Wednesday, May 12, 2010

గాడితప్పిన బడ్జెట్‌


ఒడిదుడుకుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
పాత బకాయిలకే పెద్ద మొత్తం
సర్దుబాట్లతో నెట్టుకొస్తున్న ఆర్థికశాఖ
నిధుల విడుదలకు ఆంక్షలు
రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు!
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్ర బడ్జెట్‌ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. బడ్జెట్‌లో వివిధ శాఖలకు పొందుపర్చిన నిధులను ఆర్థిక శాఖ ధైర్యంగా ఇవ్వలేకపోతోంది. ఏ ఆరు నెలలు గడిచాకో నిధుల కోసం వెంపర్లాడాల్సిన శాఖలు ఈసారి ప్రారంభంలోనే అటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 2009-10 బడ్జెట్‌కి సంబంధించిన నిధులను కూడా కొన్ని శాఖలకు ప్రస్తుత బడ్జెట్‌ నుంచే తప్పని సరిగా ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ఆర్థిక శాఖ సర్దుబాట్ల బాట పట్టింది. తమకు రావాల్సిన చెల్లింపుల కోసం విద్యార్థులు, పెట్టుబడి రాయితీ కోసం రైతులు రహదారులపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ 2010-11 బడ్జెట్‌ను రూ.1.13 లక్షల కోట్లతో ప్రభుత్వం రూపొందించింది. కొత్త వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగులకు జీతాలు పెరగటం, బియ్యం సబ్సిడీ, విద్యుత్తు రాయితీ భారీగా ఉండటం వంటి కారణాల వల్ల ప్రణాళికేతర వ్యయం వాటా ఎగబాకింది. ప్రణాళికేతర ఖర్చులకు రూ.73,347 కోట్లు, ప్రణాళిక ఖర్చులకు రూ.40,313 కోట్లను పొందుపర్చారు. ఈ భారీ బడ్జెట్‌ ఆదిలోనే ఆపసోపాలు పడుతోంది. కేటాయించిన నిధులను ఏ త్రైమాసికంలో ఏ మేరకు ఇచ్చేది వివరించే ఉత్తర్వును జారీచేయటానికే ఈసారి ఆర్థిక శాఖ నెల రోజులకుపైగా వ్యవధి తీసుకొంది. అంటే అంతవరకు ఏ రంగానికీ నిధులు అందలేదు. ఎట్టకేలకు వివిధ నిబంధనలతో ఉత్తర్వులు జారీచేసినా నిధులపై ఆర్థికశాఖ నియంత్రణ కొనసాగుతూనే ఉంది.

ఎందుకిలా? : బడ్జెట్‌ ఆదిలోనే ఇబ్బందుల పాలవ్వటానికి పలు కారణాలు ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్‌ను కూడా ఇప్పుడు నడపాల్సిరావడం వాటిలో ప్రధానమైంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గత ఏడాది తొలుత తయారు చేసిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌, ఆ తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌లోనూ వివిధ రంగాలకు కేటాయింపులు పెంచారు. పలు జనాకర్షక పథకాలకు అందులో చోటు కల్పించారు. వాటి రాయితీల కు ఎక్కువ మొత్తాలు పొందుపర్చారు. ఆర్థిక మాంద్యం కారణంగా లక్ష్యాల మేరకు రాబడి లేకపోవటంతో ఆ బడ్జెట్‌ భారీ కోతలకు గురైంది. అయితే కొన్ని రంగాలకు కోతలు వేసినప్పటికీ కొత్త బడ్జెట్‌ నుంచి నిధులను తప్పక ఇవ్వాల్సి వస్తోంది. అటువంటి వాటిలో ఇంజినీరింగ్‌ విభాగాలు ముఖ్యమైనవి. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన గుత్తేదార్లకు ఇప్పుడు రూ. మూడు వేల కోట్లపైగా చెల్లించాల్సి ఉంది. రహదారులు, భవనాల శాఖ, పంచాయితీరాజ్‌, గ్రామీణ మంచినీటి సరఫరా వంటి శాఖలకు రూ.వెయ్యి కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. ఇవి కాక విద్యార్థులకు ఫీజుల చెల్లింపు, ఉపకార వేతనాలు తదితరాలకు సబంధించిన గత ఏడాది బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఫీజుల చెల్లింపు కింద గత ఏడాది బకాయిలు దాదాపు రూ.1,600 కోట్లు. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పద్దు కింద రూ.2,300 కోట్లు పొందుపర్చినప్పటికీ దాని నుంచే గత ఏడాది బకాయిలను చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఈ ఏడాది చెల్లింపులకు కోత తప్పేట్లు లేదు. విపత్తుల్లో దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ రూపేణా రూ. 325 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ప్రస్తుత బడ్జెట్‌ నుంచే విడుదల చేశారు. కొత్త పీఆర్‌సీకి అనుగుణంగా ఉద్యోగులకు, పింఛను దారులకు ఫిబ్రవరి నుంచి బకాయిలను అందజేయాల్సి ఉంది.

