
నేడు రైల్వే బడ్జెట్
మరిన్ని నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ ఒత్తిడి
ఆరు లైన్లకు సగం భారం మోస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం
ప్రైవేటు భాగస్వామ్యంలో మరిన్ని ప్రాజెక్టుల ప్రతిపాదన
పక్కా నివేదికలు రూపొందించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్ - న్యూస్‌టుడే

| ఈ బడ్జెట్లో ఐదు వేల కోట్లు కావాలి. - దక్షిణ మధ్య రైల్వే విజ్ఞాపన. | 
| మేం యాభై శాతం భరించడానికి సిద్ధమైన కొత్త ప్రాజెక్టులకు తప్పనిసరిగా నిధులివ్వాలి. నిర్మాణంలోని ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలి. 15 కొత్త రైళ్లు ప్రకటించాలి. -రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఇది. | 
తాజా బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖలతో ఒత్తిడి తెచ్చింది. ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా రైల్వే మంత్రితో మాట్లాడారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా మమతను కలిసి విజ్ఞప్తులు చేశారు. ఈసారి న్యాయం చేస్తామని మమత హామీ ఇచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం జయంత్ కూడా రాష్ట్రంలో 1993 తరువాత చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.5 వేల కోట్లు అవసరమని రైల్వేశాఖ దృష్టికి తెచ్చారు. ఏయే ప్రాంతాలకు కొత్త రైళ్లను నడిపితే ప్రయోజనం ఉంటుందో వివరిస్తూ ప్రతిపాదనలను పంపించారు.
ఆరు కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టులకు గరిష్ఠంగా 66 శాతం, కనిష్ఠంగా 25 శాతం నిధులను భరించడానికి సిద్ధమని రాష్ట్రప్రభుత్వం రైల్వే మంత్రికి తెలియజేసింది. గత ఏడాది మంజూరైన కడప-బెంగుళూరు రైల్వే లైనును కూడా చెరిసగం వ్యయం ప్రాతిపదికన చేపడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వాటా రూ.29 కోట్లు విడుదల అయ్యాయి. తమది చేతల ప్రభుత్వమని చెప్పుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను రెండు రోజుల్లో విడుదల చేయబోతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పచ్చజెండా వూపారు.
రైల్వే బడ్జెట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం గతవారం మూడో లేఖ రాసింది. అందులో తాను భారం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆరు ప్రాజెక్టులను ప్రస్తావించింది.
* ఎంఎంటీఎస్ రెండో దశ నిర్మాణానికి అయ్యే వ్యయంలో 2/3 భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు పునరుద్ఘాటించింది.
* నడికుడి-శ్రీకాళహస్తి, భద్రాచలం-కొవ్వూరు, మణుగూరు-రామగుండం కొత్త లైన్లకు 50 శాతం నిధులిస్తామని చెప్పింది.
* విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం భీమవరం, నర్సాపురం, నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణలకు సగం భారం పంచుకుంటానంది.
* గుంటూరు, తెనాలి-రేపల్లె డబ్లింగ్, విద్యుదీకరణ పనుల్లోనూ సగం పెట్టుబడి భరిస్తామని తెలిపింది.
* కోటిపల్లి-నర్సాపురం కొత్త రైల్వే లైనుకు రూ.695 కోట్ల వ్యయం అవుతుంది. రైల్వే కేవలం రూ.9.42 కోట్లు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.
* మరికొన్ని ప్రాజెక్టులను ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించింది.
* కొత్త రైళ్లను కూడా ప్రతిపాదించింది. 
నిధులు పెరిగే అవకాశం?
ప్రస్తుత రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి (దక్షిణ మధ్య రైల్వే) రూ.3092 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రాష్ట్రానికి చెందిన కొందరు కేంద్రమంత్రుల ఒత్తిడి ఫలితంగా కొత్త బడ్జెట్లో రూ.3500 కోట్ల నుంచి రూ.4000 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యమైన నాలుగు కొత్త ప్రాజెక్టులకు తొలిదఫా నిధులు కేటాయించే అవకాశం ఉంది. 
నడికుడి-శ్రీకాళహస్తి లైనుకు రూ.50 కోట్లు, భద్రాచలం- కొవ్వూరుకు లైనుకు ఎంతోకొంత కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. ఎంఎంటీఎస్ రెండోదశ పనులకు మూడింట రెండు వంతుల నిధులను భరించడానికి సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయడంతో రైల్వేశాఖ దీనిపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన ప్రైవేటు భాగస్వామ్యం మీద మమతకూడా ఉత్సాహం చూపే అవకాశం ఉందని సమాచారం. ఈసారి దక్షిణమధ్య రైల్వేకు అయిదారు రైళ్లయినా వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఈనెల వరకు ఈ జోన్‌లో 1230 ప్రత్యేక రైళ్లను రద్దీ మేరకు నడపాల్సి వచ్చింది. రూ.20 కోట్ల అదనపు ఆదాయం లభించింది. ఈ గణాంకాలతో కొత్త రైళ్ల అవసరాలను ప్రస్తావిస్తూ జీఎం నివేదిక పంపారు.
