2010లో మన 'మాయాబజార్' రంగుల్లో దర్శనమిచ్చింది. 2011లో అది త్రీడీలో రావొచ్చు! సినిమాలే కాదు... టీవీ, ల్యాప్‌టాప్, కెమెరా, వీడియోగేమ్స్, ప్రింటర్... ఇలా అన్నీ త్రీడీనే ఇప్పుడు. అందుకే ఈ ఏడాది... త్రీడీ నామ సంవత్సరం! ఇంకా చెప్పాలంటే, ఈ దశాబ్ది... త్రీడీ దశాబ్ది!

కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది...'
ఎంత చక్కగా చెప్పారో మనసుకవి ఆత్రేయ.
కల మనిషికి ఓ వరం. అందమైన కలలు కనడం ఎంత అదృష్టవో! ఆ కలలు మనల్ని కష్టాలూ కన్నీళ్లూ లేని ఆనందలోకంలోకి తీసుకెళ్తాయి. విచిత్రమేంటంటే... కలలో కొన్ని సందర్భాల్లో మనం పాత్రలమూ అవుతాం, వెుత్తం కలకు ప్రేక్షకులమూ అవుతాం. కలను అంతలా అనుభూతించగలం కాబట్టి కలలే వెుదటి త్రీడీ దృశ్యాలు!
కవి భాషలో చెప్పాలంటే... ఈ ప్రపంచమంతా ఓ నాటకరంగం. ముఖానికి రంగువేసుకోకుండానే మనం అందులో పాత్రలమవుతాం. అలాంటి మరెన్నో పాత్రలనూ చూస్తాం.
టెక్నాలజీ భాషలో చెప్పాలంటే... ఈ ప్రపంచమంతా ఓ త్రీడీ స్క్రీన్. త్రీడీ కళ్లద్దాలు లేకుండానే ఈ అద్భుతాన్ని చూడగలం.
ఆ లెక్కన... ఇన్నాళ్లూ మనం ఈ త్రీడీ లోకంలోనే ఉన్నాం కదా. మరి ఇప్పుడెందుకు హఠాత్తుగా త్రీడీ ప్రస్తావన వచ్చిందీ... ఈ దశాబ్దాన్ని త్రీడీ దశాబ్దిగా నామకరణం చేయాల్సివచ్చిందెందుకూ... అంటే,
అదంతా జేమ్స్ కేమరాన్ 'అవతార్' ప్రభావం!

'అవతార్' థియేటర్ల నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులను సినిమా ఎలా ఉందీ అని అడిగితే... 'మేం సినిమా చూడలేదు, ఫీలయ్యాం' అని చెప్పారట. అంత అద్భుతంగా తీశాడా చిత్రాన్ని కేమరాన్. అందుకే... ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ సినిమాకూ రాని కలెక్షన్లు వచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా త్రీడీ చర్చకు తెరలేచింది. ఐపీఎల్-3లో కొన్ని మ్యాచ్‌లను కొన్ని నగరాల్లో త్రీడీలోనే ప్రదర్శించారంటే త్రీడీ క్రేజ్ ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. త్రీడీ టీవీలొచ్చాయి. కెమెరాలొచ్చాయి. త్వరలో పత్రికలొస్తున్నాయి, ప్రకటనలొస్తున్నాయి, ప్రత్యక్ష ప్రసారాలొస్తున్నాయి. ఇన్ని మార్పులు తీసుకొచ్చిన త్రీడీ గురించి వివరంగా తెలుసుకోవాలని ఎవరికి మాత్రం అనిపించదు.

* * *
మామూలు సినిమాకీ దీనికీ తేడా ఏంటి?
'కళ్లద్దాలు' అని కొంటె సమాధానం చెబుతారేవో!
అది కూడా ఒక తేడానేగానీ అసలు తేడా వేరే ఉంది. మామూలుగా మనం చూసే సినిమాలన్నీ 2డి సినిమాలు. అంటే... పొడవు, వెడల్పులే ఉంటాయి. అదే త్రీడీ అయితే వీటికి 'లోతు' అదనం. ఇందుకోసం ప్రత్యేక కెమెరాలను ఉపయోగించి దృశ్యాలను చిత్రీకరిస్తారు. మన రెండు కళ్లూ చూసే ఆ రెండు దృశ్యాలనూ క్రోడీకరించి ఒకే చిత్రంగా చూపించేవే త్రీడీ కళ్లద్దాలు. అందువల్లే చిత్రంలోని వస్తువులన్నీ మన ముందు ఉన్న - మనమే ఆ ప్రపంచంలో ఉన్న - అనుభూతి కలుగుతుంది.
