50 శాతం విద్యుత్ ఆదా
'న్యూస్‌టుడే'తో టీఎస్‌బీ డైరెక్టర్ మాల్కం జాన్సన్
రక రకాల మొబైల్ ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి రకరకాల ఛార్జర్లు అవసరం అవుతున్నాయి. దీనికి భిన్నంగా ఒకే ఛార్జర్‌తో అన్ని మొబైల్ ఫోన్లను రీఛార్జి చేయగలిగేతే అనే ఆలోచన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) వచ్చింది. దీంతో ఛార్జర్‌కు సార్వత్రిక (యూనివర్సల్) ప్రమాణాలను సిద్ధం చేసింది. ఈ ప్రమాణాలతో త్వరలో మొబైల్ ఛార్జర్ అందుబాటులోకి రానుందని ఐటీయూకు చెందిన టెలికమ్యూనికేషన్ స్టాండర్త్డెజేషన్ బ్యూరో (టీఎస్‌బీ) డైరెక్టర్ మాల్కం జాన్సన్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. దీని వల్ల ఎక్కువ ఛార్జర్లను వినియోగించాల్సిన అవసరం ఉండదని, పర్యావరణానికి మేలు జరుగుతుందని వివరించారు. ఇ-వ్యర్థాలు తగ్గుతాయి. విద్యుత్ ఆదా అవుతుందని అన్నారు. ఆయన వెల్లడించిన మరిన్ని అంశాలు: ?మొబైల్ ఛార్జర్‌కు సార్వత్రిక ప్రామాణికాలను నిర్ణయించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరతాయి
ఇంధన ఖర్చు దాదాపు 50 శాతం తగ్గుతుంది. ప్రతి ఏడాది పనికి రాకుండా పోయే 51 వేల టన్నుల ఛార్జర్లను నివారించవచ్చు. ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా 1.36 కోట్ల టన్నుల పర్యావరణానికి హాని కలిగించే వాయువులను తగ్గించవచ్చు.
?సార్వత్రిక ప్రమాణాలను రూపొందించాలన్న ఆలోచన ఎలా కలిగింది
కొపెన్‌హగెన్ పర్యావరణ సదస్సుకు అనుగుణంగా పర్యావరణానికి మేలు చేసే ఛార్జర్‌ను రూపొందించాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఐటీయూకు చెందిన పర్యావరణ అధ్యయన కమిటీ సార్వత్రిక ప్రమాణాలను రూపొందించింది. వీటిని గత అక్టోబరులో ఐటీయూ ఆమోదం తెలిపింది. జీఎస్‌ఎమ్ ఆపరేటర్ల సంఘం సలహాలు, సూచనలు మేరకు ప్రమాణాలను రూపొందించారు. టెలికం రంగంలోని 700 కంపెనీల అభిప్రాయాలను సేకరించాం. మైక్రో-యూఎస్‌బీ ఇంటర్‌ఫేస్ సహా 4 నక్షత్రాల రేటింగ్ ఈ ఛార్జర్‌కు ఉంటుంది.
?కొత్త సార్వత్రిక ఛార్జర్ వల్ల భారత్‌లో ఎంత విద్యుత్ ఆదా అవుతుంది
భారత్ టెలికాం రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి నెల కొత్తగా కోటికి పైగా వినియోగదారులు మొబైల్ చందాదారుల జాబితాలో వచ్చి చేరుతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే కొత్త ఛార్జర్ వల్ల భారీగా విద్యుత్ అదా అవుతుంది. కచ్చితంగా ఎంత ఆదా అవుతుందనేది చెప్పలేను.
?ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా ఇటువంటి సార్వత్రిక ప్రమాణాలను రూపొందించే వీలుందా
ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా ఇటువంటి సార్వత్రిక ప్రమాణాలను రూపొందించే యోచన ఉంది. పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రమాణాలు రూపొందించే ప్రక్రియ చివరి దశలో ఉంది. అయితే.. ఐటీయూ సభ్య దేశాలు వీటికి ఆమోద ముద్ర వేయాలి.
