Thursday, May 13, 2010

ప్రధానితో అనిల్‌ అంబానీ భేటీ

సుప్రీం తీర్పు నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం

న్యూఢిల్లీ: అనిల్‌ ధీరూబాయ్‌ అంబానీ గ్రూపు (ఆడాగ్‌)అధినేత అనిల్‌ అంబానీ బుధవారం ఉదయం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు. ఇక్కడ ప్రధాని అధికార నివాసంలో సుమారు గంట పాటు ఆయన మన్మోహన్‌తో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కుటుంబ ఒప్పందం ప్రకారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి చౌకగా గ్యాస్‌ పొందేందుకు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విఫలమైన అనిల్‌, సుప్రీం తీర్పు వెలువడిన కొన్నిరోజులకే ప్రధానితో సమావేశం కావడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకొంది. సమావేశంలో ఇటీవల జరిగిన పరిణామాలపై అనిల్‌ అంబానీ ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా తమ సంస్థ గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టులకు చమురు శాఖ కేజీ బేసిన్‌ నుంచి గానీ.. ఇతర మార్గాల ద్వారా గానీ గ్యాస్‌ ఎలా అందించగలదన్న అంశంపై కూడా ఆయన చర్చించినట్లు అభిజ్ఞ వర్గాల సమాచారం. అంతకు ముందు అనిల్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన వ్యక్తిగత కార్యదర్శి టీకేఏ నాయర్‌తో కూడా సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన నాయర్‌కు తమ గ్రూపులోని 8000-10000 మె.వా. సామర్థ్యం గల గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టుల గురించి వివరిస్తూ వీటికి ఢిల్లీలాంటి రెండు పెద్ద నగరాలకు విద్యుత్తును అందించేందుకు చాలినంత సామర్థ్యం ఉన్నట్లు అనిల్‌ వివరించినట్లు తెలుస్తోంది. ఆయన విద్యుత్‌ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, విద్యుత్తు శాఖ కార్యదర్శి ఉమా శంకర్‌, పలువురు రాజకీయవేత్తలు, ఉన్నతాధికారులతోనూ సమావేశమైనట్లు తెలుస్తోంది.