Saturday, May 8, 2010

18,000 దాటిన పసిడి

న్యూఢిల్లీ: పసిడి ధర శుక్రవారం మరింతగా ఎగబాకి 10 గ్రాములు రూ.18,000 స్థాయిని మించింది. దేశ రాజధాని నగరంలో స్టాండర్డ్‌ బంగారంతో పాటు ఆభరణాల బంగారం కూడా చెరి రూ.495 ఎగసి వరుసగా రూ.18,110, రూ.17,960 పలకడం విశేషం. 2009 నవంబరు 26 తరువాత ఈ స్థాయికి స్వర్ణం చేరడం మళ్లీ ఇదే. విదేశీ మార్కెట్‌లలో బంగారం కొనుగోళ్లు జోరుమీద ఉండడం ఈ పరిణామానికి దారి తీసింది. వెండి సైతం కిలోకు రూ.565 పెరిగి, రూ.28,165ను తాకింది. పరిశ్రమలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు ముందుకు రావడంతో వెండికి గిరాకీ హెచ్చింది. విదేశాల్లో షేర్ల లావాదేవీలు సన్నగిల్లి, కరెన్సీలు బలహీనం కావడంతో ప్రత్యామ్నాయంగా బంగారు కొనుగోళ్లు జోరు అందుకొన్నట్లు మార్కెట్‌ వర్గాలు విశ్లేషించాయి.

ముంబయిలోనూ..: వరుసగా రెండో రోజూ స్థానిక బులియన్‌ మార్కెట్‌లో పుత్తడి ధర పెరిగింది. 10 గ్రాముల స్టాండర్డ్‌ మింట్‌ గురువారం ముగింపుతో పోలిస్తే రూ.375 అధికంగా రూ.17,845 పలికింది. శుద్ధమైన బంగారం రూ.17,930 పలికింది. వెండి కూడా కిలోకు రూ.135 ఎక్కువగా రూ.28,400 ధర పలికినట్లు బొంబాయి బులియన్‌ అసోసియేషన్‌ తెలిపింది.