Wednesday, May 12, 2010

3జీ రేట్లకే 2జీ అమ్ముదాం

వేలం జోలికి పోవద్దు
అదనపు స్పెక్ట్రమ్‌కు అదనపు ఛార్జీ
కేంద్రానికి ట్రాయ్‌ పలు కీలక సిఫారసులు
న్యూఢిల్లీ: ఇకపై 2జీ స్పెక్ట్రమ్‌ (రేడియో తరంగాల)కు 3జీ రేడియో తరంగాలతో సమానంగా ధరలను నిర్ణయించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) సూచించింది. ఇదే జరిగితే గనక స్పెక్ట్రమ్‌ కోసం వేచి ఉన్న ప్రస్తుత టెలికాం కంపెనీలు మరింత ఎక్కువ సొమ్మును చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. రెండేళ్ల కిందట 2జీ స్పెక్ట్రమ్‌ను 2001 సంవత్సర ధరల వద్ద కేటాయించడంలో టెలికాం మంత్రి ఎ.రాజా పాత్రపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ట్రాయ్‌ తన సిఫారసులను వెలువరించడం గమనార్హం. ఈ సందర్భంగా ట్రాయ్‌ ఛైర్మన్‌ జె.ఎస్‌.శర్మ మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, '6.2 మెగాహెర్ట్జ్‌ (ఎంహెచ్‌జడ్‌) కన్నా మించిన స్పెక్ట్రమ్‌కంతటికీ ప్రస్తుత మార్కెట్‌ ధర (3జీ ధరతో ముడిపడిన ధర)ను జీఎస్‌ఎమ్‌ ఆపరేటర్లు చెల్లించాలి. ఇక సిడిఎంఎ ఆపరేటర్లు వారికి కాంట్రాక్టు ఇచ్చిన 5 మెగాహెర్ట్జ్‌ కన్నా మించిన స్పెక్ట్రమ్‌ కోరుకుంటే మార్కెట్‌ ధరను చెల్లించాల'న్నారు. ప్రస్తుతం మూడో తరం (3జీ) మొబైల్‌ టెలిఫోన్‌ సేవల లైసెన్సుల జారీ కోసం వేలం సాగుతోంది. దేశ వ్యాప్త బిడ్‌ ధరలు రూ.14,000 కోట్లను మించిపోయాయి. 2008లో 2జీ స్పెక్ట్రమ్‌ను విక్రయించినపుడు మొబైల్‌ లైసెన్సులను కట్టబెట్టిన రూ.1,651 కోట్లతో పోలిస్తే ఈ ధర ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. 2జీ స్పెక్ట్రమ్‌లో 4.4 ఎంహెచ్‌జడ్‌ సామర్థ్యం ఉన్న మొబైల్‌ లైసెన్సులను రూ.1,651 కోట్ల ధరకు వీడియోకాన్‌, స్వాన్‌, స్థిరాస్తి రంగ కంపెనీ యునిటెక్‌ వైర్‌లెస్‌ సహా పలు కంపెనీలకు కేటాయించాలని టెలికాం మంత్రి ఎ.రాజా నిర్ణయం తీసుకోవడం అవినీతి ఆరోపణలకు తావు ఇచ్చింది. ప్రభుత్వానికి దక్కవలసిన రూ.60,000 కోట్ల సొమ్ము దక్కకుండా కుంభకోణం చోటుచేసుకొందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం విదితమే.

