తొలి దశలో రెండు వేల కోట్లు
రాష్ట్ట్రప్రభుత్వ అనుమతి పిఎఫ్‌సి కసరత్తు
హైదరాబాద్ (ఆన్‌లైన్): విద్యుత్ సంస్థలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు ఎగనామం పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ఆమేరకు విద్యుత్ బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు అనుమతి ఇచ్చింది. అప్పుల్లో ఉన్న విద్యుత్ సంస్థలు..తొలి దశలో రెండు వేల కోట్ల రూపాయలను బాండ్ల ద్వారా సమీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరో ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. తొలి దశ బాండ్ల జారీ ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఆర్థిక సంస్థ (ఎపి పిఎఫ్‌సి) త్వరలో శ్రీకారం చుట్టనుంది.
విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల మేరకు బాండ్లను జారీ చేయనున్నట్టు, సుమారు ఆరు వేల కోట్ల రూపాయలను బాండ్ల ద్వారా సేకరించాలని భావిస్తున్నట్టు 'ఆంధ్రజ్యోతి' రెండు నెలల క్రితమే వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, వార్షిక సబ్సిడీ కలసి 2009-10 బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికే సుమారు 10700 కోట్ల రూపాయలైంది.
అందులో 6040 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించారు. అయితే, ఆర్థిక సంవత్సరం చివరినాటికి కేవలం 3,192 కోట్ల రూపాయలమేరకే సబ్సిడీ నిధులను విడుదల చేశారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లోనే 2850 కోట్ల రూపాయలు విడుదల కాలేదు. ఇది కాకుండా..కేటాయింపులకే నోచుకోని మొత్తం 4,500 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మొత్తం సుమారు 7,300 కోట్ల రూపాయలు.
ఇదంతా 2008-09 ఆర్థిక సంవత్సరంలో, 2009 ఏప్రిల్-మే మాసాలలో ఓపెన్ మార్కెట్‌నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిల భారం. ఈమేరకు విద్యుత్ సంస్థలు వివిధ ఆర్థిక సంస్థలు, వాణిజ్య బ్యాంకులనుంచి స్వల్ప కాలిక రుణాలు తీసుకున్నాయి. ఆ మొత్తంపై వందల కోట్ల రూపాయల్లో వడ్డీ చెల్లిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు నిధులను విడుదల చేయలేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
ఇప్పుడు కూడా..నిధుల కేటాయింపులు పెంచడానికి బదులు బాండ్ల జారీకే ప్రభుత్వం మొగ్గు చూపింది. 1400 కోట్ల రూపాయలను ఫ్యూయల్ సర్‌చార్జి సర్దుబాటు (ఎఫ్ఎస్ఎ) కింద పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులనుంచి వసూలు చేయడానికి విద్యుత్ సంస్థలు ఇదివరకే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి)ని కోరాయి. చార్జీల పెంపుదల ద్వారా మరింత మొత్తాన్ని రాబట్టుకోవడం తథ్యంగా కనిపిస్తోంది.