Tuesday, May 11, 2010

డాట్‌కు కాగ్‌ అక్షింతలు

* దారిమళ్లిన గ్రామీణ టెలిఫోన్‌ సేవల విస్తరణ నిధులు
* బడ్జెట్‌ లోటు తగ్గించేందుకు రూ.18 వేల కోట్లు వినియోగం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్‌ సౌకర్యాలు విస్తరించేందుకు వసూలు చేసిన రూ.18 వేల కోట్లను సద్వినియోగం చేయకపోవడంపై టెలికం శాఖను (డాట్‌) కాగ్‌ తప్పుబట్టింది. వినియోగించని నిధులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడింది.

గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సేవల విస్తరణకు నిధులు సేకరించేందుకు 2002లో విశ్వజనీన సేవా ఆవశ్యక (యూఎస్‌ఓ) నిధిని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిధి పాలనా వ్యవహారాలను డాట్‌ పర్యవేక్షించేది. సర్దుబాటు చేసిన మొత్తం వసూళ్లలో 5% వంతున ఈ నిధికి జమ చేయాలని టెలికం ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ రూపేణ 2002-03 నుంచి 2008-09 వరకు వివిధ కంపెనీల నుంచి రూ.26,163.96 కోట్లను వసూలు చేసిన డాట్‌, అందులో రూ.7,971.44 కోట్లను మాత్రమే ఖర్చు చేసిందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. 2009 మార్చి 31 నాటికి వినియోగించని నిధులు రూ.18,192.52 కోట్లు ఉండాలని, అయితే డాట్‌ ఖాతాల్లో 'ఏమీ లేనట్లు' చూపారని కాగ్‌ పేర్కొంది. ఈ నిధులను బడ్జెట్‌ లోటు తగ్గింపునకు వినియోగించారని గుర్తించినట్లు కాగ్‌ పేర్కొంది.

యూఎస్‌ఓ నిధి కింద వసూలయిన మొత్తాన్ని తొలుత భారత ఏకీకృత నిధిలో జమచేసేవారు. అనంతరం కేంద్రప్రభుత్వం ఈ మొత్తాన్ని యూఎస్‌ఓ నిధికి బదలాయించేది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు అందుబాటు ధరల్లోనే టెలిఫోన్‌ సేవలు అందించేందుకు మాత్రమే ఈ నిధిని ఉద్దేశించారు.

ఇవీ సూచనలు
సేకరించిన నిధిని అదే ఏడాది వెచ్చించేందుకు అనువైన పథకాలను డాట్‌ రూపొందించాలని కాగ్‌ సూచించింది. అప్పుడే యూఎస్‌ఓ నిధి ప్రారంభ ఉద్దేశం నెరవేరుతుందని పేర్కొంది.