Tuesday, May 11, 2010

మత్తెక్కించి వసూలు!

వూరూరా మద్యం ప్రవాహం!
రూ.15వేల కోట్ల విక్రయాలకు రంగం సిద్ధం
ప్రారంభ వేలం ధర పెంపుతో జరిగేదిదే
యువత దారి తప్పే ప్రమాదం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ''అందరి చేతా తాగుబోతులుగా ముద్రపడిన మేం పన్ను చెల్లింపుదారులం... రాష్ట్రంలో అమలవుతున్న రూ. 2 కిలో బియ్యం, వివిధ పథకాలకు కచ్చితంగా పన్నులు చెల్లిస్తోంది మేమే...'' ఇది ఒక చిత్రంలోని డైలాగ్‌. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి ఇది దర్పణం పడుతోంది. ఈ చేత్తో సంక్షేమానికి ఖర్చు పెట్టినట్లే చూపించి ఆ చేత్తో మద్యం విక్రయాల ద్వారా అదంతా రాబట్టుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు రూ.15వేల కోట్ల విలువ చేసే మద్యాన్ని విక్రయించడానికి రంగం సిద్ధమవుతోంది. ఆదాయం తగ్గుతోందని భావిస్తే చాలు ఎక్సైజ్‌శాఖ వైపు చూస్తున్న ప్రభుత్వం రానున్న రోజుల్లో తాగేందుకు నీరు లభించకున్నా మద్యం మాత్రం అందుబాటులో ఉండేలా చూస్తోంది. జూన్‌లో నిర్వహించబోయే మద్యం దుకాణాల వేలంపాటల్లో లైసెన్సు ఫీజులను భారీగా పెంచడం ద్వారా విచ్చలవిడిగా మద్యాన్ని విక్రయించడానికి ఉసిగొల్పుతోంది.
2006-08లో నిర్వహించిన మద్యం దుకాణాల వేలం పాటలో రూ.1647.70 కోట్లు ఆదాయం రాగా 2008-10 ఆర్థిక సంవత్సరానికి రూ. 3182.04 కోట్లు వచ్చింది. తాజాగా ప్రస్తుతం ఉన్న లైసెన్సు ఫీజుపై మరో 15 శాతం ధరను ప్రారంభ వేలం (అప్‌సెట్‌) ధరగా నిర్ణయించి వేలం పాటకు సన్నద్ధమవుతోంది. ఫలితంగా రెండేళ్ల కాలంలో రూ. 4వేల కోట్ల మేరకు ఆదాయం వస్తుందని అంచనా. అంటే ఏడాదికి దుకాణదారులు కేవలం లైసెన్సు ఫీజు ద్వారా రూ. 2వేల కోట్లు చెల్లించాలి. దీన్ని రాబట్టుకునేందుకే విక్రయాలపై నెలకు రూ. 167 కోట్ల మేర లాభాలు ఆర్జించాలి. ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే విక్రయాలపై రాబడి కనీసం రూ. 200 కోట్ల వరకూ ఉండాలి. ఈ మాత్రం రాబడి రావాలంటే నెలకు దాదాపు రూ.1240 కోట్ల మద్యాన్ని విక్రయించాలి. దీన్నిబట్టి ఖర్చులు పోనూ ఆదాయం మిగుల్చుకోవడానికి ఎంత మేర విక్రయిస్తారో అర్థం చేసుకోవచ్చు.

తాజా లైసెన్సు ఫీజుల ఫలితంగా గ్రామ గ్రామాన మద్యం దుకాణాలు వెలిసి అక్కడి యువత మద్యానికి బానిసయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.20 లక్షల వరకూ బెల్టు దుకాణాలు ఉన్నట్లు అంచనా. ఇవి మరింతగా విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇండియా ఆల్కహాల్‌ పాలసీ అలయెన్స్‌, ఆల్కహాల్‌ అండ్‌ డ్రగ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెంటర్‌ (ఏడీఐసీ) అనే స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా ఒక సర్వే ప్రకారం మద్యపానం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటి. సర్వేలోని ముఖ్యాంశాలు.

* దేశవ్యాప్తంగా మద్యం ప్రియులు 12-20 శాతం మంది
* నిత్యం సేవించేవారు 6-10 శాతం
* దేశంలో సగటున ఒక పౌరుడు సేవించే మద్యం ఏడాదికి 2 లీటర్లు
* ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే కేరళ, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, గోవా రాష్ట్రాల్లో మద్యపానం అధికం.
* మద్యపానాన్ని మొదలుపెట్టేవారి వయస్సు గతంలో 30ఏళ్లు కాగా ఇప్పుడు 19 ఏళ్లు. కేరళలో ఇప్పుడు అది 14 ఏళ్ల వయసుకు చేరుకుంది.
* మద్యం సేవించే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.
* ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, గాయాలపాలవడం, నేరాలు, ఆత్మహత్యలు, కుటుంబ కలహాలు, గృహ హింస, విడాకులు, పనిచేసే ప్రదేశాల్లో సమస్యలు పెరుగుతున్నాయి.
* 95 శాతం మంది మహిళలు మద్యపానాన్ని వ్యతిరేకిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి 2009-10 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా రూ. 6,200 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.7,500 కోట్లు ఎక్సైజ్‌ ఆదాయంగా వస్తుందని అంచనా వేస్తోంది. అమ్మకం పన్ను, ఎక్సైజ్‌ సుంకం ద్వారా వచ్చే ఆదాయం అదనం. ఇంత ఆదాయం సమకూరాలంటే విక్రయాలు రూ. 15వేల కోట్లకు చేరుకోవాల్సి ఉంటుంది.