Monday, May 31, 2010

నల్లధనంపై పన్ను!

సంబంధిత దేశాలకు సొమ్ము చెల్లిస్తాం
స్విస్‌ బ్యాంకుల ప్రతిపాదన
ఇక ఐటీ చెల్లిస్తేనే స్విస్‌ బ్యాంకుల్లో ఖాతా!
న్యూఢిల్లీ: విదేశీయులు భారీగా కూడబెట్టిన నల్లధనంపై పన్ను విధించేందుకు స్విస్‌ బ్యాంకులు ఎట్టకేలకు అంగీకరించాయి. భారతీయులు సహా పలువురు విదేశీయులు తమ బ్యాంకుల్లో దాచిన డబ్బుపై పన్ను విధించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇలా పన్ను రూపంలో సమకూరిన సొమ్మును తక్షణం సంబంధిత దేశాల ప్రభుత్వాలకు చెల్లిస్తామని ప్రతిపాదించాయి. నల్లధనం దాచిన ఖాతాదారుల వివరాలను వెల్లడించేందుకు మాత్రం నిరాకరించాయి.

ఐటీ అక్రమాలకు బాధ్యత వహించం
ఇకపై ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించిన ఖాతాదారులకే సొమ్ము దాచుకునే అవకాశం కల్పించటాన్ని స్విస్‌ బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. నల్లధనాన్ని భారీ ఎత్తున స్విస్‌ బ్యాంకుల్లో దాచుకోవటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. అదేసమయంలో ఆదాయపు పన్ను చెల్లింపులో అక్రమాలకు పాల్పడిన ఖాతాదారులకు సంబంధించి తాము ఎలాంటి బాధ్యత వహించబోమని స్పష్టం చేశాయి. 'స్విస్‌ బ్యాంకులు భవిష్యత్తులో ఆదాయపు పన్ను చెల్లించిన వారి ఆస్తులను నిర్వహించటం, తమ ఆధీనంలో ఉంచుకోవటంపై దృష్టి సారిస్తాయి' అని స్విస్‌ బ్యాంకర్ల సంఘం(ఎస్‌బీఏ) ప్రకటించింది. స్విస్‌ బ్యాంకింగ్‌ పరిశ్రమ భవిష్యత్తులో అనుసరించే విధానాన్ని ఎస్‌బీఏ ఇటీవల వెల్లడించింది. 'తనిఖీలు నిర్వహించటం, పన్ను చెల్లింపులో ఖాతాదారుల విశ్వసనీయతకు సంబంధించి బ్యాంకర్లను బాధ్యులుగా చేసే ప్రయత్నాలను మేం ప్రాథమికంగా తిరస్కరిస్తున్నాం' అని తెలిపింది. స్విస్‌ ప్రభుత్వంతో చర్చల అనంతరం బ్యాంకర్లు ఈ విధానాన్ని రూపొందించారు. ప్రపంచ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) ప్రమాణాలను పాటించటంద్వారా ఆదాయపు పన్ను చెల్లించిన ఖాతాదారుల ఆస్తులను నిర్వహించటం సాధ్యపడుతుందని ఎస్‌బీఏ తెలిపింది. ఓఈసీడీ ధనిక దేశాల సమాఖ్య. పన్ను ఎగవేతదారుల పట్ల అనుసరించాల్సిన విధానాన్ని ఇది సూచించటంతో పాటు అంతర్జాతీయ పన్ను ప్రమాణాలను నిర్దేశిస్తుంది.

జీ-20 అధినేత ఒత్తిడితో దారికి!
స్విస్‌ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం తాలూకు ఖాతాదారుల వివరాలను బహిర్గతం చేయాల్సిందిగా స్విట్జర్లాండ్‌పై ఏడాది నుంచి అంతర్జాతీయ సమాజం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఖాతాదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచే స్విస్‌ బ్యాంకులు.. నల్లధనం దాచి పెట్టిన వారిపై కఠినంగా వ్యవహరించాలని జీ-20 దేశాధినేతల సమావేశంలో నిర్ణయించటంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫలితంగా స్విస్‌ బ్యాంకులు ఓ మెట్టు దిగాయి. భారత సార్వత్రిక ఎన్నికల సమయంలో నల్లధనం చర్చనీయాంశంగా మారింది. ఖాతాదారుల వివరాలను పరిశీలించేందుకు భారత్‌ను అనుమతించబోమని గతేడాది స్విస్‌ బ్యాంకర్ల సంఘం పేర్కొంది. అనంతరం పన్ను చెల్లింపుల ఒప్పందాన్ని ఇరు దేశాలు మరోసారి సమీక్షించాయి.