ఎం.వి.దుర్గాప్రసాద్ రోజువారీ ఆర్థిక వ్యవహారాల్లో చెక్కుల ప్రాధాన్యం ఎంతో.. నగదుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే చెక్కులతో చిక్కులూ అంతే.. మరి ఇంతటి కీలకమైన చెక్కుల విషయంలో తాజాగా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను సూచించింది.
ప్రముఖ న్యాయవాది

ఇందుకు ఆలస్యం..
బాకీ తీర్చడం లేదన్న కారణంతో చాలామంది చెల్లని చెక్కు ఇచ్చాడంటూ కేసులు వేస్తుంటారు. అయితే, కేసుల రద్దీ వల్ల కొన్ని కోర్టుల్లో కేసును స్వీకరించే ప్రక్రియలోనే ఆలస్యం జరుగుతోంది. క్రిమినల్ కేసుల్లో నిందితునికి సమన్లు అందడం తప్పనిసరి. సివిల్ కేసుల్లో లాగా అతడు తప్పించుకుంటున్నాడన్న కారణంపై పేపర్లో ప్రత్యామ్నాయ నోటీసులు ఇచ్చి విచారణ చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకంటే క్రిమినల్ కేసు విచారణ నిందితుడు సమక్షంలోనే జరగాలి. దీనివల్ల నిందితుడికి సమన్లు అందకపోతే, కేసు పురోగతిని నోచుకోదు. సమన్లు అందించేందుకు అధికారికంగా పెద్ద ఫీజులు కట్టక్కర్లేదు. కానీ పోలీసుల ద్వారా సమన్లు అందించాలి. కాబట్టి, పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. స్పీడు పోస్టు, కొరియర్ ఖర్చులు అదనం. వాయిదా వాయిదాకు కేసు వేసిన ఫిర్యాదుదారు కూడా కోర్టుకు హాజరు కావాలి. లేదా అతని గైర్హాజరును కోర్టు క్షమించాలి. అందుకు అర్జీ పెట్టుకోవాలి. క్రిమినల్ కేసులో నిందితుడు సాక్ష్యం పెట్టుకోనక్కర్లేదు. అతడు సాక్ష్యానికి రానందుకు అతనికి వ్యతిరేకంగా పురోభావన చెయ్యడానికి వీల్లేదు. దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా కోర్టులకు సందేహ నివృత్తి కానప్పుడు కేసులను కొట్టివేసే అవకాశం ఉంది. పైగా సాంకేతిక కారణాలు, క్రిమినల్ కేసుల్లో ఎక్కువ నష్టం కలిగిస్తాయి. ఈ కేసు పరిష్కారానికి సంవత్సరాలు పట్టేస్తే ఈ లోపల సివిల్ కేసు వెయ్యాలి. లేకపోతే మూడేళ్లకు సివిల్ చర్యలకు కాల దోషం పట్టేస్తుంది. అప్పుడు రుణదాత పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది.
* జైలుకైనా వెళ్లేందుకు సిద్ధపడిన వ్యక్తిని కోర్టులు ఏమీ చేయలేవు. శిక్ష పడ్డాక కూడా అప్పీలు, ఆ పైన హైకోర్టు, ఇంకా ఓపిక ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. అన్ని కోర్టుల్లోనూ ఓడిపోయిన తర్వాత డబ్బు కట్టేస్తానంటే ఏ రుణదాత అయినా సంతోషంగా రాజీ పడిపోతాడు. ఈ లోపల రుణం ఇచ్చిన వ్యక్తికి బోలెడంత ఖర్చు. ఎగ్గొట్టేవారికి వడ్డీ లెక్క పెట్టుకున్నా ఖర్చులు కలిసి వస్తాయి. ఇవీ క్రిమినల్ కేసుల్లో కష్టాలు.
సుప్రీం చెప్పిందిదీ..
చెక్కులకు సంబంధించి క్రిమినల్ కోర్టుల్లో అనేక కేసులు పేరుకుపోయాయి. వీటిల్లో రద్దీ తగ్గించాలని సుప్రీంకోర్టు కొత్త ఆలోచన చేసింది. ఈ నెల మూడో తేదీన ఓ సంచలనాత్మక తీర్పు చెప్పింది. క్రిమినల్ కేసుల్లో రాజీలకు సంబంధించి మార్గదర్శక సూత్రాల్ని రూపొందించింది.
అవి ఏమిటంటే..
సమన్లు అందగానే నిందితుడు నేరాన్ని అంగీకరించి రాజీ కోరితే ఎలాంటి ఖర్చులు వెయ్యరాదు. అలా అని సమన్లలో పొందుపర్చాలి. తర్వాత అంటే ఒకటి, రెండు వాయిదాల తర్వాత రాజీ కోసం అర్జీ పెట్టుకుంటే, చెక్కు సొమ్ములో పది శాతాన్ని న్యాయ సేవాధికార సంస్థకు కట్టేలా షరతు విధించాలి.
* నేరం రుజువై శిక్ష పడిన తర్వాత అప్పీలులోనో, హైకోర్టులోనే రాజీ కొస్తే చెక్కు సొమ్ములో 15 శాతాన్ని ఖర్చులు విధించాలి.
* అదే సుప్రీంకోర్టులో రాజీ కోరితే నిందితునిపై ఖర్చులు చెక్కు సొమ్ములో 20 శాతం వడ్డించాలి. ఈ ఖర్చులు కష్టపడి పోరాడిన ఫిర్యాదుదారుకు మాత్రం కాదండోయ్. న్యాయసేవాధిక సంస్థకు జమ చెయ్యాలి.
* ఫిర్యాదీదారు కేసు ఉపసంహరించుకుంటే సుప్రీంకోర్టు తీర్పు వర్తించదు.
వేధించే వారి మాటేమిటి?
ఈ చెక్కు కేసుల్లో చెక్కులిచ్చిన వారికే కాదు. చెక్కులపై కేసులు వేసే వారికి కూడా ముకుతాడు వేయాలని తీర్మానించింది సుప్రీంకోర్టు.
* చెక్కులిచ్చిన వారిపై వివిధ కోర్టుల్లో కేసులు వేసి వేధించే వారిపై కూడా ఖర్చులు వేయాలంది. ఎలాగంటే, ఇక నుంచి దాఖలు చేసే ఫిర్యాదుల్లో తప్పనిసరిగా ఈ లావాదేవీ గురించి మరెక్కడా, మరే ఫిర్యాదు దాఖలు చెయ్యలేదని విధిగా ప్రకటించాలి. ఈ ప్రకటన ప్రమాణ పూర్వకంగా పత్రాన్ని దాఖలు చేసి మరీ చెప్పాలి. పలు కేసులున్నాయని రుజువైతే, కేసులన్నింటినీ మొదటి కేసున్న కోర్టుకే బదిలీ చేయాలి. అంతేకాదు.. ఫిర్యాదుదారుపై భారీగా ఖర్చులు వడ్డించాలి.