Saturday, May 29, 2010

ఈ శ్రీమంతుడి జీతం రూ.15 కోట్లే..

ఆదర్శప్రాయంగా నిలవాలనే: రిలయన్స్‌
ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ వరుసగా రెండో ఏడాదీ 15 కోట్ల రూపాయల జీతంతోనే సరిపెట్టుకున్నారు.. వాస్తవానికి కంపెనీ వాటాదార్ల నుంచి లభించిన ఆమోదం ప్రకారం.. 2009-10 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సీఎండీగా రూ.39.36 కోట్ల (2008-09 జీతం రూ.15 కోట్ల కంటే రెండింతలకు పైగా) జీతాన్ని పొందేందుకు ఆయన అర్హులు. ఎక్కువ పారితోషికాన్ని మూటకట్టుకునే అవకాశం ముందున్నప్పటికీ ఆయన అలా చేయలేదు. 'మేనేజ్‌మెంట్‌ విభాగంలోని ఉన్నతాధికారులకు జీతాల చెల్లింపులో ఓ పరిమితిని పాటించే విషయంలో ఇతరులకు ఆదర్శ ప్రాయంగా నిలవాలనే ఆయన కాంక్షకు తాజా నిర్ణయం అద్దం పడుతోంద'ని ఆర్‌ఐఎల్‌ మంగళవారం తమ వాటాదార్లకు తెలిపింది. దాదాపు 29 బిలియన్‌ డాలర్ల నికర విలువ(నెట్‌ వర్త్‌)తో దేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ముకేశ్‌ అంబానీ చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.

పీఎంఎస్‌ ప్రసాద్‌ జీతంలో పెరుగుదల: అనిల్‌ అంబానీ గ్రూప్‌తో కోర్టు వివాదంలో ఆర్‌ఐఎల్‌ తరఫున కీలక భూమిక పోషించిన సంస్థ ఉన్నతాధికారి పీఎంఎస్‌ ప్రసాద్‌ గత ఆగస్టులో కార్యనిర్వాహక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన జీతం రూ.1.53 కోట్లకు పెరిగింది. 2008-09 సంవత్సరంతో పోల్చుకుంటే గతసారి ఆర్‌ఐఎల్‌లోని ఇతర కార్యనిర్వాహక డైరెక్టర్ల(ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్స్‌) చెల్లింపు ప్యాకేజీల్లో మంచి పెరుగుదల నమోదైంది.