వెుట్టవెుదట ఈ త్రీడీ చిత్రాలను తీసే కెమెరాను స్కాట్లాండుకు చెందిన డేవిడ్ బ్రూస్టర్ కనుక్కొన్నాడు. ఆ తరవాత త్రీడీ మీద ప్రయోగాలు వెుదలయ్యాయి. త్రీడీ సినిమా ఆలోచన నిజానికి గత శతాబ్దంలోనే వచ్చింది. 1890లో బ్రిటన్‌కు చెందిన విలియమ్ ఫ్రీజీ గ్రీనీ అనే పెద్దాయన... ఒకే సినిమాని పక్కపక్కనే రెండు తెరలపై వేశాడు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన కళ్లద్దాలిచ్చాడు. కాసేపటి తరవాత వాళ్లంతా ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. సినిమాలోని వస్తువులను, నటులను పట్టుకునేందుకు చేతులు ముందుకు చాచారు. కానీ, వాళ్లకేమీ దొరకలేదు. బుల్లెట్లు, గుర్రాలూ మీదకొస్తున్నట్టు వెనక్కు జరిగారు. అవేవీ వాళ్లమీదకు రాలేదు. ఇలాంటి ఎన్నో విచిత్రాలు వాళ్లను మంత్రముగ్ధుల్ని చేశాయి. అలా వెుదటిసారిగా త్రీడీ సినిమాను చూపించిన ఘనత గ్రీనీకి దక్కుతుంది.
అక్కణ్ణుంచి త్రీడీ సినిమాల మీద ప్రయోగాలు జోరందుకున్నాయి. గ్రీనీ కంటే రెండు ఆకులు ఎక్కువ చదివినవాళ్లు నిర్మించిన చిత్రం 'ద పవర్ ఆఫ్ లవ్' (1922). రెండు కెమెరాలతో తీసి, ఒకే తెరపై ప్రదర్శించిన వెుట్టవెుదటి త్రీడీ చిత్రమిది. తరవాత 1935లో వెుట్టవెుదటి త్రీడీ రంగుల చిత్రం విడుదలయింది.

త్రీడీ సినిమాల నిర్మాణం 1950లలో వూపందుకుంది. అందుకు ప్రధాన కారణం టీవీ అలియాస్ బుల్లితెర. ఆ రోజుల్లో అమెరికాలో బుల్లితెర... వెండితెరకు ఎసరు పెట్టింది. ప్రజలంతా టీవీల ముందునుంచి కదిలేవారు కాదట. వాళ్లను థియేటర్‌కి రప్పించాలంటే త్రీడీ ఒక్కటే మార్గంగా తోచింది హాలీవుడ్ డైరెక్టర్లకి. అలా కొన్నాళ్లు త్రీడీ జపం చేశారు. వానా డెవిల్, హౌస్ ఆఫ్ వ్యాక్స్, డయల్ ఎమ్ ఫర్ మర్డర్ లాంటి సూపర్‌హిట్ సినిమాలు నిర్మించారు. 1952-55 మధ్యకాలంలో 50కి పైగా త్రీడీ సినిమాలు వచ్చాయంటే ఆ వేడిని అర్థం చేసుకోవచ్చు. అయితే అది ఎంతోకాలం నిలవలేదు. చిత్రాల నాణ్యత తక్కువగా ఉండటం, నిర్మాణ ఖర్చులు ఎక్కువకావడంతో తరవాత్తరవాత త్రీడీ సినిమాలు తగ్గిపోయాయి. 1970లలో మళ్లీ త్రీడీ సినిమాలొచ్చాయి. తరవాత 1980-90లలో ఐమ్యాక్స్ తెర మళ్లీ త్రీడీ సినిమాలను తీసుకొచ్చింది. అప్పటికి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో ఆ సినిమాలకూ మంచి ఆదరణ లభించింది. అంతకుముందు వరకూ త్రీడీ సినిమా అంటే ఓ అద్భుతమే కానీ, దాన్ని చూడాలంటే కళ్లకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే అప్పటివరకూ ఉన్న కళ్లద్దాలతో దృశ్యం స్పష్టంగా ఉండేది కాదు, కళ్లపైనా ఒత్తిడి ఉండేది. ఆ తరవాత వచ్చిన పోలరైజ్డ్ కళ్లద్దాలతో ఆ ఇబ్బంది తగ్గింది.
