ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలపై ప్రభావం!
పోటీ తట్టుకునేందుకు బీఎస్‌ఈ యత్నాలు

ఆందోళన ఎందుకంటే..
ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా(ఎఫ్‌టీఐఎల్), మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ(ఎమ్‌సీఎక్స్)లు ప్రమోట్ చేసిన ఎమ్‌సీఎక్స్-ఎస్‌ఎక్స్ త్వరలో కొత్త స్టాక్ ఎక్స్ఛేంజీని తీసుకురావడానికి ఎంతో దూరం లేదు. ఇప్పటికే సెబీ నియమాలకు అనుగుణంగా ఎమ్‌సీఎక్స్-ఎస్‌ఎక్స్ ప్రమోటర్లు తమకున్న వాటాను తగ్గించుకుని ఈక్విటీ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఎఫ్‌టీ, ఎమ్‌సీఎక్స్‌లు ఎమ్‌సీఎక్స్-ఎస్‌ఎక్స్‌లో తమకున్న వాటాలను 70% నుంచి 10 శాతానికి తగ్గించుకున్న సంగతి తెలిసిందే. ఇక సెబీ నుంచి తుది అనుమతులు రావడమే తరువాయి. అవి వస్తే ఒక నిర్ణయాత్మక విదేశీ భాగస్వామితో కలిసి స్టాక్ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేస్తుంది.అయితే ఈ కమోడిటీ ఎక్స్ఛేంజీ రంగంలోకి దిగితే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు. కానీ ఎమ్‌సీఎక్స్‌కున్న బలాలను చూస్తే మాత్రం వెంటనే జాగ్రత్త పడకపోతే ప్రస్తుత ఎక్స్ఛేంజీలకు ఇబ్బందులు తప్పవన్న సంగతి అర్థమవుతుంది. కమోడిటీ ఫ్యూచర్స్‌లో 90 శాతం వాటా ఎమ్‌సీఎక్స్‌కే ఉంది. కరెన్సీ ఫ్యూచర్స్‌లోనూ 50 శాతం వాటా దీనిదే. అంటే బ్రోకర్లతో అనుబంధం దీనికి చాలా బలంగా ఉందని తెలుస్తోంది. దీన్నిబట్టి ఒకవేళ ఈక్విటీ మార్కెట్లోకి వస్తే ఆ సంబంధాల ద్వారా అతి త్వరలోనే ప్రస్తుత స్టాక్ ఎక్స్ఛేంజీల మార్కెట్ పరిణామాన్ని ఇది కొల్లగొడుతుందన్న విషయంలో సందేహం లేదు. అదీ కాక 2003లో ఏర్పాటైన ఈ సంస్థ అతి తక్కువ వ్యవధిలో కరెన్సీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ విషయంలో ఎన్‌ఎస్‌ఈని అధిగమించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎస్‌ఎమ్‌ఈ) రంగానికి ప్రత్యేక ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేయాలనీ ఎఫ్‌టీఐఎల్ యోచిస్తుండడం విశేషం.

కొత్త సభ్యులతో బీఎస్‌ఈలో ఉత్సాహం
ఎమ్‌సీఎక్స్ కొత్త స్టాక్ ఎక్స్ఛేంజీని తీసుకొస్తున్న నేపథ్యంలో పోటీని తట్టుకొనేందు కోసం పావులు కదుపుతున్న బీఎస్‌ఈ యత్నాలు మంచి ఫలితాన్నే ఇస్తున్నాయి. సభ్యత్వ రుసుమును 90 శాతం తగ్గించి రూ.1 కోటి నుంచి రూ.10లక్షలకు తగ్గించింది. దీంతో బీఎస్‌ఈలోకి కొత్తగా 1200 మంది కొత్త సభ్యులొచ్చారు. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్య 800తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం సభ్యుల సంఖ్య 2000కు చేరనుంది. ఎన్‌ఎస్‌ఈ నుంచి 100-150 మంది సభ్యులను ఆకర్షించినట్లు బీఎస్‌ఈ చెబుతోంది. వచ్చే కొద్ది నెలల్లో మరో 2000 మంది సభ్యులను అంచనా వేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా రోడ్డుషోలకు పథక రచన చేస్తోంది. తద్వారా మార్కెట్ పరిమాణం భారీగా పెరగుతుందని బీఎస్‌ఈ ఎండీ, సీఈఓ మధు కన్నన్ అంచనా వేస్తున్నారు. కొత్త సభ్యుల రాకతో రోజువారీ ట్రేడింగ్ పరిమాణం 20 శాతం మేర పెరగగలదని బీఎస్‌ఈ అంచనా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ విభాగంలో సగటున రోజుకు రూ.5,000 కోట్ల టర్నోవరు ఉంటోంది.