కాగా 2జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేయడం ఆర్థికంగా వివేకవంతమైన చర్య కాజాలదని ట్రాయ్‌ పేర్కొంది. రెండేళ్ల క్రితం టెలికాం శాఖ తీసుకున్న నిర్ణయంతో ట్రాయ్‌ దాదాపుగా ఏకీభవిస్తూ, మొబైల్‌ స్పెక్ట్రమ్‌ బిడ్‌ల ప్రక్రియ వల్ల ఖజానాకు ఏమంత పెద్ద ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించి ఉండేవి కాదని తాజాగా పేర్కొంది. '800-900-1800 మెగాహెర్ట్జ్‌ (ఎంహెచ్‌జడ్‌) బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను వేలానికి ఉంచడం ఆచరణయోగ్యం కాదు.. ఎందుకంటే, కాంట్రాక్టులు కుదిరిన స్పెక్ట్రమ్‌ కేటాయింపు అనంతరం మిగిలే స్పెక్ట్రమ్‌ కొంచెమే; అదనపు స్పెక్ట్రమ్‌ను కోరుకొనే వారు కూడా అతి తక్కువగా ఉంటార'ని ట్రాయ్‌ ఛైర్మన్‌ జె.ఎస్‌.శర్మ అన్నారు. ట్రాయ్‌ సిఫారసులు చట్టరూపం దాల్చాలంటే వాటిని టెలికాం మంత్రిత్వ శాఖ ఆమోదించవలసి ఉంటుంది. ట్రాయ్‌ చేసిన మరికొన్ని ముఖ్య సిఫారసులు ఏమిటంటే:
* ఇక నుంచి 2జీ స్పెక్ట్రమ్‌కు ధరను 3జీ స్పెక్ట్రమ్‌ వేలంలో ఖరారయ్యే ధరకు సమానంగా (ఆన్‌ పార్‌) నిర్ణయించాలి. ఇప్పటి టెలికాం కంపెనీల లైసెన్సులు రెన్యువల్‌కు వచ్చినపుడు వాటికి స్పెక్ట్రమ్‌ను ఉచితంగా ఇవ్వకూడదు.. 3జీ ధరల ఆధారంగా మార్కెట్‌ రేటు వసూలు చేయాలి.

* అలాగే స్పెక్ట్రమ్‌ విక్రయానికి, లైసెన్స్‌ల జారీకి ఇపుడు ఉన్న లంకెను విడదీయాలి.

* నిర్దేశిత సబ్‌స్క్రైబర్ల సంఖ్యను మొబైల్‌ సంస్థలు పెంచుకున్న కొద్దీ అవి అదనపు రేడియో తరంగాలను పొందే పద్ధతికి స్వస్తి చెప్పాలని ట్రాయ్‌ అన్నది. రేడియో తరంగాలను కేటాయించిన తేదీ నుంచి మూడేళ్ల లోపు నెట్‌వర్క్‌ రోల్‌-అవుట్‌ విధులను నెరవేర్చిన తీరును బట్టే స్పెక్ట్రమ్‌ను ఇవ్వాలంది.

* జిఎస్‌ఎమ్‌ మొబైల్‌ కంపెనీలకయితే గరిష్ఠంగా 10 ఎంహెచ్‌జడ్‌, సిడిఎంఎ కంపెనీలకయితే 7 ఎంహెచ్‌జడ్‌కు మించి స్పెక్ట్రమ్‌ను ఇవ్వరాదంది.

* కనీస స్పెక్ట్రమ్‌ పరిణామాన్ని పెంచుతూ ట్రాయ్‌.. జీఎస్‌ఎమ్‌ ఆపరేటర్లు (కాంట్రాక్టు కుదిరిన మేరకు) 6.2 ఎంహెచ్‌జడ్‌ కన్నా అదనపు స్పెక్ట్రమ్‌కు, సిడిఎంఎ ఆపరేటర్లు 5 ఎంహెచ్‌జడ్‌ కన్నా మించిన స్పెక్ట్రమ్‌కు ప్రస్తుత మార్కెట్‌ ధరను చెల్లించాలంది.

* అంతే కాకుండా సర్వీస్‌ ప్రొవైడర్‌ అదనంగా వన్‌టైమ్‌ ఛార్జిని కూడా చెల్లించాలని చెప్పింది. ఈ వన్‌టైమ్‌ ఛార్జిని 8 ఎంహెచ్‌జడ్‌ వరకు స్పెక్ట్రమ్‌ ప్రస్తుత ధరను అనుసరించి, 8 ఎంహెచ్‌జడ్‌కు మించితే ప్రస్తుత ధరకు 1.3 రెట్ల వంతున చెల్లించాలంది. మార్కెట్‌లో మిగులు స్పెక్ట్రమ్‌కు వన్‌టైమ్‌ ఛార్జిల రూపంలో రూ.30,000- రూ.35,000 కోట్ల దాకా రావచ్చని ట్రాయ్‌ ఆశిస్తోంది.

* మొబైల్‌ కంపెనీల్లో వాటా (స్టేక్‌) విక్రయంపై ఆంక్షలను సడలించాలంది. ప్రస్తుతం భారతీయ టెలికాం కంపెనీలు లైసెన్సులు పొందిన ప్పటి నుంచి మొదటి మూడేళ్లలో మెజారిటీ వాటాలను విక్రయించజాలవు. కానీ ట్రాయ్‌ ఏదైనా సర్కిల్‌లో మొత్తం సబ్‌స్క్రైబర్లు, లేదా ఆదాయంలో 30 శాతం కన్నా ఎక్కువ హస్తగతం చేసుకొనేటటువంటి విలీనాల విషయంలోనే ఆంక్షలు వర్తించాలని, ఆ లోపు స్తోమత మాత్రమే ఉండే సంయుక్త సంస్థలకు ఆంక్షలు వర్తించరాదంది.విలీనాల అనంతరం ఏదైనా సర్కిల్‌లో కనీసం ఆరు ఆపరేటర్లు ఉండవచ్చంది.

వాస్తవ ధరపై అధ్యయనం చేస్తాం: శర్మ
2జీ స్పెక్ట్రమ్‌కు వాస్తవ ధరను కనుగొనడంపై అనేక అభిప్రాయాలు వెలువడుతున్నాయని, వీటిని గమనంలోకి తీసుకొని ఈ అంశంపై మరింత అధ్యయనం కోసం విడిగా ఒక కసరత్తును చేపట్టామని, అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిస్తామని ట్రాయ్‌ ఛైర్మన్‌ శర్మ చెప్పారు. అయితే ప్రస్తుతానికి 3జీ ధరలనే 2జీ స్పెక్ట్రమ్‌ తాజా ధరగా వర్తింపచేసుకోవాలని ట్రాయ్‌ సిఫారసు చేస్తోందని ఆయన అన్నారు. 6.2 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ కాంట్రాక్టును పొందగోరుతున్న, ఆ తరువాతి స్థాయి సామర్థ్యం (8 ఎంహెచ్‌జడ్‌) కోసం ఎదురుచూస్తున్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. భారత టెలికాం విపణి (ఉమ్మడి సంస్థలతో) ఏకీకృతం కావాలన్నదే మా అభిప్రాయం కూడా అని ఆయన అన్నారు.
కంపెనీలపై ప్రభావం ఎలా ఉండొచ్చంటే
భారత దేశంలో 22 టెలికాం సర్కిళ్లు ఉన్నాయి. 15 కంపెనీలు (ఆపరేటర్లు) 58.40 కోట్ల వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి.అనేక కంపెనీల లైసెన్సులు 2013తో గడువు తీరనున్నాయి. ఆపరేటర్లు (టెలికాం కంపెనీలు) 6.2 ఎంహెచ్‌జడ్‌ కన్నా ఎక్కువ స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంటే దానికి 3జీ ధరలను సమర్పించుకోవలసి వస్తుంది. భారతీ ఎయిర్‌టెల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, వొడాఫోన్‌ ఎస్సార్‌ల వంటి పలు ఆపరేటర్లకు ఇది ఒక పెద్ద దెబ్బ లాంటిది. అనేక ప్రధాన సర్కిల్స్‌లో సుమారు 10 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ ఈ మూడు బడా సంస్థల చేతిలోనే ఉంది. అవి తమ సబ్‌స్క్రైబర్‌ సంఖ్యలను ఆధారంగా చూపి పెద్ద ఎత్తున స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకొన్నాయి. ఢిల్లీ సహా ఏదైనా సర్కిల్‌లో స్పెక్ట్రమ్‌ను కొత్తగా తీసుకోగోరుతున్న టాటా, యూనినార్‌, వీడియోకాన్‌లు సహా పలు కంపెనీలకు కూడా ఇది దెబ్బే. ఇక స్పెక్ట్రమ్‌ విక్రయానికి, లైసెన్సుల జారీకి మధ్య లంకెను విడదీసే పక్షంలో ప్రతి సర్కిల్‌లో ఉండదగ్గ కంపెనీల గరిష్ఠ సంఖ్యపై పరిమితులు విధించడానికి ట్రాయ్‌ విముఖత చూపడం మాత్రం అన్ని మొబైల్‌ కంపెనీలకు సంతోషం కలిగించవచ్చు.