అప్పట్లో అత్యాధునిక త్రీడీ కెమెరాలతో, ఐమ్యాక్స్‌తెర కోసం నిర్మించిన పూర్తిస్థాయి త్రీడీ చిత్రం 'ఘోస్ట్స్ ఆఫ్ అబిస్'. దీని దర్శకుడు మరెవరో కాదు... జేమ్స్ కేమరాన్!
'చిన్నారి చేతన్' మాయ
ఈ పాటికే చాలామందికి బాల్యం గుర్తుకొచ్చి ఉంటుంది. మరికొందరికి టీనేజీ కూడాననుకోండి. అప్పట్లో త్రీడీ సినిమా అంటే అందరూ చెప్పే పేరు చిన్నారి చేతన్. నిజానికి భారతీయ వెండితెరపై వెుదటి త్రీడీ సినిమా అది కాదు. దానికి మూలమైన 'మై డియర్ కుట్టిచేతన్‌ి'. దీన్ని 1984లో మలయాళంలో తీశారు. ఆ తరవాతే ఇది తెలుగు, హిందీ వెుదలైన భాషల్లో విడుదలయింది. అప్పట్లో ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందని! త్రీడీ కళ్లద్దాలు పెట్టుకుని థియేటర్లో ఈ సినిమా చూస్తూ పొందిన అనుభూతి ఇప్పటికీ చాలామంది కళ్లల్లిో మెదుల్తూనే ఉంటుంది.
తరవాత్తరవాత హాలీవుడ్ సినిమాలకు మనదేశం పెద్ద మార్కెట్‌గా మారిపోవడంతో ఇంగ్లిషు సినిమాలూ విడుదల కావడం వెుదలుపెట్టాయి. అలాగే 'అవతార్' కూడా వచ్చింది. భారతీయ ప్రేక్షకులంతా 'అవతార్' అభిమానులయిపోయారు. నిర్మాణదశలో ఉన్నప్పుడే ఆసక్తి రేకెత్తించిన 'అవతార్' మరెన్నో ఆవిష్కరణలకూ మార్గం చూపింది.
బుల్లితెరకూ త్రీడీ సొబగులు
ఇక్కడో విచిత్రమైన విషయం చెప్పాలి. బుల్లితెరకు త్రీడీ హంగు అద్దకానికంటే ముందే అందులో త్రీడీ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి! అంటే... త్రీడీ టీవీల కంటే ముందే టీవీల్లో త్రీడీ కార్యక్రమాలు వచ్చాయన్నమాట. వీటిని త్రీడీ కళ్లద్దాలతోనే చూడాలనుకోండీ. అమెరికాలో 1990లలో త్రీడీ సీరియళ్లు వచ్చాయి. 1993లో 'థర్డ్ రాక్' అనే సీరియల్‌ను సన్‌టీవీ త్రీడీలో ప్రసారం చేసింది. యూకేలోని 'ఛానల్ 4' కూడా కొన్ని త్రీడీ కార్యక్రమాలను ప్రసారం చేసింది. 2008 నాటికే జపాన్‌లోని 'బీఎస్ 11' ఛానల్ రోజుకు నాలుగుసార్లు త్రీడీ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఆ మధ్య ఓ తెలుగు ఛానల్ కూడా త్రీడీ సీరియల్‌ను ప్రసారం చేసింది.
ఇక త్రీడీ టీవీల విషయానికొస్తే... ఇవి మార్కెట్‌ను ముంచెత్తడం ఈ ఏడాదే వెుదలయింది. వెుట్టవెుదటి త్రీడీ టీవీని శామ్‌సంగ్ విడుదల చేసింది. ఆ కంపెనీ నుంచి ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ, ప్లాస్మా విభాగాల్లో వెుత్తం పది వోడళ్లు వచ్చాయి. అదే బాట పట్టాయి... సోనీ, ఎల్జీ, ఫిలిప్స్, తొషిబా, పానసోనిక్ లాంటి కంపెనీలు. త్రీడీ టీవీల ధరలు రూ.లక్షా ముపైశ్ఫవేల నుంచి రూ.నాలుగున్నర లక్షల వరకూ ఉన్నాయి. త్రీడీ టీవీ చూడాలంటే ముఖ్యంగా కావాల్సినవి బ్లూ రే డీవీడీ ప్లేయర్, త్రీడీ కళ్లద్దాలు. వీటి కోసం అదనంగా చెల్లించాల్సిందే. సాధారణంగా త్రీడీ టీవీలతో ఒకే ఒక సెట్ త్రీడీ కళ్లద్దాలు ఇస్తున్నారు. అదనంగా కావాలంటే ఒక్కోదానికీ రూ.1000 వరకూ చెల్లించాలి.
