
నిర్వాహకుల వెల్లడి
తాజా ప్రదర్శనకు అనూహ్య స్పందన
వాహన రకాలపై ఆసక్తి.. ధరలపై ఆరా
హైదరాబాద్, న్యూస్‌టుడే: ఇక నుంచి ప్రతి సంవత్సరం మే నెలలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వాహన ప్రదర్శనను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. గత నాలుగు రోజులుగా హైటెక్స్‌లో జరిగిన 'ఆటోషో సౌత్ 2010' ఆదివారంతో ముగిసింది. ఈ ప్రదర్శనలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన పలు రకాల బైకులు, కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్రైవింగ్ భద్రతపై నిర్వహించిన కార్యక్రమాలకు మంచి స్పందన లభించింది. తాము ఊహించని రీతిలో వచ్చిన స్పందన.. వచ్చే ఏడాది ప్రదర్శనకు ఊతం ఇచ్చిందని నిర్వాహకులు చెప్పారు. మొత్తం దాదాపు 50,000 మంది సందర్శకులు విచ్చేసి ప్రదర్శనను తిలకించినట్లు, ఆదివారం ఒక్క రోజే 15,000 మంది దాకా తరలివచ్చినట్లు వారు వివరించారు. ప్రదర్శనకు సంబంధించి సోమవారం ఓ ప్రకటనను విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 
బైకుల మోజు.. కార్ల క్రేజుకుర్రకారు మోటర్‌సైకిళ్లు కొనేందుకు ఆసక్తి చూపారు. ఉన్నత వర్గాలతో పాటు మధ్యతరగతి వర్గాల వారు కూడా తమ తమ తాహతులకు తగ్గ, అందుబాటు ధరల్లో ఉన్న కారు కొనేందుకు కుటుంబ సభ్యులతో కదిలి వచ్చారు. రాజకీయ నాయకులు, సినిమాతారలు సైతం వారి ఇమేజ్‌కు తగ్గట్లు ఖరీదైన కార్ల వివరాలు సేకరించారు. అధిక శాతం మంది బుకింగ్ చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజధాని నగరంలో మొదటి సారి ఇంత భారీ ప్రదర్శనను ఏర్పాటు చేయడంతో జనం అధిక సంఖ్యలో వచ్చారు. సందర్శకులు ఉదయం నుంచే హైటెక్స్ హాల్ వద్ద బారులు తీరడం కనిపించింది. ముఖ్యంగా పిల్లల కోసం హోండా కంపెనీ రూపొందించిన బైకులను నడిపేందుకు చిన్నారులు పోటీపడ్డారు. యువత మది దోచేలా రకరకాల ఆధునిక మోడళ్లలో ద్విచక్ర వాహనాలను ప్రదర్శనకు ఉంచడమే కాకుండా టెస్ట్ డ్రైవ్‌కు అవకాశం కల్పించడం గమనార్హం.