Saturday, May 29, 2010

తెలుగులో ఎస్‌ఎమ్‌ఎస్‌ మరింత సులభం

పాణిని కీ ప్యాడ్‌తో ఇది సాధ్యం
మరో 10 ప్రాంతీయ భాషల్లోనూ లభ్యం
ఉచితంగా సాఫ్ట్‌వేర్‌
వందల కోట్ల మార్కెట్‌ ఇది

లూనా ఎర్గోనమిక్స్‌ సీఈవో అభిజిత్‌
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
మ ప్రాంతీయ భాషల్లో తేలిగ్గా సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌లు పంపాలి. ఆంగ్లం రాని కోట్లాది మంది సులభంగా ఉపయోగించేలా ఉండాలి. ఇందు కోసం అందుబాటులో గల సెల్‌తోనే సాధ్యమయ్యే 'పాణిని కీ ప్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌'ని నొయిడాకు చెందిన లూనా ఎర్గోనమిక్స్‌ కంపెనీ రూపొందించింది. అంతర్జాతీయ టెలికాం సదస్సుకు హాజరైన ఈ కంపెనీ సీఈవో అభిజిత్‌ భట్టాఛార్జీ తమ సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకతల్ని... ఈ రంగానికున్న మార్కెట్‌ వివరాల్ని 'న్యూస్‌టుడే'కు చెప్పారు.

న్యూస్‌టుడే: పాణిని కీ ప్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకతేంటి.... దీన్నెలా ఉపయోగించొచ్చు?
అభిజిత్‌: ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తమ ప్రాంతీయ భాషలో తేలిగ్గా మెసేజ్‌లు పంపొచ్చు. 50 కోట్ల మంది సెల్‌ఫోన్‌ వాడుతుంటే 9 కోట్ల మందికే ఆంగ్లంపై అవగాహన ఉంది. మిగతా వారి కోసమే ఈ 'పాణిని' సాఫ్ట్‌వేర్‌ని తయారు చేశాం. తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ, మరాఠీ, కన్నడ...ఇలా పదకొండు ప్రాంతీయ, ఆరు విదేశీ భాషల్లో మెసేజ్‌లు పంపొచ్చు.

? ఈ సాఫ్ట్‌వేర్‌ని ఎలా వాడాలి
ఈ సాఫ్ట్‌వేర్‌ని సెల్‌ఫోన్‌లో లోడ్‌ చేసుకున్నాక ఓపెన్‌ చేస్తే సెల్‌ఫోన్‌ మానిటర్‌ మీద ఆయా భాషలకు చెందిన అక్షరాలు, నెంబర్లతో కూడిన కీ ప్యాడ్‌ వస్తుంది. ఒకవేళ మొదట వచ్చిన కీ ప్యాడ్‌లో అక్షరం లేకపోతే... పక్క పేజ్‌లోకి సులభంగా వెళ్లొచ్చు. అలా మనకి కావాల్సిన అక్షరాలకు సంబంధించిన నంబర్లను ఎంపిక చేసుకోవటం ద్వారా కావాల్సిన సందేశాన్ని తయారు చేసి పంపుకోవచ్చు. చెప్పటం కాస్త క్లిష్టంగా ఉన్నా... వాడటం మాత్రం చాలా సులభం.

? ఒత్తులు, దీర్ఘాల మాటేమిటి
మా సాఫ్ట్‌వేర్‌ కీ ప్యాడ్‌లో అక్షరాలతో పాటు అవసరమైన అన్నీ ఒత్తులు దీర్ఘాల్ని ఏర్పాటు చేశాం. కేవలం అక్షరాలు తెలిసిన ప్రతిఒక్కరూ సులభం టైప్‌ చేసే వీలు ఉంటుంది. ఒక్క తెలుగులోనే కాదు... మేం తయారు చేసిన ప్రతిభాషలోనూ. ఇప్పటికే కొన్ని కీ ప్యాడ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ... వాటన్నింటికీ మించి సులభంగా ఈ కీప్యాడ్‌ను వాడొచ్చు. పాణిని కీ ప్యాడ్‌ని ఇంటెలిజెంట్‌ వర్చువల్‌ కీ ప్యాడ్‌గా చెప్పొచ్చు.

? సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌కి ఛార్జ్‌ చేస్తున్నారా
ఉచితంగానే అందిస్తున్నాం. www.paninikeypad.comవెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరిమిత కాలానికి వినియోగించుకోవచ్చు. గడువు పూర్తయ్యాక మళ్లీ డౌన్‌లౌడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నోకియా జావా సిరీస్‌ ఫోన్లకు మాత్రమే ఈ సాఫ్ట్‌వేర్‌ని వినియోగించుకోవచ్చు. మిగిలిన కంపెనీల సెల్‌ఫోన్లకు సరిపోయేలా తయారుచేసే పనిలో ఉన్నాం. ప్రత్యేకంగా కావాలనుకునే వారికి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాం.

? ఫలితాలు ఎలా ఉన్నాయి
దీనికి అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయి.నోకియా ఇన్నోవేషన్‌ అవార్డ్‌ 2009ను ఈ సాఫ్ట్‌వేర్‌ గెలుచుకుంది. మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌, గూగుల్‌, నోకియాలు ఆసక్తి చూపాయి. కొందరితో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలో ఫలప్రదం కావచ్చు.

?ఈ రంగంలో వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి
రెండేళ్ల క్రితం కంపెనీని ప్రారంభించాం. ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతున్నాం. మా దృష్టి అంతా పరిశోధనలపైనే. భాషా సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌ చాలా పెద్దది. ఎన్నో కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒక్కో సాఫ్ట్‌వేర్‌కు వందల మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.