త్రీడీ విప్లవం రావడంతో ఈ కళ్లద్దాలు తయారుచేసే కంపెనీలూ పుట్టుకొచ్చాయి. ఎక్స్‌ప్యాండ్ (XpanD),గున్నార్ ఆప్టిక్స్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు తయారుచేసే ఈ కళ్లద్దాల ఖరీదు రూ.600-700 వరకూ ఉంటుంది. 'మేం తయారుచేసే కళ్లద్దాలు టీవీ, సినిమా ఏదయినా చూడటానికి పనికొస్తాయి' అంటున్నారు వీటి తయారీదారులు. అంతేకాదు, త్రీడీ చిత్రాలను చూపించే బ్లూరే ప్లేయర్లకూ గిరాకీ పెరిగింది.

త్రీడీ సినిమాలు వచ్చాయి... మరి, ఆటలనూ త్రీడీలో చూపిస్తే అనే ఆలోచన రాకుండా ఎలా ఉంటుంది. దాని ఫలితం... త్రీడీలో ఆటల ప్రత్యక్షప్రసారాలు! ప్రపంచంలో వెుట్టవెుదట... ఒక ఆటను త్రీడీలో లైవ్ చూపించిన ఘనత స్కైటీవీకి దక్కుతుంది. ఈ ఏడాది జనవరి 31న ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ని ప్రసారం చేసి రికార్డుల్లోకెక్కింది బ్రిటన్‌కు చెందిన స్కై బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ 'స్కై త్రీడీ'. ఇది త్రీడీ ఛానల్. ఈ ఏడాది చివరినాటికి ఆటలు, వినోద కార్యక్రమాలు, సీరియళ్లు అన్నీ త్రీడీలోనే ప్రసారం చేసేందుకు ఏర్పాట్లుచేస్తోంది. అంతేకాదు, త్వరలో జరగబోయే యూకే ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో కొన్నింటిని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
'ఆటలే కాదు, అన్నీ త్రీడీలో చూపిస్తాం' అంటూ ఏకంగా ఓ త్రీడీ ఛానల్‌నే ఏర్పాటుచేసేసింది దక్షిణ కొరియాలోని 'కొరియా డిజిటల్ శాటిలైట్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ'. ఇది ప్రపంచంలోనే వెుట్టవెుదటి త్రీడీ ఛానల్.
వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ పోటీలు కూడా త్రీడీలోనే ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'మేం ఫిఫా వరల్డ్‌కప్ యాజమాన్యంతో ఎనిమిదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాం. త్వరలో జరిగే వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో 25 మ్యాచ్‌లను త్రీడీ కెమెరాలతోనే షూట్ చేస్తాం. సో, ప్రేక్షకులంతా త్రీడీలోనే వాటిని చూడొచ్చు' అంటున్నారు సోనీ ఇండియా ఎండీ ఫ్యుజిటా.
ఈఎస్‌పీఎన్ ఛానల్ కూడా ప్రత్యేక త్రీడీ ఛానల్‌ను రూపొందిస్తోంది. ఏటా 85 టోర్నమెంట్లు ఇందులో ప్రత్యక్ష ప్రసారం చేస్తారట.
ఐమ్యాక్స్, సోనీ, డిస్కవరీ ఛానళ్లు సంయుక్తంగా ఒక పూర్తిస్థాయి త్రీడీ ఛానల్‌ను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా అది కూడా పూర్తికావచ్చు.
2డీ నుంచి 3డీలోకి...
త్వరలోనే 'మాయాబజార్'ను మీరు త్రీడీలో చూడొచ్చు! ఆశ్చర్యపోతున్నారా?
మాయాబజార్‌ను రంగుల్లో చూస్తామని ఎప్పుడైనా వూహించారా?
