాయిస్తే వీటిని పూర్తి చేయడానికి మరో దశాబ్దం పడుతుంది.
సర్వేల ప్రకటన
గూడూరు-బాకరావుపేట, బాపట్ల-నిజాంపట్నం, రేపల్లె, మల్లెచెరువు-జనపహాడ్, పడిపల్లి-శంకరపల్లి, గడ్‌చందర్-అదిలాబాద్, డబ్లింగ్ కోసం మనఘర్-గడ్‌చందూర్, గుంటూరు-గుంతకల్, బోదన్-బీదర్ మార్గాల సర్వేకు ఆదేశం
వాస్తవ పరిస్థితి
ప్రతీ బడ్జెట్‌లో ఒకటో రెండో కొత్త లైన్లకు సర్వేలు ప్రకటిస్తుంటారు. కొన్ని సర్వేలు పూర్తయిన దాఖలాలు లేవు. గత ఏడాది కొత్త లైన్ల కోసం మెదక్-అక్కన్నపేట, విష్ణుపురం-వినుకొండ, డబ్లింగ్ కోసం సికింద్రాబాద్-మహబూబ్‌నగర్, బీబీనగర్-గుత్తి-బెంగుళూరు మార్గాలను సర్వేలు ప్రకటించారు. నిధులు కేటాయించక పోవడంతో సర్వే పనులు కూడా పూర్తి కాలేదు. పాత సర్వేలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సర్వే పూర్తయి నిధులు కేటాయించని ప్రాజెక్టులు 25 వరకు ఉన్నాయి. ఏడెనిమిదేళ్లగా వీటికి ఆమోదం తెలపలేదు. నిధులు కేటాయించే సాహసం కూడా చేయడం లేదు. కొత్తవి కూడా సర్వేలతో సరిపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని ఆదర్శ స్టేషన్లు
గూడూరు, నరసరావుపేట, లింగంపల్లి, పర్బని, పూర్ణ, శంకర్‌పల్లి, తాండూర్, వికారాబాద్ స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు.
వాస్తవ పరిస్థితి
గత బడ్జెట్‌లో కూడా రాష్ట్రంలోని 27 స్టేషన్లను ఆదర్శ స్టేషన్లగా ప్రతిపాదించారు. నల్గొండ, చిత్తూరు, ఇచ్చాపురం, రామగుండం, విజనగరం, కర్నూలు స్టేషన్లలో తాగునీరు మొదలు విశ్రాంతి గదుల వరకు అన్ని సౌకర్యాలు అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి. రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క ఆదర్శ స్టేషన్ పనికూడా మొదలు కాలేదు. నిధుల కేటాయింపు జరగలేదు.
బహుళార్థ సముదాయాలు
ఈ బడ్జెట్ ఆర్థిక సంవత్సరంలో ఔరంగాబాద్, ధర్మవరం, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, నిజామాబాద్, విజయవాడ, జహీరాబాద్ స్టేషన్లలో బహుళార్థ సముదాయాలు నిర్మిస్తారు.
వాస్తవం
విశాఖపట్నం, మరికొన్ని స్టేషన్లలో బహుళార్థ భవన సముదాయాలను నిర్మించాలని గత బడ్జెట్‌లో తల పెట్టారు. ఏడాదిగా పట్టించుకోలేదు. అవి పూర్తి చేయడానికే రెండేళ్లు పడుతుంది. కొత్త వాటికి మరింత సమయం తప్పదు. గత బడ్జెట్‌లో సికింద్రాబాద్, తిరుపతిలను ప్రపంచ స్థాయి స్టేషన్లగా అభివృద్ధి చేస్తామన్నారు. అవి ఇంకా మొదలు కాలేదు.
ఆరోగ్య ప్రకటన
దక్షిణ మధ్యరైల్వే పరిధిలోని 58 స్టేషన్లలో బయటి రోగుల వైద్యసేవల విభాగాలు, రోగ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. 21 స్టేషన్లలో ద్వితీయ స్థాయి జనరల్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మిగతా స్టేషన్లలో తృతీయ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
వాస్తవ పరిస్థితి
గత బడ్జెట్లో సికింద్రాబాద్‌లో రైల్వే ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇంతవరకు పట్టించుకో లేదు. కార్యాచరణ రూపొందలేదు. నిధుల కేటాయించలేదు.
వ్యాగన్ల పరిశ్రమ ప్రకటన
సికింద్రాబాద్‌లో క్రీడా అకాడమీ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో సికింద్రాబాద్‌లో వ్యాగన్ల తయారీ కర్మాగారం ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు.
వాస్తవం: వ్యాగన్ల తయారీ కర్మాగారం రూపు రేఖలేవీ దక్షిణ మధ్య రైల్వే అధికారులకే తెలియదు. దీన్నిబట్టి చూస్తే ప్రాజెక్టు ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో చెప్పలేం.
