Monday, May 3, 2010

పసుపు ధర పరుగో పరుగు

క్వింటాలుకు రూ.15,000 మైలురాయి దాటింది
విత్తన పసుపునకూ గిరాకీ
నిజామాబాద్‌ - న్యూస్‌టుడే
త్తిని తెల్ల బంగారమని, మిర్చిని ఎర్ర బంగారమని, పసుపును పచ్చ బంగారమని ముద్దుగా పిలుచుకుంటాం. పచ్చ బంగారమనే పేరుకు ప్రస్తుతం పసుపు సార్ధకతను చేకూరుస్తోంది. ఆరుగాలం శ్రమించిన అన్నదాతల ఇంట ధన రాశులు కురిపిస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇంతకు మునుపు ఎన్నడు లేని విధంగా నిజామాబాద్‌ మార్కెట్‌లో క్వింటాలు పసుపు ధర రూ.15,300 పలుకుతోంది.

పసుపు విక్రయాలకు నిజామాబాద్‌ మార్కెట్‌ పెట్టింది పేరు. నిజామాబాద్‌ మార్కెట్‌కు ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి పసుపు వస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో ఏటా 10,000 హెక్టార్లకు తగ్గకుండా పసుపును సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించే పసుపునకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. కడప జిల్లా దుగ్గిరాల, వరంగల్‌ జిల్లా కేసముద్రం, మహారాష్ట్రలోని సాంగ్లి లాంటి మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ పసుపు ధర బంగారంతో పోటీపడుతోంది. 2006-07లో క్వింటాలు ధర రూ.1,850 ఉండేది. 2007-08లో రూ.2,650కి పెరిగింది. 2008-09లో రూ.4,500లకు చేరింది. 2009లో పసుపు దశ తిరిగింది. నెలనెలా ధర పెరుగుతూ వచ్చి ఏప్రిల్‌కు రూ.10,000 దాటింది. అక్టోబర్‌ నెలాంతానికి వచ్చే సరికి క్వింటాలు ధర రూ.11,000 కు చేరింది. నవంబరులో రూ.12,000, మార్చి నెలలో రూ.13,000 నుంచి ఈ నెల రూ.15,000 దాటింది. సోమ, మంగళ, బుధ వారాల్లో పసుపు (కొమ్ము) ధర క్వింటాలుకు రూ.15,300 పలకటం గమనార్హం. మండ రకానికి రూ.13,700 లభించింది. ఇది రికార్డు ధర. ఈ సీజన్‌లో ఏ మార్కెట్‌లో ఇంత ధర రాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4.10 లక్షల క్వింటాళ్ల పసుపు మార్కెట్‌కు వచ్చింది. ఇంకా మే నెల ఉంది. మార్కెట్‌కు వచ్చే సరుకు తగ్గినా మరో నెల రోజుల్లో 40,000 క్వింటాళ్ల పసుపు వస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిరుడు సీజన్‌ మొత్తంలో మార్కెట్‌కు వచ్చింది 4 లక్షల క్వింటాళ్లు మాత్రమే.

ఈ ఏడాది పసుపు ధర ఆకాశాన్నంటటంతో రైతుల దృష్టి పసుపు సాగుపై పడింది. రూ.4,000 ఉన్న ధర ఈ ఏడాది రూ.15,000 అధిగమించటం పసుపు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం 10,000 హెక్టార్లు సాగు అవుతున్న నిజామాబాద్‌ జిల్లాలో వచ్చే ఏడాది మరో 10,000 హెక్టార్లు పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో విత్తన పసుపునకు డిమాండ్‌ పెరిగింది. ఒక ఎకరంలో పసుపు వేయాలంటే 8 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్ల పచ్చి పసుపు కావాలి. పచ్చి పసుపు ధర చూస్తే చుక్కల సరసన చేరింది. నిజామాబాద్‌ జిల్లాలో క్వింటాలు ధర రూ.3,300 ఉండగా, వరంగల్‌ జిల్లాలో రూ.5,000 పలుకుతోంది. ఒక ఎకరం పసుపు సాగు చేయాలంటే ఇతర ఖర్చులు కాకుండా విత్తన పసుపు కొనటానికి రూ.40,000 నుంచి రూ.50,000 పెట్టుబడి పెట్టాలి. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా వచ్చే ఏడాది సంగతి దేవుడెరుగు.. ఇపుడు ధర బాగా ఉన్నందున పండిన పసుపును పండినట్లే రైతులు అమ్మేస్తున్నారు. కొందరు రైతులు తాము పండించిన పసుపును విత్తనానికి ఆపుకోవటానికి కూడా తటపటాయిస్తున్నారు.