Monday, April 19, 2010

మొబైల్‌ బ్యాంకింగ్‌ ఇక గ్రామాల్లో

జులై 31న ప్రారంభం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. కేంద్ర ఐటీశాఖ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు సంబంధిత మంత్రివర్గసంఘం శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయటం, తీసుకోవడం, బదిలీ చేయడం వంటి పనులు సెల్‌ఫోన్‌ స్విచ్‌ను నొక్కడంతోనే జరిగిపోయే రోజులు గ్రామాల్లో రానున్నాయి. బ్యాంకులు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలను జులై 31న ప్రారంభించి వచ్చే ఏడాది ఆఖరులోగా పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

బ్యాంకు ప్రతినిధి వారధి
సెల్‌ఫోన్‌ లావాదేవీలు నిర్వహించేందుకు ముందు బ్యాంకులో ఖాతా తెరవాలి. ఆ సమయంలో బ్యాంకు మొబైల్‌పిన్‌ నెంబరు ఇస్తుంది. దీని తర్వాత ఇక ఏ లావాదేవీ జరపాలన్నా.. బ్యాంకు ప్రతినిధి సహాయకారిగా ఉంటారు. ఈ ప్రతినిధి వద్ద బయోమెట్రిక్‌ టెక్నాలజీతో పని చేసే చిన్నపాటి ఏటీఎం యంత్రం ఉంటుంది. ఖాతాదారుడు డబ్బులు డ్రా చేయాలనుకుంటే.. అతని సెల్‌, పిన్‌ నెంబర్లను బ్యాంకు ప్రతినిధి మొబైల్‌ ద్వారా బ్యాంకుకు పంపిస్తారు. అక్కడి నుంచి సరేనంటూ ఎస్‌ఎంఎస్‌ సమాచారం వచ్చిన తర్వాత ఏటీఎం యంత్రం నుంచి డబ్బులు తీసి ఇస్తారు. డబ్బులు జమ చేయటం, వేరొకరికి బదిలీ చేయటం కూడా ఇదే విధంగా ప్రతినిధి ద్వారానే జరుగుతుంది. వేలిముద్రలతో కూడిన బయోమెట్రిక్‌ టెక్నాలజీతోనే ఇది నడుస్తుంది కాబట్టి దీంట్లో మోసం జరిగే ప్రమాదం ఉండదని ఐటీశాఖ వర్గాలు తెలిపాయి.

సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకుకు వెళ్లి మామూలు ఖాతాలాగే అన్ని పనులూ నిర్వహించుకోవచ్చు. మొబైల్‌ బ్యాంకింగ్‌కు కొన్ని పరిమితులున్నాయి. రోజుకి రూ.5 వేలు, నెలకు రూ.25వేలకు మించి తీసుకోవటానికి లేదు. ఇతర లావాదేవీలపైన మాత్రం పరిమితులు లేవు. మొబైల్‌ బ్యాంకింగ్‌లో భాగస్వాములైన వారికి బ్యాంకు కొంత మొత్తం అందజేస్తుంది. ప్రతీ లావాదేవికి మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌కు రూ.1, మైక్రోఏటీఎం ప్రతినిధికి రూ.3, సర్వర్‌ ప్రొవైడర్‌కు రూ.1 చొప్పున చెల్లిస్తుంది. దీనికోసం ఖాతాదారుడి నుంచి కొంత రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనలున్నాయి.