Monday, May 10, 2010

కార్పొరేట్‌ డ్రెస్‌కి కొత్త కళ !


న్యూఢిల్లీ: కార్పొరేట్‌ ప్రపంచంలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. సకల సౌకర్యాలకు పెట్టింది పేరుగా ఉన్న కార్పొరేట్‌ సంస్థలు తాజాగా ఉద్యోగులకు ఫ్రైడే డ్రెస్సింగ్‌ కోడ్‌ను తీసుకురానున్నాయి. వారాంతపు సెలవు రోజులుగా ఉండే శని, ఆదివారాలకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఉద్యోగులు కాజువల్‌ డెస్సులు వేసుకునే సంప్రదాయం గత పదేళ్లుగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఈ శుక్రవారం రోజు కూడా ఉద్యోగులు టీ-షర్టులు, జీన్స్‌తో కాకుండా ప్రత్యేక పద్ధతిలో ఉండే క్యాజువల్‌ వేర్‌ను ధరించాలని బహుళజాతి సంస్థలు కొత్త నియమాలను మొదలుపెడుతున్నాయి. తాజాగా ఈ విషయంలో పేరు పొందిన ఒక ప్రముఖ బహుళజాతి బీపీఓ సంస్థ ’రిలాక్సింగ్‌’ డ్రోస్‌ కోడ్‌ ఎలా ఉండాలో కూడా తమ సంస్థ సలహాదారులకు సూచించింది.

ఉదాహరణకు ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ తాజాగా ఫ్రైడే డ్రెస్సింగ్‌ విషయంలో ఉద్యోగులకు కాలర్డ్‌ టీ-షర్టులు, జీన్సులను సూచించింది. మహిళా ఉద్యోగులకు పరిమిత కొల తలతో సౌకర్యవంతంగా ఉండే స్కర్టులను వేసుకోవాలని నియ మాలను ప్రకటించింది. ఉద్యోగులకు ఫ్రైడే డ్రెస్సింగ్‌ విషయం లో అధిక స్వేచ్ఛనిస్తే పూర్తిగా భిన్నమైన వాతావరణం కార్యల యాలలో కనిపిస్తుందని, ఈ ప్రత్యేకమైన డ్రెస్సింగ్‌ నియమాలను తీసుకువచ్చింది. వన్‌-లైనర్‌లు గల టీ-షర్టులు, అది కూడా ‘మేక్‌ లవ్‌, నాట్‌ వార్‌’ లాంటి పదజాలంతో ఉండే టీ-షర్టులను అసలు అనుమతించడం లేదు. ఈ వరుసలో సాండల్‌ చెప్పులు కూడా వేసుకోరాదని నియమాలు పెడుతున్నాయి. ఈ కొత్త నియ మాలపై ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

కొంత మందికి ఇది పూర్తిగా సౌకర్యవంతమైనవిగా అనిపిస్తున్నాయి. వారాంతపు రోజుల్లో శుక్రవారంలో తమకు ఎలాంటి తేడా కనిపించదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముదురు రంగు డ్రెస్సులు, హాఫ్‌ స్లీవ్‌ టీ-షర్టులు తప్ప ఏ విధమైన తేడా ఈ రోజు ఉండదని బెంగళూరుకు చెందిన ఈ-గెస్టాల్ట్‌ టెక్నాలజీస్‌ సంస్థ, సీఈఓ ముకుంద్‌ సురాంగ్‌ అంటున్నారు. దేశీయంగా చాలా కార్పొరేట్‌ సంస్థలు ఫ్రైడే డ్రెస్సింగ్‌ విషయంలో ఇదే విధమైన నియమాల సరళిని అనుసరిస్తున్నాయని తెలిపారు.
మహిళలు వారంలో ఏ రోజునైనా కోల్హాపురీ చెప్పులు, కుర్తా పైజామాలు వేసుకురావచ్చని, అయితే మగవారికి మాత్రం ఇందుకు పూర్తి భిన్న పరిస్థితులు కార్పొరేట్‌ శాఖల్లో ఉన్నాయని యూఎస్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఉద్యోగి అర్జున్‌ మెహ్రా అంటున్నారు. మగవారు ఎలాంటి రోజుల్లోనైనా పూర్తిగా కప్పిఉన్న షూస్‌ వేసుకోవాల్సిందేనని తెలిపారు. యాక్సెసరీస్‌ విషయంలో కూడా ఆడ,మగ ఉద్యోగులకు చాలా నియమాలు పెడుతున్నారని అన్నారు.

మహిళా ఉద్యోగులు ఎలాంటి యాక్సెసరీసైనా ధరించవచ్చని, తమకు మాత్రం ఒక్క టీ-షర్ట్‌, కఫ్‌-ఫ్లింక్స్‌, టైస్‌ మాత్రమే ప్రత్యామ్నాయమని అంటున్నారు. ఇలాంటి సన్నివేషాలు ఇప్పుడు కార్పొరేట్‌ బహుళజాతి సంస్థల్లో సర్వసాధారణం అయిపోయాయి. శుక్రవారం కూడా సేవల్లో భాగంగా క్లయింట్లను కలవాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు త్పనిసరి అని సంస్థలు సమర్థించుకుంటున్నాయి. మరి కొన్ని సంస్థల్లో అయితే ఫ్రైడే డ్రెస్సింగ్‌ కోడ్‌ అసలు లేకుండా కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఐటీ, ఆర్థిక సేవలు వంటి రంగాల్లో సంస్థలు ఫ్రైడే డ్రెస్‌ కోడ్‌ను ప్రవేశపెట్టినా ఫార్మా రంగ సంస్థల్లో ఇలాంటి నియమాలు తమకు కనిపించవని ఈ రంగ ఉద్యోగులు అంటున్నారు. పనివేళల్లో తప్పనిసరిగా డ్రెస్‌ కోడ్‌లో టై ఉండాల్సిందేనని చెబుతున్నారు.