కానీ, ఆ అద్భుతం జరిగింది.
ఇప్పుడు మరో అద్భుతం... 2డీ చిత్రాల్ని త్రీడిలోకి మార్చే పరిజ్ఞానం! హాలీవుడ్‌లో ఇప్పటికే 2డీ యానిమేషన్ సినిమాలను త్రీడీ చేసే పనిలో పడ్డారు. ఈ పరిజ్ఞానాన్ని మనదేశంలోకి తెచ్చేందుకు అనిల్ అంబానీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
అమెరికాకు చెందిన ఎన్‌విడియా కంపెనీ నోట్‌బుక్స్‌కి త్రీడీ సౌకర్యం కల్పించేందుకు 'త్రీడీ విజన్' అనే కిట్‌ని రూపొందించింది. ఇందులో సాఫ్ట్‌వేర్, త్రీడీ కళ్లద్దాలు ఉంటాయి. దీని సాయంతో ఫొటోలు, సినిమాలు త్రీడీలో చూడొచ్చు. కంప్యూటర్‌లోని 2డీ గేమ్స్‌ని త్రీడీగా మార్చే సామర్థ్యమూ దీనికి ఉంది. ఈ కంపెనీ తయారుచేసిన త్రీడీ టీవీ ప్లే కిట్‌తో విండోస్ విస్తా, విండోస్-7లతో నడిచే కంప్యూటర్లను, ల్యాప్‌టాప్‌లను త్రీడీ టీవీలుగా కూడా మార్చేయవచ్చు అంటున్నారు దాని తయారీదారులు. ఈ పరిజ్ఞానంతోనే ఏసస్ కంపెనీ ఒక ల్యాప్‌టాప్‌ను తయారుచేసింది.

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించాలి.
త్రీడీలో కళ్లద్దాలూ అంతే ముఖ్యం.
ఎంత గొప్ప త్రీడీ అద్భుతం సృష్టించినా కళ్లద్దాలు లేకపోతే అంతా గందరగోళమే.
త్రీడీ వీడియోలు, సినిమాలు, ఆటలు... ఏవి చూడాలన్నా ప్రత్యేకమైన కళ్లద్దాలుండాలి. వీటిలో ఎనాగ్లిఫ్, పోలరైజ్డ్, యాక్టివ్ ఎల్‌సీడీ షట్టర్ అనే మూడు రకాలున్నాయి. వెుదటి రెంటినీ థియేటర్‌లో సినిమాలు చూడటానికి ఉపయోగిస్తారు. ఎనాగ్లిఫ్ అంటే 1990ల వరకూ ఉపయోగించిన ఎరుపు, నీలం గ్లాసులున్న కళ్లద్దాలు. వీటితో చిత్రం స్పష్టంగా కనిపించేది కాదు. కళ్లపై ఒత్తిడి ఎక్కువ ఉండేది. వీటిస్థానంలో వచ్చినవే పోలరైజ్డ్ కళ్లద్దాలు. ఇటీవలి కాలంలో త్రీడీ సినిమాలు చూడటానికి వీటినే ఉపయోగిస్తున్నాం. పాతవాటితో పోలిస్తే ఇవి కంటిపై చాలా తక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. ఇందులోనే రీఛార్జిబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఇవి సుమారు 80 గంటలు పనిచేస్తాయి. ఇక మూడో రకం కళ్లద్దాలు ఇంట్లో టీవీలూ, ల్యాప్‌టాప్‌లూ వంటివి చూడటానికి పనికొస్తాయి.
త్రీడీ బాగున్నా... ఎంతసేపని కళ్లద్దాలతో చూడగలం?
మెదడుకీ, కళ్లకీ ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే కళ్లద్దాలు లేకుండా త్రీడీని చూసేందుకు కూడా ప్రయోగాలు చేస్తున్నారు. జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీ 'షార్ప్' దీనిపై పదేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. ఇటీవలే ఒక స్క్రీన్‌ని తయారుచేసింది. దీనికి ఎదురుగా, దగ్గరగా నిల్చుని చూస్తే చాలు... కళ్లద్దాలు లేకుండానే త్రీడీ అనుభూతి పొందవచ్చు. కాకపోతే, ఇలా ఎంతసేపు చూడగలం? ఎంతమంది ఒకేసారి చూడగలరు?... మళ్లీ ఎన్నో సందేహాలు. అందుకే ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ స్క్రీన్ సెల్‌ఫోన్లకయితే సరిపోవచ్చని దీన్ని వాటిలో ఏర్పాటుచేసే ఆలోచనలో ఉంది షార్ప్. ఈ ఏడాది చివరికల్లా దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తారట. తొషిబా కంపెనీ కూడా కళ్లద్దాలు అవసరం లేకుండా చూడగలిగే త్రీడీ స్క్రీన్‌ని తయారుచేసింది.

