Thursday, May 13, 2010

కాకినాడ లంగరు రేవు ఫలితాలు నిరాశాజనకం

రూ.5.59 కోట్లు తగ్గిన ఆదాయం
సరకు రవాణా 8.19 లక్షల టన్నులే
కాకినాడ - న్యూస్‌టుడే
కాకినాడ లంగరు రేవు (యాంకరేజి పోర్టు) పరిస్థితి తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం 2009-10లో మరింత దిగజారింది. అంత క్రితం 2008-09తో పోల్చితే గత మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రేవు సాధించిన ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్న ఈ పాత రేవుకు, ప్రయివేటు సంస్థ కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌పీఎల్‌) ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో నిర్వహిస్తున్న డీప్‌వాటర్‌ పోర్టుకు సరుకు రవాణాలో, ఆదాయ సాధనలో బోలెడంత తేడా ఉంటోంది. ఈ రెంటినీ సమాంతరంగా నడపాలన్న ప్రభుత్వ యోచన తప్పు అని ఏటికేడాది వాణిజ్యంలో దిగజారిపోతున్న లంగరు రేవు పరిస్థితి రుజువు చేస్తున్నప్పటికీ, లంగరు రేవు ఉద్ధరణకు ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. దీంతో ఈ రేవునే నమ్ముకొని జీవిస్తున్న సుమారు 10,000మందికి పైగా కార్మికుల బతుకులు చుక్కాని లేని నావలా మారాయి.

ఎగుమతి- దిగుమతులు సన్నగిల్లాయ్‌
ఎప్పుడూ భారీ స్థాయిలో ఆదాయాన్ని తెచ్చి పెట్టే మొక్కజొన్న ఎగుమతులు, ఎరువుల దిగుమతులు బాగా తగ్గడంతో లంగరు రేవు భారీగా నష్టపోయింది. గత ఏడాదిలో 7.48 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉన్న మొక్కజొన్న ఎగుమతులు దాదాపు 4 లక్షల మెట్రిక్‌ టన్నులకు పరిమితం అయ్యాయి. అప్పట్లో 7.20 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉన్న ఎరువుల దిగుమతులు ఈసారి కేవలం 80 వేల మెట్రిక్‌ టన్నుల మేరకు జరగడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇంకో వైపు బియ్యం ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడం రేవు వాణిజ్యాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 14.46 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా జరగ్గా, దిగుమతులు 7.46 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా జరగటంతో మొత్తం మీద 21.92 లక్షల మెట్రిక్‌ టన్నుల కార్గోను సాధించారు. కానీ గత ఆర్థిక సంవత్సరం 2009-10లో మొత్తం ఎగుమతులు 5.29 లక్షల మెట్రిక్‌ టన్నులు, దిగుమతులు 2.89 లక్షల మెట్రిక్‌ టన్నులు కలిపి మొత్తం 8.19 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సాధించగలిగింది. అంటే కార్గో పరంగా చూస్తే.. దాదాపు 13.73 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా తక్కువ నమోదైంది. ఆదాయం పరంగా చూస్తే 2008-09లో మొత్తం మీద రూ.16.89 కోట్లు ఆదాయం రాగా, 2009-10లో రూ.11.30 కోట్లు మాత్రమే.

'ప్రభుత్వానికి నివేదిక పంపాం'
లంగరు రేవు స్థితిగతులపై ప్రభుత్వానికి తాజాగా నివేదించినట్లు రేవు ఇన్‌ఛార్జి 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ప్రయివేటు పోర్టు కోటి టన్నుల కార్గో మైలురాయిని దాటి అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే, ప్రభుత్వ నిర్వహణలో ఉన్న లంగరు రేవు హీనంగా 8.19 లక్షల మెట్రిక్‌ టన్నుల కార్గోను మాత్రమే సాధించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లంగరు రేవును రక్షించే చర్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించకపోతే ఇకమీదట రేవు పూర్తిగా మూతపడటం ఖాయమని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.