కీలక సమయంలో కేంద్రం దెబ్బ
రాబడులు తగ్గిపోయి రాష్ట్రం కష్టాల్లో ఉన్న సమయంలోనే కేంద్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినట్టు ఆర్థిక శాఖ వాపోతోంది. ద్రవ్య బాధ్యత బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టానికి అనుగుణంగా ద్రవ్యలోటును సాధించినందుకు ప్రోత్సాహకంగా రాష్ట్రానికి రెండేళ్ల వ్యవధిలో ఇచ్చిన రూ.1,406 కోట్లను కేంద్రం వెనక్కి తీసేసుకొంది. అందుబాటులో గల నిధులను వివిధ శాఖలకు సర్దుబాటు చేస్తూ ఆర్థిక సంవత్సరాన్ని గట్టెక్కించాల్సిన మార్చి నెలలోనే కేంద్రం ఇలా వ్యవహరించటంతో రాష్ట్రం మరింత ఇబ్బందుల పాలయ్యింది. దీంతో ఆ మేరకు వివిధ శాఖలకు మార్చిలో కోతలు వేయక తప్పలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)ని వాస్తవం కంటే ఎక్కువగా అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్యలోటును లెక్కగట్టిందనేది కేంద్రం అభియోగం. ఇలా చేసినందుకే ప్రోత్సాహక మొత్తాన్ని వెనక్కి తీసేసుకొంది. ద్రవ్యలోటును లెక్కగటట్టంలో తామేమీ పొరపాటు చేయలేదని, అందువల్ల వెనక్కి తీసుకొన్న మొత్తాన్ని తిరిగి అందజేయాలని ఆర్థిక శాఖ అధికారులు స్వయంగా ఢిల్లీకి వెళ్లి వివరణ ఇచ్చినా కేంద్రం వినలేదు. ముఖ్యమంత్రి రోశయ్య లేఖ రాసినా ఫలితం లేకపోయింది. వరద సహాయక మొత్తంగా రూ. వెయ్యి కోట్లు ఇస్తామంటూ చెప్పి చివరికి దాన్నీ రూ. 650 కోట్లతో సరిపెట్టింది.

ఆచితూచి నిధుల విడుదల
ఈ ఏడాది రాబడులు ఎలా ఉంటాయో ఇంకా స్పష్టత ఏర్పడలేదు. మరో వైపు ఆర్థిక పరిస్థితి సంక్లిష్లంగా మారింది. దీంతో నిధుల విడుదలకు ఆర్థిక శాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆయా శాఖలకు సొమ్ము ఏ మాత్రం అవసరమనేది సమగ్రంగా అంచనావేశాకే నిధుల మంజూరు ఉత్తర్వులు ఇస్తోంది. ప్రణాళికేతరంలోని కొన్ని పద్దులకు ఇప్పటికే ఆంక్షలు తెచ్చింది. ప్రణాళిక పద్దుల్లోని మొత్తాలను త్రైమాసికానికి మొత్తం బడ్జెట్‌లో 25 శాతం చొప్పున ఇస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ వాటికీ కొన్ని నిబంధనలు విధించింది.