ఓ అద్భుతమైన అనుభవాన్ని మన ముందుకు తెచ్చింది త్రీడీ పరిజ్ఞానం. సినిమాలే కాదు టీవీలు, కంప్యూటర్లు, కెమెరాలు... ఇలా అన్నీ త్రీడీ టెక్నాలజీని వోసుకొస్తున్నాయి. అయినా త్రీడీ విప్లవం ఇంకా ఉయ్యాలలోని పాపే అంటున్నారు కొందరు సాంకేతిక నిపుణులు. ఎందుకంటే... దీనిపై చాలా సందేహాలున్నాయి మరి!
* ఒక టీవీతో ఇచ్చే త్రీడీ కళ్లద్దాలు మరో టీవీని చూడటానికి పనికిరావు.
* త్రీడీ సినిమాల వల్ల పైరసీ బెడద ఉండదనేది కొందరి వాదన. అలాంటి సాంకేతిక పరిజ్ఞానం కనుక్కోలేరని గ్యారంటీ ఏంటి?
* టీవీముందు కూర్చున్న ప్రతిసారీ త్రీడీ కళ్లద్దాలు పెట్టుకోవాలంటే సమస్యే. పోనీ, ఇంట్లోవాళ్లంటే ఉన్న కళ్లద్దాలు పెట్టుకుని టీవీ చూస్తారు. అతిథులూ, బంధువుల సంగతి? వాళ్లకూ మనమే కళ్లద్దాలు కొనాలా? లేకపోతే మన ఇంటికొచ్చిన ప్రతిసారీ వాళ్లు కళ్లద్దాలు వెంట తీసుకురావాల్సిందేనా?
* ఎలాంటి దృష్టిలోపమూ లేనివాళ్లు ఎంతసేపు కళ్లద్దాలతో త్రీడీ కార్యక్రమాలు చూడగలరు? చెప్పడం కష్టమే. మరి, కంటి సమస్యలు ఉన్నవాళ్లూ అప్పటికే కళ్లద్దాలు ఉన్నవాళ్ల సంగతి? వాళ్లకి మరీ ఇబ్బంది.
* త్రీడీ క్రేజ్ పెరిగితే సినిమా రంగానికి ప్రమాదమే అనేవాళ్లూ లేకపోలేదు. 'ప్రతి సినిమానీ త్రీడీలో తీయలేం. అది కథపై ఆధారపడి ఉంటుంది. పోనీ త్రీడీలో తీద్దామా అంటే నిర్మాణవ్యయం ఎక్కువాయెు. అందువల్ల అంతిమంగా నష్టపోయేది చిన్నచిత్రాల నిర్మాతలే. పెద్ద నిర్మాతలు త్రీడీ సినిమాలు తీసినా భవిష్యత్తులో టిక్కెట్ల ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంది' అనేది వాళ్ల వాదన.
... ఇవన్నీ చిక్కు ప్రశ్నలే ప్రస్తుతానికి.
భవిష్యత్తులో తాను తీయబోయే సినిమాలన్నీ త్రీడీలోనే ఉంటాయని ప్రకటించాడు కేమరాన్. దానికి ఆరంభ సూచకంగా... టైటానిక్‌ను త్రీడీలో తీస్తానని వెల్లడించాడు. డిస్నీవాళ్లు కూడా ఇకమీదట త్రీడీ సినిమాలే తీస్తారట. హాలీవుడ్ పోటీని తట్టుకునేందుకు మనవాళ్లూ త్రీడీ జపం వెుదలుపెట్టారు.
