Tuesday, May 11, 2010

నగరమేదైనా చిటికెలో సమాచారం

సరికొత్త సేవలందించే యత్నాల్లో డీఐఎస్‌
శ్రీకర్‌ ఆఫీసు పనిపై తిరువనంతపురం వెళ్లాడు. అక్కడికి వెళ్లిన పని పూర్తయ్యాక తిరుగు ప్రయాణానికి సాయంత్రం వరకు రైలు లేదు. ఈలోగా పిల్లలకు షాపింగ్‌ చేద్దామన్న ఆలోచన వచ్చింది. కానీ, తనకు ఆ వూరు పూర్తిగా కొత్త. దాంతో ఎక్కడికెళ్లాలో తెలియక షాపింగ్‌ ఆలోచన మానుకుని సాయంత్రం వరకు కాలక్షేపం చేసి రైలెక్కి తిరుగుముఖం పట్టాడు.

ప్రసాద్‌కు హైదరాబాద్‌కు బదిలీ అయింది. కంపెనీ అతిథి గృహంలో బస చేసిన ఆయనకు రాత్రి ఒక్కసారిగా ఛాతీలో నొప్పిగా అనిపించింది. వెంటనే వైద్యుడిని సంప్రదిద్దామనుకున్నా స్థానిక డాక్టర్ల అడ్రసులు, ఫోన్‌ నంబర్లు తెలియవు. దాంతో ఆ రాత్రంతా బాగా ఇబ్బంది పడ్డాడు.

అవసరమైన సమాచారం దొరక్క శ్రీకర్‌, ప్రసాద్‌ల మాదిరే ఎప్పుడో ఒకప్పుడు మనమూ ఇబ్బంది పడిన సందర్భాలు ఉండి ఉండొచ్చు. ఈ తరహా సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. కేరళకు చెందిన డైరెక్ట్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ (డీఐఎస్‌) సంస్థ మొబైల్‌ సంక్షిప్త సందేశ సేవ (ఎస్‌ఎంఎస్‌) రూపంలో ఇక అవసరమైన సమాచారాన్ని అందించే ప్రయత్నాల్లో ఉంది. దేశంలో ఏ నగరం, ఏ పట్టణంలో ఉన్నా అక్కడి షాపింగ్‌ మాల్స్‌, ఆసుపత్రులు, వైద్యులు, ఫార్మసీ దుకాణాలతో పాటు ఇతర అవసరమైన సేవన్నింటిని గురించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ఐడీ సేవల ద్వారా వివరాలను అందించనుంది.

ఏం చేయాలంటే: ఉదాహరణకు తిరువనంతపురంలో షర్ట్‌ కొనాలనుకున్న వ్యక్తి మొబైల్‌ ద్వారా Direct (space) tvm (space) yp (space) shirts అని టైప్‌ చేసి 56070కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే సరి. తిరువనంతపురం జిల్లాలోని వస్త్ర దుకాణాల వివరాలు తిరుగు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఆ వ్యక్తికి చేరుతాయి. ఇలా కావల్సిన సేవలు, ఉత్పత్తుల గురించి వివరాలను ఒకే ఒక్క ఎస్‌ఎంఎస్‌ ద్వారా డీఐఎస్‌ అందించనుంది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా సరే సమాచారం తెలుసుకోవాలన్నా ఎస్‌ఎంఎస్‌ ఐడీ 56070 మాత్రం మారదు.

డీఐఎస్‌ సమాచారం ఎలా అందిస్తుందంటే: డీఐఎస్‌ ముందుగా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలలోని దుకాణాలు, కంపెనీలు, ఇతర వాణిజ్య సముదాయాలకు ఒక్కొక్కరికి ఒక్కో ఎస్‌ఎంఎస్‌ ఐడీని అందిస్తుంది. ఈ ఐడీలన్నింటినీ ఆయా హెడ్‌ కింద డేటాబేస్‌ రూపొందించి వర్గీకరిస్తుంది. సమాచారం కావలసిన వ్యక్తి ఎస్‌ఎంఎస్‌లో ఎక్కడ (పై ఉదాహరణలో తిరువనంతపురం టీవీఎమ్‌), ఏం కావాలో సూచిస్తూ (ఎస్‌ఎంఎస్‌లో షర్ట్‌) పంపిన సమాచారం మేరకు సంబంధిత హెడ్‌ కింద ఉన్న పూర్తి సమాచారం ఆ వ్యక్తికి ఎస్‌ఎంఎస్‌ల రూపంలో అందుతుంది. ఎస్‌ఎంఎస్‌ ఐడీ ఇచ్చేందుకు డీఐఎస్‌ ఒక్కొక్క వాణిజ్య సంస్థ, వ్యక్తుల నుంచి ఏడాదికి రూ.500 వసూలు చేస్తోంది. ఇందుకోసం డీఐఎస్‌ ప్రపంచవ్యాప్త పేటెంట్‌ హక్కులను కూడా తీసుకొంది.