Saturday, May 29, 2010

ఎయిరిండియా సిబ్బంది మెరుపు సమ్మె

18 విమానాలు రద్దు
పలు సర్వీసులు ఆలస్యం
పరిస్థితిని సమీక్షించిన ప్రఫుల్‌
న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై: ఆలస్యంగా జీతాలు చెల్లించడాన్ని నిరసిస్తూ ఎయిరిండియాలో పనిచేస్తున్న ఇంజినీర్లు సహా ఓ విభాగం ఉద్యోగులు మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు. మొత్తం 16,000 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 7 అంతర్జాతీయ సర్వీసులు సహా మొత్తం 18 విమానాలు రద్దయ్యాయి. పలు సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. వీటిలో చాలామటుకు గంటకుపైగా ఆలస్యంగా తిరిగాయి. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఇంజినీర్లు, గ్రౌండ్‌ సిబ్బంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో ఢిల్లీ నుంచి జోర్డాన్‌, అబుదాబీ, దుబాయ్‌ (రెండు సర్వీసులు), అమృత్‌సర్‌ నుంచి లండన్‌, చెన్నై నుంచి కొలంబో, సింగపూర్‌ వెళ్లే సర్వీసులు రద్దయ్యాయి. కోల్‌కతా, ముంబయి, హైదరాబాద్‌, చెన్నైల నుంచి తిరిగే పలు దేశీయ సర్వీసులు కూడా రద్దయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి సమ్మె సెగ తాకింది. ఆయన ప్రయాణించాల్సిన కోయంబత్తూరు-చెన్నై విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. పౌరవిమానయాన మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ మంగళవారం ఢిల్లీలో ఎయిరిండియా సీఎండీ అరవింద్‌ జాధవ్‌తో అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సమ్మె నేపథ్యంలో బుధవారం నుంచి కార్యకలాపాలను తగ్గించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వివరించాయి. ఎయిర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల సంఘాన్ని చర్చలకు ఆహ్వానించినట్లు ఓ అధికారి వెల్లడించారు. అయితే, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి జేబీ కాడియన్‌ మాత్రం యాజమాన్యం నుంచి తమకెలాంటి ఆహ్వానం అందలేదని మంగళవారం సాయంత్రం విలేకర్లకు తెలిపారు. ''జీతాల చెల్లింపుల్లో ఆలస్యాన్ని నిరసిస్తూ, సిబ్బంది ఇబ్బందులను తెలియజేసేందుకే మేం సమ్మెకు దిగాం. మా డిమాండ్లపై యాజమాన్యం దృష్టిపెట్టకపోవడంతోనే ఈ చర్యకు పూనుకున్నాం'' అని ఆయన స్పష్టం చేశారు. ఎయిరిండియాలోని అన్ని సంఘాల నేతలపై యాజమాన్యం 'కట్టడిచేస్తూ ఉత్తర్వు' (గ్యాగ్‌ ఆర్డర్‌) జారీచేసిందని, తమ సమస్యల విషయమై మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని ఆదేశించిందని కాడియన్‌ వివరించారు. ఇది 'అప్రజాస్వామికం' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వుని ఉపసంహరించే వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సంఘం నేతలు స్పష్టం చేశారు. మే నెల జీతాలను ఓ వారం ఆలస్యంగా చెల్లించాలని ఎయిరిండియా ఇటీవల నిర్ణయించింది. ఎయిరిండియా ఉద్యోగుల సంఘం అంతర్జాతీయ విభాగం మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమ్మెకు దిగలేదు. ఎయిర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల సంఘంతోపాటు అఖిల భారత విమాన ఇంజినీర్ల సంఘం కూడా సమ్మెలో పాల్గొంది.

విధుల్లో చేరండి: యాజమాన్యం
158 ప్రయాణికులను పొట్టనపెట్టుకున్న మంగళూరు విమాన ప్రమాద విషాదం నుంచి తేరుకోని ప్రస్తుత విపత్కర పరిస్థితిలో సమ్మెకు దిగడం సరికాదని ఎయిరిండియా యాజమాన్యం వ్యాఖ్యానించింది. సిబ్బంది తక్షణం విధుల్లో చేరాలని అభ్యర్థించింది.ఈ మేరకు ఎయిరిండియా యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విమాన సర్వీసులను రద్దుచేసినట్లు, ఆలస్యంగా నడుపుతున్నట్లు అంగీకరించింది. విమాన సర్వీసుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. సమ్మె కారణంగా ఇబ్బందిపడ్డ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.