రజనీకాంత్, ఐశ్వర్యారాయ్‌లతో మెగా డైరెక్టర్ శంకర్ 'రోబో' సినిమా నిర్మిస్తున్నాడు. ఇందులో కొంతభాగాన్ని త్రీడీలోనే చిత్రీకరించాడట! చిన్నారులను థియేటర్లకు రప్పించిన హనుమాన్‌కు సీక్వెల్ తీస్తున్నారు... అది కూడా త్రీడీలో. 'రక్తచరిత్ర' తరవాత రామ్‌గోపాల్‌వర్మ త్రీడీ చిత్రాన్ని నిర్మించనున్నాడట. విక్రమ్‌భట్ ఏకంగా 'యమద్వార్' అనే హారర్ సినిమాని త్రీడీలో తీస్తానని ప్రకటించాడు. ఈ టెక్నాలజీ హాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు... ఇంకా చాలా రంగాల్లో మార్పులు తెచ్చింది.
వర్ల్‌పూల్ ఫ్రిజ్ ప్రకటనను త్రీడీలో చిత్రీకరించారు. కాకపోతే... త్రీడీ సినిమాలు ప్రదర్శించే మల్టీప్లెక్స్‌లలోనే దీన్ని చూడగలం.
శామ్‌సంగ్, వోటోరోలా కంపెనీలు కళ్లద్దాలు లేకుండానే చూడగలిగే త్రీడీ సెల్‌ఫోన్లు తయారుచేస్తున్నాయి.
టెక్ ఐ(techeye.net)... జూన్ నాలుగో తేదీ నాటికి ప్రపంచంలోనే వెుట్టవెుదటి త్రీడీ వెబ్‌సైట్ కానుంది.
ఇలాంటివి ఇంకా ఎన్నో!
ఇదంతా వర్తమానం.
భవిష్యత్తులో... వెబ్‌సైట్లన్నీ త్రీడీలోనే ఉండొచ్చు. ప్రతి ఇంట్లో కనీసం ఒక త్రీడీ వస్తువు(సెల్‌ఫోన్, కెమెరా, టీవీ... ఏదో ఒకటి) ఉండొచ్చు. హోర్డింగులూ డ్రెస్సులూ శుభలేఖలూ... ఇలా అన్నీ త్రీడీ కావచ్చు.
ఏం, ఇవన్నీ జరగకూడదా?
ఎందుకు జరగకూడదు!
ఇప్పుడున్నవన్నీ ఎలా వచ్చాయో అవీ అలాగే వస్తాయి.
మనిషి ఆశాజీవి. ఆవిష్కరణల మేధావి.
![]() |
![]() |
![]() ఈ 'ఫైన్‌పిక్స్ రియల్ త్రీడీ డబ్ల్యూ1' కెమెరాలో రెండు లెన్సులుంటాయి. దీనిద్వారా త్రీడీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. వీటిని కెమెరాలోనే త్రీడీలో చూడొచ్చు. దీని ధర సుమారు రూ.40,000. బస్సు, కారు, రైలు, ఆఖరికి విమానంలో ప్రయాణిస్తూ కూడా స్పష్టమైన ఫోటోలు తీయడం దీని ప్రత్యేకత. అంతేకాదు, ఈ ఫొటోలను ప్రింట్‌లోనూ చూసుకోవచ్చు. అందుకోసమే ఫ్యుజిఫిల్మ్ వీటికోసం ప్రత్యేకమైన షీట్లు రూపొందించింది. వాటిపై ప్రింట్ చేస్తే త్రీడీ అనుభూతి కలుగుతుందట. ఈ కెమెరాతో 2డీ చిత్రాలనూ తీసుకోవచ్చు. సోనీ కంపెనీ కూడా త్రీడీ కెమెరా తయారుచేస్తున్నామని ప్రకటించింది. త్వరలోనే అదీ మార్కెట్లోకి రానుంది. |
![]() అవతార్‌ను తీస్తేగీస్తే త్రీడీలోనే తీయాలని కేమరాన్ అప్పుడే నిర్ణయించుకున్నాడట. టైటానిక్‌లానే అవతార్‌ని కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నాడు. కానీ, అప్పటికి త్రీడీ సినిమాను చూపించే థియేటర్లు ఎన్ని ఉన్నాయి, కళ్లద్దాలు ఎంతమందికి అందుబాటులో ఉన్నాయి, సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందింది... ఇవన్నీ ఆలోచించాడట. ఎంతయినా మెగా డైరెక్టర్ కదా! సో, అప్పటికి అవతార్ వేడి ప్రపంచాన్ని తాకదని కేమరాన్‌కి అర్థమయిపోయింది. అందుకే, ఇంత ఆలస్యంగా మనముందుకొచ్చింది అవతార్. |