?ఇ-వ్యర్థాల సమస్య ఎలా ఉంది
ఇ- వ్యర్థాల సమస్య చాలా ఆందోళన కలిగిస్తోంది. వీటిని తగ్గించడానికి ఐటీయూ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే సార్వత్రిక ప్రమాణాలను రూపొందించాం. ఇ-వ్యర్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలిస్తున్నారు. దీన్ని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సౌర శక్తి వంటి సంప్రదాయేతర ఇంధనాలతో పని చేసే మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలను అభివృద్ధి చేయడాన్ని యూనియన్ ప్రోత్సహిస్తోంది.
| విదేశీ ప్రతినిధులతో కళకళ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు హైదరాబాద్ - న్యూస్‌టుడే బిµన్న దేశాలు... విభిన్న సంస్కృతులు... వైరుధ్య నేపధ్యాలు... టెలికాం రంగానికి చెందిన ప్రముఖులు భారీగా ఒకే చోట చేరితే... కచ్ఛితంగా సందడిగానే ఉంటుంది. నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచ టెలికమ్యూనికేషన్ అభివృద్ధి సమావేశం (డబ్ల్యూటీడీసీ) సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. సుమారు 120కి పైగా దేశాలకు చెందిన 650 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సోమవారం ప్రారంభమైన సదస్సు జూన్ నాలుగో తేదీ వరకు జరుగుతుందని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సెక్రటరీ జనరల్ హెచ్.ఇ. డాక్టర్ హమదౌన్ టోర్ తెలిపారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో సదస్సు నిర్వహిస్తున్న సభాస్థలి వద్దకు ఉదయం తొమ్మిది గంటలకే ప్రతినిధులు చేరుకోవటంతో సందడి మొదలైంది. పెద్ద సంఖ్యలో విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మాదాపూర్ నుంచి హెచ్‌ఐసీసీ వెళ్లే రహదారిలో ప్రత్యేక పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హజరయ్యేందుకు వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పలు సేవలు: విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సదస్సులో ప్రత్యేకంగా సమాచార కేంద్రాన్ని, విదేశీ మారక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విదేశీ, స్వదేశీ మీడియా ప్రతినిధుల కోసం ఇంటర్నెట్ కేంద్రాన్ని సిద్ధం చేశారు. సదస్సులో పాల్గొనేందుకు వచ్చే వారి రిజిస్ట్రేషన్ల కోసం జెనీవా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం నిర్విరామంగా పని చేస్తోంది. |
| మొబైల్ వినియోగదారులు! * 2006లో దోహా సమావేశం తరువాత టెలికం రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. * నాలుగేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 220 కోట్ల మంది మొబైల్ చందాదారులు ఉంటే.. ఈ ఏడాదిలో ఈ సంఖ్య 500 కోట్లకు చేరనుంది. * మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు 7.1 కోట్ల నుంచి 67 కోట్లకు పెరిగారు. * సాధారణ (ఫిక్స్‌డ్) బ్రాడ్‌బ్యాండ్ చందాదారులు రెట్టింపునకు పైగా పెరిగి, 21.2 కోట్ల నుంచి 52.7 కోట్లకు చేరారు. * టెలికం రంగ చరిత్రలోనే తొలిసారిగా సాధారణ ఫోన్ల చందాదారుల సంఖ్య క్షీణిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 3.6 కోట్ల మంది మాత్రమే ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు. * గత నాలుగేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొబైల్ ఫోన్ల వాడకం 270 శాతం పెరిగింది. ఈ దేశాల్లో మొత్తం 250 కోట్ల మంది చందాదారులు ఉంటే.. 200 కోట్ల మంది 2006 ప్రారంభం నుంచి ఈ ఏడాది ప్రారంభం నాటికి చందాదారులుగా మారిన వారే. * గత నాలుగేళ్లలో కొత్తగా 77.7 కోట్ల మంది అంతర్జాలం (ఇంటర్నెట్) చందాదారులుగా మారితే.. అందులో 60 కోట్ల మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారే. * దోహాలో జరిగిన సమావేశం నాటికి ఫేస్‌బుక్ వినియోగదారులు కొద్ది మందే ఉంటే.. ఈ నాలుగేళ్లలో సామాజిక వెబ్‌సైట్లకు విపరీతంగా ఆదరణ పెరిగింది. ప్రస్తుతం ప్రతి రోజూ 5 కోట్ల మంది ట్వీట్స్ పంపుతున్నారు. 40 కోట్ల మంది ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. * పారిశ్రామిక దేశాల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి అంతర్జాలం అందుబాటులో ఉంటే (ఇంటర్‌నెట్ యాక్సెస్), అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి అయిదుగురిలో నలుగురికి ఇంకా ఈ సదుపాయం లేదు. * వర్థమాన దేశాల్లో సాధారణ, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ విస్తృతి (పెనిట్రేషన్) వరుసగా 3.5 %, 3.3 % మాత్రమే ఉంది. |
