Saturday, May 15, 2010

రాష్ట్రస్థాయి ఆస్తిపన్ను బోర్డు ఏర్పాటు

నగరాలు, పట్టణాల్లో హేతుబద్ధీకరణే లక్ష్యం
13వ ఆర్థిక సంఘం నిధుల వ్యయానికి మార్గదర్శకాలు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్ను హేతుబద్ధీకరణ పేరిట రాష్ట్రస్థాయి ఆస్తిపన్ను బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో భాగంగా ఈ బోర్డు అందుబాటులోకి రానుంది. వాణిజ్య భవనాలకు ఆస్తిపన్ను లెక్కింపులో తేడాలు సవరిస్తూ... ఆస్తిపన్ను ఖరారులో తగిన మార్పులను మున్సిపాలిటీలకు ఈ బోర్డు సూచిస్తుంది. రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు 2010-11 నుంచి 2014-15 వరకు ఆయా ఆర్థిక సంవత్సరాలకు రూ.1919.20 కోట్లు 13వ ఆర్థిక సంఘం కేటాయించింది. మార్గదర్శకాల అమలు తీరుపై నిధుల విడుదల ఆధారపడి ఉంటుందని ఆర్థిక సంఘం తెలిపింది. ఈ క్రమంలో నిధుల వినియోగంపై రెండుసార్లు సమావేశమైన పురపాలక శాఖ అధికారులు విధివిధానాలు రూపొందించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను, నీటిఛార్జీల సంస్కరణల ఆధారంగా పట్టణ ప్రణాళిక రూపొందించి నిధులు విడుదల చేయనున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు సాధారణ, పనితీరు గ్రాంటు పేరిట రెండు పద్ధతుల్లో విడుదల అవుతాయి. గత ఏడాదికి మంజూరైన నిధుల వినియోగపత్రాలు సమర్పిస్తే సాధారణ గ్రాంటు, ఏటా మార్చి నాటికి నిర్ణీత తొమ్మిది నిబంధనలు అమలు తీరుపై పనితీరు గ్రాంటు అందుతుంది. వార్షిక ప్రణాళిక తయారీలో స్థానిక ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పనుల పర్యవేక్షణ, కేటాయింపులు, నిధుల మంజూరు కోసం పర్యవేక్షణ, ఆర్థిక విభాగం ఉంటుంది. ఐదేళ్ల వార్షిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించి ఈ ఏడాది జూన్‌ 15లోగా ఆయా పురపాలక మండళ్ల అనుమతి తీసుకోవాలన్న నిబంధన విధించారు. 2010-11 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళిక రూపొందించి ఆగస్టు 31లోగా అనుమతి పొంది, సెప్టెంబరు 15 నాటికి పురపాలక శాఖ కమిషనర్‌కు పంపాలి.

ఈ నిధులతో చేపట్టే పనులు
నిధుల వినియోగానికి సంబంధించి ప్రతి మున్సిపాలిటీ ఏటా జనవరి నాటికి ప్రణాళిక రూపొందించాలి. 13వ ఆర్థిక సంఘం నిధుల కింద చేపట్టాల్సిన పనులను నిర్ణయించారు.

* పీపీపీ పద్ధతిలో సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి.
* డ్రైనేజీల నిర్మాణం, పీపీపీ పద్ధతిలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు నెలకొల్పాలి.
* చెరువుల రక్షణ కోసం ప్రహారీలు, గట్టు పటిష్ఠంతోపాటు మొక్కలు పెంచాలి.
* పార్కులు, ఖాళీ స్థలాల పరిరక్షణ, పట్టణాల్లో వనాలను పెంచడం.
* పురపాలకపాఠశాలల్లో సౌకర్యాలు మెరుగు పరచడం.

ఇవీ నిబంధనలు
* వాణిజ్య, నివాస ప్రాంతాలపై స్థానిక పురపాలక సంఘాలే ఆస్తిపన్ను ఖరారు చేయాలి. ఈ మేరకు ఇప్పటి వరకు గల అవరోధాలు తొలగించి బాధ్యత అప్పగించాలి.
* పురపాలక సంఘాలకు ఆస్తిపన్ను ఖరారులో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రాష్ట్రస్థాయి ఆస్తిపన్ను బోర్డు ఏర్పాటు చేయాలి.
* తాగునీటి సరఫరాలో నిర్వహణ ఖర్చులు, నీటి రుసుం వసూలు మధ్య ఉన్న తేడాను సవరించాలి.
* పురపాలక మండలి ప్రజా ప్రతినిధులు, అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు స్వతంత్ర అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
* పురపాలక సంఘం నిధుల్లో 40శాతం నిధులను మురికివాడల అభివృద్ధికి కేటాయించాలి.