భాగస్వామ్య ప్రాజెక్టుల ప్రకటన
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద పది ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో మొదలు పెడతామని ప్రతిపాదించారు.
వాస్తవం: ఎంఎంటీఎస్ రెండోదశ ప్రాజెక్టుకు మూడింట రెండొంతల నిధులను మరో, అయిదు ప్రాజెక్టులకు సగం నిధులను భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందకు వచ్చింది. ఎంఎంటీఎస్ రెండో దశ గురించి ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభుత్వం భరిస్తానన్న కొన్ని ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేస్తున్నట్లు బడ్జెట్‌లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు సగం నిధులు భరించాలంటే రైల్వేశాఖ మరో రూ.3500 కోట్లను భరించాల్సి ఉంటుంది. కర్ణాటక ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు 50 నిధులను భరించడానికి తన బడ్జెట్లో రూ.3 వేల కోట్లను చూపించింది. ఆంధ్రప్రదేశ్ ఒక్కపైసా కేటాయించలేదు. ఆర్థిక మాద్యం నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లభించిన ప్రాజెక్టులకే మొదటి విడతగా రూ.1000 కోట్లవరకు విడుదల చేయాల్సి ఉంటుంది. కడప-బెంగుళూరు ప్రాజెక్టుకు ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన రూ.29 కోట్లను ఏడాది పాటు నాన్చి ఇప్పుడు ఇవ్వబోతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.40 కోట్లను ఇదే లైను కోసం విడుదల చేయాల్సి ఉంది. అందుకు ఎంత సమయం పడుతుందో? ఆరు ప్రాజెక్టుల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందా? అన్నది ప్రశ్నార్థకమే.
పరిశీలిస్తామని ప్రకటన
నడికుడి-శ్రీకాళహస్తి, భద్రాచలం రోడ్డు-కొవ్వూరు, మణుగూరు-రామగుండం, అక్కనపేట-మెదక్-మేడ్చల్,కొండపల్లి- కొత్తగూడెం, కంభం-పొద్దుటూరు, గద్వాల-మాచర్ల కొత్త లైన్లకు విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం-భీమవరం, నర్సాపూర్-నిడదవోలు, గుంటూరు-తెనాలి-రేపల్లె డబ్లింగ్ కోసం పరిశీలనకు అంగీకరించారు.
వాస్తవం: వీటికి రూ.12000 కోట్ల పైగా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని ప్రాజెక్టులను పీపీపీ కింద చేపడతారు. వీటిలో కొన్ని లాభదాయకం కాదని చెబుతున్న నేపథ్యంలో ఏవి కార్యరూపం దాలుస్తాయో తేలడానికి మరో ఏడాది పడుతుంది.
కేటాయింపులు పెరిగాయి
గత బడ్జెట్‌లో రూ.3161 కోట్లతో పోలిస్తే ప్రాజెక్టుల నిధుల కేటాయింపు రూ.227 కోట్లు పెంచాం.
వాస్తవం
కొత్తగా 22 కొత్త ప్రాజెక్టులను మంజూరు చేశాక ఆ మేరకు కేటాయింపులు భారీగా పెరగాలి. కొన్ని విభాగాల కేటాయింపులను తగ్గించారు. గత బడ్జెట్‌లో లైన్ల పునరుద్ధరణకు రూ.500 కోట్లను కేటాయిస్తే ఈసారి బాగా తగ్గించారు. గేజ్ మార్పిడికి గత బడ్జెట్‌లో రూ.131 కోట్లను కేటాయిస్తే ఇప్పుడు రూ.11.25 కోట్లు తగ్గాయి.
కొన్ని ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
ఈ బడ్జెట్‌లో నంద్యాల-ఎర్రగుంట్ల లైను పరిధిలోని నోసమ్-బనగానపల్లి విభాగాన్ని పూర్తి చేస్తాం. పెద్దపల్లి-నిజామామాద్ పరిధిలోని జగిత్యాల-మోర్తాడ్ విభాగాన్ని పూర్తి చేస్తాం.
వాస్తవం: పదేళ్ల 15 కిందట ప్రారంభించిన లైన్లే నిధుల్లేక అల్లాడుతున్నాయి. నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే మార్గం నిర్మాణాన్ని 1996-97లో ప్రారంభించారు. రూ.174 కోట్లమేర అంచనా వేశారు. అంచనాలు రూ.315 కోట్లకు పెరిగాయి. పదమూడేళ్లలో కేటాయించింది కేవలం రూ.80 కోట్లు.
నంద్యాల ఎర్రగుంట్ల లైనుకు రూ.80 కోట్లను కేటాయించారు. అందులో భాగమైన నోసమ్-బనగానపల్లి విభాగం పూర్తి చేయాలంటే మొత్తం నిధులు ఇక్కడే ఖర్చు పెట్టాలి. మిగతా లైన్లకూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి.