Saturday, May 29, 2010

విద్యుత్తుకు 'విదేశీ' వెలుగు

రూ.1100 కోట్లతో 49 శాతం వాటా కొనుగోలు చేసిన సెమ్‌కార్ప్‌
రెండుదశల్లో కృష్ణపట్నంలో 2640 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మౌలిక సదుపాయాల కంపెనీ గాయత్రీ ప్రాజెక్ట్స్‌కు చెందిన అనుబంధ విద్యుత్తు కంపెనీ థర్మల్‌ పవర్‌టెక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (టిపిసిఐఎల్‌) లో సింగపూర్‌కు చెందిన సెమ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ రూ.1100 కోట్ల పెట్టుబడితో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. విద్యుదుత్పత్తి రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించాక, ఒక ప్రాజెక్టుకు ఇంత భారీ పెట్టుబడి రావడం ఇదే ప్రధమం. ఒక సింగపూర్‌ కంపెనీ మనదేశంలో పెడుతున్న అతిపెద్ద పెట్టుబడుల్లో ఇదొకటి అవుతోంది. గాయత్రీ ఎనర్జీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సెమ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధులు టి.వి.సందీప్‌ రెడ్డి, టాన్‌ చెంగ్‌ గ్వాన్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు.

గాయత్రీ ప్రాజెక్ట్స్‌ అనుబంధ కంపెనీ గాయత్రీ ఎనర్జీ వెంచర్స్‌ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 2640 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ ధర్మల్‌ విద్యుత్క్రేందాన్ని చేపట్టింది. దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ (ఎస్‌పీవీ) యే థర్మల్‌ పవర్‌టెక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (టిపిసిఐఎల్‌). కృష్ణపట్నంలో ఏపీఐఐసీ నుంచి 1400 ఎకరాల స్థలాన్ని తీసుకుని, తొలిదశలో 1320 మెగావాట్ల ధర్మల్‌ విద్యుత్కేంద్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనికి అవసరమైన అనుమతులు రావడంతో పాటు, నిధుల సేకరణ కూడా పూర్త్తె, పనులు మొదలయ్యాయి. తొలిదశ ప్రాజెక్టులో సెమ్‌కార్ప్‌ 49 శాతం వాటాతో భాగస్వామి అయ్యింది. 40 నెలల వ్యవధిలో మొదటి దశ, ఆ తర్వాత ఏడాది వ్యవధిలో రెండో దశను పూర్తిచేస్తామని సందీప్‌రెడ్డి మంగళవారం ఇక్కడ వెల్లడించారు. మొదటి దశ ప్రాజెక్టు వ్యయం రూ. 6869 కోట్లు కాగా, ఇందులో రూ. 5151 కోట్ల అప్పు. రూ. 1718 కోట్ల మొత్తాన్ని ఈక్విటీ రూపంలో సమకూర్చుతారు. రుణ మొత్తాన్ని ఆర్‌ఇసి, పిఎఫ్‌సి, పిఎన్‌బి, ఎల్‌ఐసి, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర సంస్థలు కలిసి సంయుక్తంగా అందజేస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే విద్యుత్తులో 25 శాతం 'మర్చంట్‌ పవర్‌' కింద విక్రయిస్తామని సందీప్‌ తెలిపారు.మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో మరికొన్ని విద్యుత్తు ప్రాజెక్టులు చేపట్టే యోచన గాయత్రీ గ్రూపునకు ఉన్నట్లు సందీప్‌రెడ్డి తెలిపారు. గాయత్రీ ఎనర్జీ వెంచర్స్‌ కిందే వీటిని చేపట్టాలని లేదని ఆయన చెప్పారు. కృష్ణపట్నం పవర్‌ ప్రాజెక్టు రెండో దశకు ఇంథన సరఫరా కోసం దరఖాస్తు చేసినట్లు, ఒక ఏడాది వ్యవధిలో అనుమతి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఓ అండ్‌ ఎం కంపెనీ: కృష్ణపట్నం విద్యుత్తు ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రత్యేక ఓ అండ్‌ ఎం కంపెనీని గాయత్రీ ఎనర్జీ వెంచర్స్‌, సెమ్‌కార్ప్‌ సంయుక్తంగా నెలకొల్పుతున్నాయి. ఇందులో 70 శాతం వాటా సెమ్‌కార్ప్‌నకు, 30 శాతం గాయత్రీ ఎనర్జీ వెంచర్స్‌కు ఉంటాయి. విద్యుత్తు ప్రాజెక్టుల నిర్వహణలో సెమ్‌కార్ప్‌కు అనుభవం ఉన్న దృష్ట్యా ఓ అండ్‌ ఎం కంపెనీలో ఆ కంపెనీ ఎక్కువ వాటా తీసుకున్నట్లు సందీప్‌రెడ్డి వివరించారు.

నూరుశాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం
మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే
విద్యుదుత్పత్తి రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశమున్నా ఎవరూ ముందుకు రావడంలేదని, మరింతగా ప్రయత్నించాలని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగిన టీపీసీఐఎల్‌, సెమ్‌కార్ప్‌ ఒప్పంద కార్యక్రమంలో షిండే మాట్లాడారు. పదో పంచవర్ష ప్రణాళిక లక్ష్యమైన 42వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిలో 21 వేల మెగావాట్లే సాధించగలిగామని పేర్కొన్నారు. 11వ పంచవర్ష ప్రణాళికలో 78,700 మెగావాట్ల సాధన లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్‌ వనరులున్నందున, ఇక్కడి వారే విద్యుత్తు ప్రాజెక్టుల స్థాపనపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే అల్ట్రా మెగా విద్యుత్తు ప్రాజెక్టును రూ.16వేల కోట్లతో నిర్మిస్తారని వెల్లడించారు.
త్వరితగతిన అనుమతులు ఇప్పించండి
రోశయ్య
రాష్ట్రంలో చేపట్టే విద్యుత్తు ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని షిండేకు ముఖ్యమంత్రి రోశయ్య విజ్ఞప్తి చేశారు. గ్యాస్‌, బొగ్గు కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ ఎంతో అనువైన రాష్ట్రమని సెమ్‌కార్ప్‌ ఛైర్మన్‌, సీఈవో టాంగ్‌కిన్‌ అభివర్ణించారు. కార్యక్రమానికి గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ఛైర్మన్‌, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి అధ్యక్షత వహించారు. జీవీకే సంస్థల ఛైర్మన్‌ జీవీ కృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్‌ ఆదికేశవులు నాయుడు, ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.