Saturday, May 29, 2010

సంకటంలో వెంకటగిరి చీర

మూతపడుతున్న తయారీ కేంద్రాలు
నాలుగో వంతుకు పడిపోయిన వ్యాపారం
ముడిసరకుల ధర పెరగడం వల్లే
వెంకటగిరి - న్యూస్‌టుడే
మగువల మనసుదోచిన వెంకటగిరి నూలు చీరలకు గడ్డుకాలం వచ్చినట్లుంది.. ముడిసరకుల ధరలు పెరగడం వల్ల రెండున్నర దశాబ్దాలుగా విరాజిల్లుతూ వస్తున్న ఈ వ్యాపారం సంక్షోభంలో చిక్కుకుంది. ఫలితంగా చీరల ప్రింటింగ్‌ యూనిట్లు మూతపడుతున్నాయి.
వేసవిలో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాలకే కాకుండా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా ఎగుమతయ్యే వెంకటగిరి చీరల ఉత్పత్తి ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. వారానికి 25 వేల నుంచి 30 వేల చీరలు ఉత్పత్తయ్యే ఈ పట్టణంలో ప్రస్తుతం నాలుగైదు వేల చీరలకు మించి తయారవడం లేదు. పెరిగిన ధరల కారణంగా మార్కెట్లో ఉన్న పోటీని ఈ చీరలు తట్టుకోలేకపోతున్నాయి. హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి ఏటా వేసవిలో వచ్చే భారీ ఆర్డర్లు ఇప్పుడు నామమాత్రమయ్యాయి. ఈ సంక్షోభం కొనసాగితే పరిశ్రమ మనుగడ కష్టమని ఉత్పత్తిదారులు భావిస్తున్నారు.

నాడు చౌక: హోల్‌సేల్‌ వ్యాపారులకు వెంకటగిరి ఉత్పత్తిదారుల నుంచి గతంలో ఒక్కో చీర రూ.82కే లభించేది. దీంతో వినియోగదారులకు రూ.100లోపు ధరకే వచ్చేది. అందువల్ల వేసవిలో మహిళలు ఈ కాటన్‌ ప్రింటింగ్‌ చీరలను రోజువారీ వినియోగానికి భారీగానే కొనుగోలు చేసేవారు. టై అండ్‌ డై, చుట్టి చంగావి రకాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ చీరలు మార్కెట్లో హాట్‌కేక్‌లుగా అమ్ముడుపోయేవి.

పెరిగిన ముడిసరకుల ధరలు: ఈ చీర తయారీకి మనరాష్ట్రంలోని వస్తువులు, తమిళనాడులోని ఈరోడ్‌ తదితర ప్రాంతాల మిల్లుల నుంచి తెల్లచీర తెప్పిస్తారు. ఈ చీరలకు రంగులద్ది వెంకటగిరి నుంచి మార్కెట్లోకి విడుదలచేస్తారు. ఈ తెల్లచీర ధర రూ.55గా ఉండేది. నేడు ఈ ధర రూ. 70కు చేరింది. గంజిపిండి 8 కిలోల సంచి రూ.120 నుంచి రూ.330కి పెరిగింది. ఇస్త్రీ ఛార్జీలు, కూలీలు, డైయింగ్‌ ఖర్చులు రెట్టింపయ్యాయి. చివరికి రంగులు, రసాయనాల ధరలు కూడా 30శాతం పెరిగాయి. దీంతో ఇప్పుడు హోల్‌సేల్‌ వ్యాపారులకే ఇక్కడి తయారీదారులు ఒక చీరను రూ. 100 వంతున అమ్మాల్సి వస్తోంది.హైదరాబాదు, ఇంకా ఇతర ప్రాంతాల్లో తయారయ్యేకాటన్‌ చీరలతో వెంకటగిరి ప్రింటింగ్‌ చీర పోటీపడలేక వెనుకబడుతోంది. హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి ఆర్డర్లు పెద్దగా రావడం లేదు. ఫలితంగా ఉత్పత్తిదారుడు ఈ చీరల తయారీని తగ్గించేశారు. వెంకటగిరిలో 40కుపైగా ఈ చీరల తయారీ యూనిట్లు ఉండగా, వారానికి 25 వేల నుంచి 30 వేల చీరలు తయారయ్యేవి. ఇప్పుడది నాలుగైదు వేలకు పడిపోయింది. ఈ పట్టణంలో మొత్తం 40 తయారీ యూనిట్లు ఉండగా అందులో ప్రస్తుతం పది మాత్రమే నడుస్తున్నాయి.

రూ.కోటి నుంచి రూ.25 లక్షలకు పతనం: సీజన్‌లో ఏటా మార్చి నుంచి నెలకు రూ.కోటి విలువైన వ్యాపారం జరిగే వెంకటగిరిలో నేడు రూ.25 లక్షల వ్యాపారం కూడా జరగడం లేదు. దీంతో ప్రత్యక్షంగా1,500 మంది పరోక్షంగా మరో 1,000 మంది భవిత అగమ్యగోచరంలా మారింది. మొత్తం మీద ఈ ఆరునెలల్లో కనీసం రూ.5 కోట్లకుపైగా జరగాల్సిన వ్యాపారం సంక్షోభంలో పడినట్లయింది.

ప్రత్యామ్నాయం తప్పదు
రాబోయే రోజుల్లో ఈ వ్యాపారంలో కొనసాగాలా లేక ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించాలా అనేది ఆలోచిస్తున్నాం. 20 శాతం చీరలు కూడా తయారు చేయడం లేదు. మొత్తంమీద రెండున్నర దశాబ్దాలుగా వెంకటగిరిలో కుటీర పరిశ్రమగా వర్థిల్లి, ఎందరో మహిళలకు కూడా ఉపాధినివ్వడంతోపాటు సరసమైన ధరలకు కాటన్‌ ప్రింటింగ్‌ చీరలను అందిస్తున్న ఈ పరిశ్రమ పరిస్థితి కలవరపరుస్తోంది.
-యాళ్ల కాంతారావు, ప్రముఖ వ్యాపారి