పెట్టుబడులకు తగిన వాతావరణం కల్పిస్తాం
దక్షిణాది ఆటో షో ప్రారంభోత్సవంలో రోశయ్య
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగానికి పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. ఆటోమోటివ్ ఉత్పత్తులు, తయారీ సంస్థలను ప్రోత్సహించేందుకు ఏపీఐఐసీ తూప్రాన్, చేవెళ్ల, నెల్లూరు జిల్లా నాయుడుపేటలలో ప్రత్యేక ఆటోమోటివ్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడి మాదాపూర్‌లోని హైటెక్స్‌లో 'ఆటోషో సౌత్ 2010' ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు రంగారెడ్డి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాలను సందర్శించాల్సిందిగా సూచించారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఆటోమొబైల్ షోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది నుంచి జాతీయ స్థాయి ప్రదర్శన ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆటోమొబైల్ రంగానిది కీలక పాత్ర అని, దక్షిణాసియాలోనే భారత్ మంచి గుర్తింపు సాధించిందన్నారు. 2009-10 సంవత్సరానికి ఈ పరిశ్రమలో 26 శాతం విక్రయాలు పెరిగాయన్నారు. ఈ అభివృద్ధిని కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2006-16 పేరిట ప్రణాళిక రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం అనుకూలమైన వాతావరణం కల్పిస్తుందని రోశయ్య అన్నారు. సంస్కరణల అమలులో ఆంధ్ర ప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందని ప్రపంచ బ్యాంకు ఇటీవల ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. 2014 నాటికి మన రాష్ట్రం దేశానికి విద్యుత్తు రాజధానిగా ఎదుగుతుందన్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు తక్కువ టారిఫ్‌తో విద్యుత్తు సరఫరా చేస్తున్నది తమ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. వోల్వో ఇండియా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ పాసే మాట్లాడుతూ గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ రంగం 10 శాతం వృద్ధి సాధించిందన్నారు. దేశంలో రూ.78,000 కోట్లు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టారన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. దేశం మొత్తం వాహనాల అమ్మకాల్లో రాష్ట్రలో 9 శాతం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. దక్షిణాదిలో మన రాష్ట్రంలోనే 30 శాతం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఆటో షోకు సంబంధించి క్యాటలాగ్‌ను ఆవిష్కరించారు. ప్రదర్శనలో ఉంచి వివిధ రకాల వాహనాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో సీఐఐ దక్షిణ ప్రాంత మాజీ చైర్మన్ శోభన కామినేని, సీఐఐ హైదరాబాద్ చాప్టర్ మాజీ చైర్మన్ హరిశ్చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.